breaking news
Subbam Hari
-
ఆత్మాహుతి వ్యాఖ్యలతో లోక్సభలో అప్రమత్తత
న్యూఢిల్లీ : సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఆత్మాహుతి చేసుకుంటానని ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలపై లోక్ సభలో విచారణ జరిగింది. దాంతో స్పీకర్ మీరాకుమార్ ముందు జాగ్రత్త చర్యగా లోక్ సభ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే.. వెల్ లోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను అని సబ్బం హరి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తనతోపాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు. -
'బిల్లు పెడితే సభలోనే ఆత్మాహుతి చేసుకుంటా'
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభలో ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఆత్మాహుతి చేసుకుంటానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే.. వెల్ లోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను అని సబ్బం హరి అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తనతోపాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2013 కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సబ్బం హరి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ తో సహ అన్ని పార్టీల విబేధాలు నెలకొన్నందున పార్లమెంట్ లో ఎప్పుడూ లేనంతగా గందరగోళం ఏర్పడింది. -
రెండో రోజూ లోక్సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల హల్చల్
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రెండో రోజూ లోక్సభలో గందరగోళం సృష్టించారు. రాష్ట్రాన్ని యథాతథంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. వెల్లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వెనక్కు తగ్గాల్సిందిగా పలుమార్లు వారికి సూచించినా నిరసనలు ఆపలేదు. ఉదయం పదకొండు గంటల సమయంలో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు వెల్లో ప్రవేశించి టీడీపీ సభ్యులతో కలిసి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి నిరసనతో పాటు.. కాశ్మీర్లో పాక్ సైనికులు, ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మృతిచెందిన ఘటనపై నెలకొన్న గందరగోళంతో మూడు నిమిషాల్లోనే లోక్సభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ ప్రారంభం కాగానే.. సోనియా సూచనల మేరకు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎస్పీవై రెడ్డి తదితరులు ముందు వరుస స్థానాల వద్దే నిలబడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సబ్బం హరి మాత్రం సభ మధ్యలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ గందరగోళంతో సభ మరోసారి వాయిదా పడింది. దాంతో బయటకు వెళ్లడానికి తన స్థానంలో లేచిన సోనియా గాంధీ.. పోడియం వద్ద నుంచి తిరిగివస్తున్న సబ్బం హరిని ఆపి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నో ముఖ్యమైన బిల్లులను ఆమోదించాల్సి ఉందని, సమావేశాలను సాఫీగా నిర్వహించుకొనేందుకు ఎంతో కష్టం మీద ప్రతిపక్షాలను ఒప్పించగలిగితే... మీరు నిరసనలతో సభకు అడ్డుపడడం మంచిది కాదని సూచించినట్లు తెలిసింది. ‘‘కావాలంటే.. మీరు కూర్చునే మొదటి వరుస స్థానాల వద్ద నిలబడి నినాదాలు చేసుకోండి, ప్లకార్డులు ప్రదర్శించండి. వెల్లోకి మాత్రం వెళ్లవద్దు’’ అని సూచించినట్లు సమాచారం. అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లెదని సబ్బం హరి సోనియాతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, సోనియా సబ్బంహరితో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ జోక్యం చేసుకొని తెలంగాణ గురించి ఏదో చెప్పబోగా... ‘ఆయన మధ్యలో కల్పించుకోవడమేమిటి?’ అని సబ్బంహరి అభ్యంతరం తెలిపారు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని సర్వే సత్యనారాయణను సోనియా ఆదేశించినట్లు సమాచారం.