breaking news
Subbarayan
-
సమ్మెను నీరుగార్చింది అశోక్‌బాబే
ఏపీఎన్జీవోల మాజీ నాయకుడు సుబ్బరాయన్ సంచలన వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో 66 రోజుల పాటు చేసిన ఉద్యమం తాత్కాలిక అధ్యక్షుడు అశోక్‌బాబు స్వార్థం వ ల్లే నీరుగారిపోయిందని ఆ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన అశోక్‌బాబు తీరుపై విరుచుకుపడ్డారు. అశోక్‌బాబు రాజకీయంగా ఎదిగేక్రమంలోనే ఉద్యమాన్ని అవకాశంగా వాడుకుంటూ ఒంటెత్తు పోకడలతో స్వార్థ ప్రయోజనాలకోసం పనిచేస్తూ పరోక్షంగా రాష్ట్ర విభజనకు సాయం చేస్తున్నారని ఆరోపించారు. స్వామిగౌడ్ లాంటి తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు అన్ని రాజకీయ పక్షాలను ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఏర్పాటుకు ముమ్మరంగా కృషి చేస్తే, అశోక్‌బాబు అందుకు విరుద్ధంగా వ్యక్తిగత ఎదుగుదలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారన్నారు. అన్ని రాజకీయపార్టీలతో రాజకీయ జేఏసీని ఏర్పాటు చేయకపోవటం ఆయన చేసిన చారిత్రక తప్పిదమన్నారు. ఉద్యమానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు భారీగా విరాళాలిచ్చినట్లు ఉద్యోగులే పేర్కొంటున్నారని, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో కూపన్లు అమ్మగా భారీగా డబ్బులు సమకూరాయని, ఇప్పటి వరకు వీటి జమాఖర్చులు వెల్లడిచేయకపోవటమేమిటని ప్రశ్నించారు. అశోక్‌బాబును తాత్కాలిక అధ్యక్షుడిగా మాత్రమే నియమించారని, ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవద్దనే ఆదేశాలు కూడా ఉన్నాయని, కానీ ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు రాగానే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని పేర్కొంటున్న ఓ ముఖ్య నేత ‘సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటి’ అనే పేరుతో పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారని, ఆ పార్టీ ఖరారు కాగానే అశోక్‌బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి అందులో చేరటం ఖాయమన్నారు. చిలక జోస్యుడిలా మాట్లాడే కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎంపీ చేతిలో అశోక్‌బాబు కీలుబొమ్మగా మారాడన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకోవటం ద్వారా విభజన ప్రక్రియను నిలవరించే అవకాశం ఉందని తెలిసీ అశోక్‌బాబు రాజకీయపార్టీలను అవమానించేలా ఎల్బీస్టేడియంలో సభ నిర్వహించారని విమర్శించారు. 66 రోజుల ఉద్యమ కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలని ఆయన ఏనాడూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని, ఇప్పుడు మళ్లీ ఉద్యమంలోకి రమ్మంటే ఉద్యోగులు ఎలా వస్తారని ప్రశ్నించారు. అశోక్‌బాబు తీరుతో విసిగిపోయిన కొందరు ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఈనెల 8న శ్రీకాకుళంలో సమావేశం నిర్వహిస్తున్నారని, దీనికి ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డిని కూడా ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సంఘాన్ని కాపాడుకునేందుకు వ్యవహరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడడమే కాకుండా సమాజ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే ఈ గొప్ప సంఘం కళ్లముందే నాశనమవుతుంటే చూడలేక, ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు రాజీనామా చేసి ఏపీఎన్జీవోల సంఘం పునర్నిర్మాణం కోసం వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆదర్శంగా, అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా మెలుగుతున్న తరుణంలో విభజన పేరుతో వారిని విడ దీస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో సతీశ్‌కుమార్, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలు అవాస్తవం: అశోక్‌బాబు తనపై ఆరోపణలు చేసిన సుబ్బరాయన్ అసలు ఏపీఎన్జీవో సంఘం సభ్యుడే కాదని అశోక్‌బాబు పేర్కొన్నారు. మనసులో ఏదో కక్షపెట్టుకుని చవకబారు ఆరోపణలు చేస్తున్నారని, అసలు ఆయన చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అశోక్‌బాబు కొట్టిపడేశారు. శనివారం సాయంత్రం ఎన్జీఓ హోమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుబ్బరాయన్ ఆరోపణలకు స్పందించాల్సిన అవససరం కూడా లేదన్నారు. -
సుబ్బరాయన్ సభ్యుడేకాదు: అశోక్‌బాబు
హైదరాబాద్: సుబ్బరాయన్ ఏపిఎన్జిఓ సభ్యుడు కాదని ఏపిఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. అశోక్‌బాబు ఏకపక్ష ధోరణితో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, సమైక్యవాద ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత అతనిదేనని సుబ్బరాయన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఆ విమర్శలపై అశోక్ బాబు స్పందించారు. స్థాయిలేని వ్యక్తుల ఆరోపణలకు తాను సమాధానం చెప్పనన్నారు. ఈనెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. విభజనకు వ్యతిరేకంగానే అసెంబ్లీలో పార్టీలన్నీ అభిప్రాయం చెప్పాలని అశోక్‌బాబు కోరారు. -
'అశోక్‌బాబుకు ఇంగిత జ్ఞానం లేదా'
ఏపీఎన్జీవో తాత్కాలిక అధ్యక్షుడు పి.అశోక్బాబుది ఏకపక్ష ధోరణితో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఏపీఎన్జీవో నేత సుబ్బరాయన్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సుబ్బరాయన్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీవోలు గతంతో 66 రోజులు ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత అశోక్ బాబుదని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక ఏపీఎన్జనీవో సంస్థ ఇప్పుడు అసమర్థ నాయకత్వం కింద నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రకంగా స్వార్థపరుల నాయకత్వం కింద ఏపీఎన్జీవో నడుస్తోందన్నారు. రాజకీయ లబ్దికోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని వాడుకున్నారంటూ ఆయన అశోక్‌బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ నేతలను కూడా ఉద్యమంలోకి రానీయలేదని సుబ్బరాయన్ పేర్కొన్నారు. రాజకీయపార్టీలను కలుపుకోకపోతే విభజన బిల్లును అసెంబ్లీ, పార్లమెంట్లలో అడ్డుకునేది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగులు ఉద్యమం చేస్తే రాజకీయ నిర్ణయం మారుతుందా అంటు అశోక్‌బాబుపై మండిపడ్డారు. అశోక్‌బాబు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. అశోక్‌బాబు దిశా నిర్దేశం లేని వ్యక్తి అని సుబ్బరాయన్ అభివర్ణించారు. అశోక్‌బాబు కేవలం ఒక్క రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యోగసంఘాలు చేపట్టిన ఉద్యమాన్ని చూసి అశోక్ బాబు పాఠాలు కూడా నేర్చుకోలేదని వ్యాఖ్యానించారు. అశోక్‌బాబు కనీసం పొలిటికల్ జేఏసీని కూడా నిర్మాణం చేయలేదని సుబ్బరాయన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.