breaking news
sub post office
-
పోస్టాఫీసులో కోటిన్నర స్వాహా
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని సబ్ పోస్టాఫీస్‌లో ఖాతాదారుల సొమ్ము సుమారు కోటిన్నరకుపైగానే సబ్ పోస్టుమాస్టర్ స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. ఖాతాదారులు, పోస్టల్ డిపార్టుమెంట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ సీఐ బీసన్న బుధవారం తపాలా కార్యాలయానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఖాతాదారులు, డిపాజిటర్లు వారి పాసుబుక్‌లతో పెద్ద సంఖ్యలో వచ్చారు. సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ పోస్టాఫీసు ఖాతాదారులకు డూప్లికేట్ పాసుపుస్తకాలు ఇచ్చి ఖాతాలో వేసిన నగదును ఆ పాసుపుస్తకంలోనే రాసి ఇస్తూ నగదును తన సొంత ఖాతాలో జమ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఖాతాదారుల ఫోన్ నంబర్లు కూడా మార్చి వేరే నంబర్లు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఖాతాదారుల అకౌంట్లలోని నగదును విత్‌డ్రా చేసుకోవడంతో పాటు డిపాజిట్‌దారుల సొమ్మును విత్‌డ్రా చేసినట్లు తేలింది. ఖాతా నంబర్లకు లింకయిన ఫోన్ నంబర్లను ముందస్తుగానే మార్చడంతో నగదు విత్‌డ్రా చేసినప్పుడు వేరేవారికి సమాచారం వెళ్లలేదని విచారణలో తేలింది. పసిగట్టని అధికారులు లక్షల రూపాయలు విత్‌డ్రా అవుతుంటే సంబంధిత ఉన్నతాధికారులు పసిగట్టలేకపోయారు. గతంలో ఒక ఖాతా నుంచి చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నా.. ఫోన్ చేసి మీరు మీ నగదును విత్‌డ్రా చేసుకున్నారా అని అడిగే వారని, ఇంత నగదు అతి తక్కవ కాలంలో విత్‌డ్రా అవుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ రెండవ వారంలోనే నగదు లెక్కల్లో తేడా వచ్చినట్లు గమనించి 17వ తేదీన రామకృష్ణను పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే విచారణ చేసిన పోస్టల్ అధికారులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామకృష్ణ డబ్బులతో పరారవుతుంటే పోస్టల్, పోలీస్ శాఖలు ఏం చేసినట్లని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అనుముల మండలం హజారుగూడెంకు చెందిన సదరు సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ శనివారం నిడమనూరు కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. -
సబ్ పోస్టాఫీస్‌లో డిపాజిట్ సొమ్ము స్వాహా!
జిన్నూరు (పోడూరు): జిన్నూరు సబ్‌పోస్టాఫీసులో పలువురు ఖాతాదారులు డిపాజిట్ చేసిన సొమ్ము నెలలు గడిచినా ఆన్లైన్ కాని వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగి కొంత సొమ్మును ఆన్లైన్ చేయకుండా స్వాహా చేసినట్టు పలువురు ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్ చేసిన సొమ్మును ఖాతాదారుల పాస్‌బుక్‌లో నమోదు చేసినా కంప్యూటర్లో ‘ఆన్లైన్’ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విషయం పోస్టల్ అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖాతాదారులను కార్యాలయానికి రప్పించి పాస్‌పుస్తకాలు తనిఖీ చేస్తున్నారు. దీనిపై పాత్రికేయులు పోస్టాఫీసుకు వెళ్లి ఉద్యోగులను వివరణ అడగ్గా ఎటువంటి అవకతవకలు జరగలేదనీ, దీనిపై తాము మాట్లాడకూడదని చెప్పారు. పోస్టాఫీసులో పెద్దమొత్తంలో సొమ్ము స్వాహా జరిగిందని గ్రామస్తుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురు ఖాతాదారులు తాము డిపాజిట్ చేసిన సొమ్ము గురించి ఆందోళనలో ఉన్నారు. పోస్టల్ అధికారులు స్పందించి ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.