breaking news
storys
-
ప్రధాని కోరిన కథ
‘కథలు చెప్పండి... వినండి’ అన్నారు ప్రధాని మోడి. మొన్నటి ఆదివారం ఆయన తన ‘మన్ కి బాత్’లో కథలు చెప్పే సంస్కృతి గురించి మాట్లాడారు. పిల్లలకు కథలు చెప్పడం ఎంత అవసరమో తెలియచేశారు. అంతేకాదు చెన్నైలో గత నాలుగేళ్లుగా పిల్లలకు కథలు చెప్పడమే పనిగా పెట్టుకున్న శ్రీవిద్య వీరరాఘవన్‌ను మెచ్చుకున్నారు. ఆమె కూడా అందరిలాంటి తల్లే. కాకపోతే చాలామంది తల్లులు కథలు చెప్పట్లేదు. ఆమె చెబుతోంది. ఆమె పరిచయం. ‘చిన్నప్పుడు అమ్మ కథ చెప్పనిదే ముద్ద ముట్టేదాన్ని కాదు’ అంటారు శ్రీవిద్య వీరరాఘవన్. ‘మా అమ్మ నాకు అన్నం తినిపించడానికి ఎన్ని కథలు చెప్పేదో లెక్కలేదు. దాంతో నేను నాకు ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి కథల భూతంలా మారిపోయాను. అంటే అల్లావుద్దీన్ దీపాన్ని రుద్దితే భూతం ప్రత్యక్షమైనట్టుగా నన్ను కాస్త అడిగితే కథ ప్రత్యేక్షమయ్యేది. నా చుట్టూ ఉండే వాళ్లకు ఆ వయసులోనే కథలు చెప్పేదాన్ని’ అంటారామె. శ్రీవిద్య వీరరాఘవన్ ఆదివారం హటాత్తుగా వార్తల్లోకి వచ్చారు. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడి తన రేడియో కార్యక్రమం ‘మన్ కి బాత్’లో ఆమె ప్రస్తావన తేవడమే. ‘పిల్లలకు కథలు చెప్పడం చాలా అవసరం. కాని మన దేశంలో కుటుంబాలు కొన్ని ఆ కథలు చెప్పే సంస్కృతికి దూరం అవుతున్నాయి. కథలు చెప్పే ఆనవాయితీని శ్రీవిద్య వీరరాఘవన్ లాంటి వాళ్లు కొనసాగిస్తున్నారు’ అన్నారాయన. ఎవరు ఈ శ్రీవిద్య? కార్పొరేట్ ఆఫీస్‌లో తన హెచ్ఆర్ ఉద్యోగాన్ని ఆమె కొనసాగించి ఉంటే ఈ ప్రశ్న ఇవాళ ఎవరూ అడిగి ఉండేవారు కాదు. అందరిలో ఆమె ఒకరుగా మిగిలి ఉండేవారు. కాని అబ్దుల్ కలామ్, స్వామి వివేకానందలతో ప్రభావితమైన శ్రీవిద్య ‘ఈ ఉద్యోగంలో పడి ఏం చేస్తున్నాను. నేనంటూ సమాజానికి ఏం చేయగలుగుతున్నాను?’ అని ప్రశ్నించుకున్నారు. అప్పటికే ఆమెకు ఒక కొడుకు. పిల్లల ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో ఆమె గమనించారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరూ వారికి కథలు చెప్పడం లేదని అనిపించింది. ‘కథలే గొప్ప వ్యక్తిత్వాలను తయారు చేయగలవు. మెదళ్లను శక్తిమంతం చేయగలవు’ అంటారామె. చిన్నప్పుడు తాను విన్న కథలు ఎందుకు ఇప్పుడు అందరికీ చెప్పకూడదు అనిపించిందామెకు. అలా వచ్చిన ఆలోచనే ‘స్టోరీ ట్రైన్’. ‘పిల్లలు రైలు ప్రయాణంలో ఎన్నో కబుర్లు, కథలు చెప్పుకుంటారు. పిల్లలకు రైలంటే ఇష్టం. అందుకే స్టోరీ ట్రైన్ అనే సంస్థను ఏర్పాటు చేశాను’ అంటారామె. సంస్థ అంటే అదేదో పెద్ద సంస్థ కాదు. ఆమె ఒక్కతే ఆ సంస్థ. ఆ పేరుతో ఆమె చెన్నైలో పిల్లలకు కథలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. నేర్చుకుని చెప్పొచ్చు ‘కథలు చెప్పడం ఒక విద్య. మనం ఎన్ని కథలు విన్నా చెప్పడం రావాలి. నేను కూడా ఈ పని మొదలెట్టేటప్పుడు ‘వరల్డ్ స్టోరీ టెల్లింగ్ ఇన్స్టిట్యూట్’ స్థాపకుడైన డాక్టర్ ఎరిక్ టెల్లర్ వర్క్‌షాప్‌కు హాజరయ్యాను. పిల్లలకు కథలు చెప్పేటప్పుడు గొంతు, ముఖం, శరీర కదలికలు ఎలా ఉండాలి వారిని కథల్లోకి ఎలా ఆకర్షించాలి తెలుసుకున్నాను. ఎంత శిక్షణ ఉన్నా మనకూ కొంత టాలెంట్ ఉండాలి. ఆ మొత్తం అనుభవంతో నేను కథలు చెప్పడం మొదలెట్టాను. స్కూళ్లకు, కాలేజీలకు, పబ్లిక్ ప్లేసుల్లో, టీవీ ద్వారా ఎక్కడ ఎలా వీలైతే అలా పిల్లలకు కథలు చెప్పడం మొదలుపెట్టాను. ప్రొఫెషనల్ స్టోరీటెల్లర్‌గా మారాను. తెనాలి రామ, అక్బర్ బీర్బల్, పురాణాలు.. ఒకటేమిటి అన్ని చెబుతాను. పిల్లలకు కథలు చెప్పడానికి మించిన ఆనందం లేదు. నా కొడుక్కు నేను కథలు చెబుతాను ఇంట్లో. కాని అందరి ఇళ్ళల్లో అమ్మలు ఈ పని చేయకపోవచ్చు. చేస్తే బాగుంటుంది. చేయలేకపోతే కనీసం కథలు చెప్పేవారి దగ్గరికైనా పంపాలి’ అంటారు శ్రీవిద్య. ఫోన్లలో మునిగి, గేముల్లో తేలే పిల్లల్ని తమ జోలికి రావడం లేదు కదా అని వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. దాని వల్ల వారికి వికాసం, ఊహ, కల్పన, సాంస్కృతిక పరిచయం... ఇవన్నీ మిస్ అవుతున్నాయని తెలుసుకోవడం లేదు. ప్రధాని పిలుపు మేరకు తిరిగి ప్రతి ఇంటా కథలు చెప్పే వాతావరణం నెలకొనాలని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ పిల్లలకు ఎన్నో చెప్పొచ్చు నేను వివిధ సందర్భాలలో పిల్లలను కలిసినప్పుడు ఏదైనా కథ చెప్పమని వారిని అడుగుతాను. వారు కథకు బదులు జోకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ కరోనా సమయంలో కుటుంబాలు తమలో తాము దగ్గరయ్యాయి. కాని కొన్ని కుటుంబాలు మన సాంస్కృతిక పరంపరను మిస్ అవుతున్నాయి. కథలు చెప్పడం మన సంస్కృతిలో ఒక భాగం. కథలు పిల్లలకు సంస్కారాన్ని నేర్పుతాయి. మన స్వాతంత్య్ర పోరాటం ఎంతో గొప్పది. ఒక వందేళ్ల పోరాటాన్ని పిల్లలకు శక్తిమంతమైన కథలుగా చెప్పాల్సిన అవసరం ఉంది. – ప్రధాని నరేంద్ర మోడీ, ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో -
కథల్లో అంతరార్థం
మరీ కొరకరాని కొయ్యల వంటి కథల గురించి కాదు గానీ, మెదడుకు కొంత పని పెట్టే ఐదు కథల గురించి చెప్పదల్చు కున్నాను. తిలక్ రాసిన ‘మణిప్రవాళం’ కొరకరాని కొయ్య కిందకే వస్తుంది. ఆయనే రాసిన ‘లిబియా ఎడారిలో’ కూడా కొంచెం కొరకరానిదే. అర్థం చేసుకోవడానికి మరీ అంత మేధ కాకపోయినా, కొంత రీజనింగ్ అవసరమయ్యే కథలు కొన్ని జ్ఞప్తికి రావడం నన్ను ఈ వ్యాసం రాసేలా చేసింది. ఏలూరెళ్లాలి: చాసో రాసిన కథల్లో ఈ రకానికి చెందినవి రెండు మూడున్నాయి. ‘ఏలూరెళ్లాలి’ని మాత్రం ప్రస్తావిస్తానిక్కడ. చాసో దీన్ని ఎందుకు రాశాడా అని ఆలోచించకుండా ఉండలేకపోయాను, కథను చదవటం ముగించాక. సంక్షిప్తంగా కథాంశమేమంటే – తన పక్కింట్లో వుండే ఒక వివాహిత స్త్రీతో అనుకోకుండా శారీరక సంబంధం ఏర్పడుతుంది కథకునికి. ఆమెకు పిల్లలు లేరు. భర్త తీరును బట్టి చూస్తే, పిల్లలు