breaking news
the Sub-Registrars office
-
అవినీతికి రాచబాట
అనంతపురం మెడికల్ : రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి రాచబాట వేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అనుకూలంగా మార్చుకుని యాడికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్ఓ)లో అక్రమాలకు తెరలేపారు. అనంతపురం జిల్లా రిజిస్ట్రేషన్ (డీఆర్) పరిధిలోనివే కాకుండా హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ (డీఆర్) పరిధిలోని ఎస్ఆర్ కార్యాలయాలకు చెందిన డాక్యుమెంట్లను కూడా యాడికిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వేరే ఎస్ఆర్ఓలలో రిజిస్ట్రార్ కానివి, అభ్యంతరం ఉన్న వాటిని ఇక్కడ చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా ఇతర ఎస్‌ఆర్‌లకు సంబంధించి అసైన్డ్ (08) భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క ఆగస్టు నెలలోనే ఇతర ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన 123 డాక్యుమెంట్లు యాడికి ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ అయ్యాయంటే పరిస్థితి ఏమిటనేది అర్థమవుతోంది. ఆగస్టు నాలుగో తేదీ ఒక్క రోజునే గుంతకల్లు ఎస్ఆర్ఓ సంబంధించి (1223 నుంచి 1248) 27 డాక్యుమెంట్లు, 16వ తేదీన (1353) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. తాడిపత్రి ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి ఆగస్టు నెలలో వివిధ తేదీల్లో 41 డాక్యుమెంట్లు యాడికి ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. అనంతపురం రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఆర్ఓ)కు సంబంధించి 20 డాక్యుమెంట్లు, గుంతకల్లు ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి 28 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఈ నెలలో కూడా యాడికి ఎస్ఆర్ఓలో ఇతర ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన డాక్యుమెంట్లు భారీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిసింది. హిందూపురం ఆర్ఓ పరిధిలోనివి కూడా... అనంతపురం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి యాడికి ఎస్ఆర్ఓ వస్తుంది. దీని పరిధిలోని ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలోని ఎస్‌ఆర్‌ఓలకు సంబంధించిన వాటిని యాడికిలో రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయితే ఇక్కడ హిందూపురం ఆర్ఓ పరిధిలోని ఎస్ఆర్ఓకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ పరిధిలోని హిందూపురం ఆర్ఓకు సంబంధించి ఆగస్టు 16వ తేదీన (1355) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ర్ అయ్యింది. చిలమత్తూరు ఎస్ఆర్ఓకు సంబంధించి 7వ తే దీన (1271) ఒక డాక్యుమెంట్, 8న (1284) ఒక డాక్యుమెంట్, 20న (1372, 1374చ 1375) మూడు డాక్యుమెంట్లు, 22న (1402) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి 7న (1276)న ఒక డాక్యుమెంట్ రిజిష్టర్ అయ్యింది. పెనుకొండ ఎస్‌ఆర్‌ఓకి సంబంధించి 4వ తేదీన (1250, 1251) రెండు డాక్యుమెంట్లు, 9న (1300) ఒక డాక్యుమెంట్, 30న (1448) ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ జిల్లాలో అసైన్డ్ (08) భూములను యాడికి ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ఎస్ఆర్ఓల పరిధిలోని 08 భూములకు ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లేకపోవడంతో ఆయా ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేయలేదని తెలిసింది. అలాంటి వాటిని యాడికి ఎస్ఆర్ఓలో చేసినట్లు ఆ శాఖ సిబ్బంది నుంచే ఆరోపణలు వినవస్తున్నాయి. నా దృష్టికి వచ్చింది.. విచారణ చేస్తాము యాడికి ఎస్ఆర్ఓలో జిల్లాలోని ఇతర ఎస్ఆర్ఓల పరిధిలోని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. వివరాలు పంపించాలని ఇప్పటికే ఆదేశించారు. ఈ ఎస్ఆర్ఓలో జరిగిన రిజిస్ట్రేషన్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాము. - కె.అబ్రహం, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ -
కొనసాగుతున్న సమ్మె
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారం రెండోరోజుకు చేరింది. రెండోరోజుకు సమ్మెలో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగింది. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు విధులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ఈ కార్యక్రమం జరిగింది. మహిళా న్యాయవాదులు కూడా రిక్షా తొక్కి తమ నిరసన తెలియజేశారు. పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మూయించిన ఎన్జీఓ నాయకులు అనంతరం అక్కడ ధర్నా చేశారు. ఎపీఎన్జీవో పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే తమ ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. కైకలూరులో జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కలిదిండి సెంటరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను శుక్రవారం జేఏసీ నాయకులు దహనం చేశారు. నూజివీడులో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా కోర్టు సెంటరులో చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలలో న్యాయవాదులు పుట్టా లక్ష్మణరావు, అక్కినేని రమాకుమారి, న్యాయవాద గుమాస్తా కొత్తపల్లి వెంకటేశ్వరరావు కూర్చున్నారు. ముత్తంశెట్టి ట్రస్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షలను ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కణతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుజాతిని ఒక్కటిగా ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటర్లో సెయింట్‌ఆన్స్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో జరిపారు. కంచికచర్లలో స్థానిక సబ్‌ట్రెజరీ కార్యాలయం వద్ద ఎన్జీవోలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పామర్రు జెడ్పీ పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్ర కావాలి, విభజన వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్‌ను స్తంభింపజేసి తమ నిరసన తెలిపారు. ఈ నెల 9న విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానున్న సమైక్య రన్‌కు మద్దతుగా శుక్రవారం కంచికచర్ల శ్రీరాజ్యలక్ష్మీ గ్యాస్ కంపెనీ వద్ద నుంచి 65వ నంబరు జాతీయ రహదారి గుండా నెహ్రూ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, వివిధ ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్య రన్ నిర్వహించారు. కొండపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా కొండపల్లి ప్రధాన కూడళ్లలోని మార్కెట్ సెంటర్, బ్యాంక్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, బీ కాలనీలలో ప్రజలను, ప్రయాణికులను కలుసుకుని రాష్ట్ర విభజన వలన జరిగే నష్టాలు వివరిస్తూ వారితోనే కార్డులు రాయించి రాష్ట్రపతికి పంపారు.