కలిగే అవకాశం కూడా లేదు. అతడు అమాయకుడు, మెత్తని వాడు, వ్యవహార దక్షత లేనివాడు. కొంత కాలమయ్యాక ఆ దంపతులు బదిలీ మీద వేరే ఊరికి పోవటం వల్ల, వాళ్ల గురించిన సమాచారం కథకునికి తెలియదు. తర్వాత ఎన్నో యేళ్లకు కథకుడు ఒక రైల్లో ప్రయాణం చేస్తుంటే అందులో ఆ స్త్రీ, ఆమెతోపాటు తొమ్మిదేళ్ల బాలుడు కనిపిస్తారు. ఆ బాలుడు కథకునికి పుట్టినవాడే అన్న రహస్యాన్ని బహిర్గతం చేస్తుంది ఆమె. తనకు సంతానం కలిగివుండకపోతే తన మరుదులు ఆస్తినంతా లాక్కుని దిక్కు లేనిదానిగా మార్చే వారనీ, ఇప్పుడు తన జీవితానికి ఏ ఢోకా లేదనీ చెప్పి, కృతజ్ఞతలను తెలుపుకుంటుంది ఆమె. ‘‘ఏలూరెళ్లాలి’’ అని కథకుడు అనుకోవటంతో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా చాసో ఒక అక్రమ సంబంధం తాలూకు అనైతికతను సమర్థిస్తున్నాడా? లేక కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతాయంతే. వాటికి యాదృచ్ఛికత, విధిలీల తప్ప వేరే ప్రత్యేక కారణాలంటూ ఉండవు, అని మాత్రమే చెప్పదల్చుకున్నాడా? సాధారణ సందర్భాలలో ఇటువంటి సంబంధాలు గర్హించతగినవే అయినా, ఈ కథలోని చర్య మాత్రం ఒక జీవితాన్ని నిలిపింది. ఇదే ఈ కథలోని విశేషం. సూరిబాబు నవ్వు: రావిశాస్త్రి రాసిన ఈ కథను ఇరవై ఐదేళ్ల క్రితం చదివాను. కథలో సూరిబాబుకు ఒక స్నేహితుడుంటాడు. అతడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతాడు. ఆ సందర్భాల్లో సొంతవాళ్లెవ్వరూ అతనికి బాసటగా ఉండరు. కథ చివరలో ‘‘నాకు అండగా ఉన్న వాళ్లే లేరు’’ అంటూ వాపోతాడు ఆ మిత్రుడు. ‘అప్పుడు సూరిబాబు ఒక వెర్రినవ్వు నవ్వాడు’ అంటూ కథను ముగిస్తాడు కథకుడు. కథను జాగ్రత్తగా చదివితే సూరిబాబు ఒక్కడే ఆ స్నేహితునికి గడ్డు పరిస్థితుల్లో ఎంతో బాసటగా నిలిచాడనే సంగతి తెలిసిపోతుంది. అయితే ఆ విషయాన్ని కథకుడు పూర్తిగా వాచ్యం చేసి చెప్పడు. అవకాశమిస్తే: ఈ కథ వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన ‘జైలు లోపల’ సంపుటిలోనిది. నిరపరాధులైన ఖైదీల గురించి నెహ్రూ చేసిన ఒక సానుభూతికర వ్యాఖ్యను ప్రస్తావించడంతో ప్రారంభమయ్యే ఈ కథ, స్త్రీలకు సమాన హక్కులుండాలనే అంశం మీద భార్యాభర్తలు చేసే చర్చకు దారి తీస్తుంది. అయితే ఈ చర్చకు సమాంతరంగా, ఆళ్వారు స్వామి తాను చూసిన ఒక ఖైదీ తాలూకు దీనగాథను వివరిస్తాడు. ఆ ఖైదీ వేరే రాష్ట్రంవాడు. తన సొంత ఊరికి దగ్గర్లో వుండే జైలుకు మార్చమని అధికారుల వద్ద దీనంగా వేడుకున్నా వాళ్లు మన్నించరు. అన్నపానాదులను మానడంతో చివరకు అతడు ఆ జైలులోనే మరణిస్తాడు. కథకుడు ఇట్లా ఒకే కథలో రెండు వృత్తాంతాలను ఇమడ్చటం ద్వారా ఏం సాధించాడు? స్త్రీల సమాన హక్కులను గురించిన చర్చల్లో ‘‘స్త్రీలమైన మేము కూడా అవకాశమిస్తే పురుషులతో సమానంగా రాణిస్తాం’’ అంటుంది కథకుని భార్య. ఖైదీ చేసుకున్న విన్నపానికి అధికారులు అనుకూలంగా స్పందించి వుంటే అతడు కూడా జీవితంలో రాణించే వాడేమో అనే అర్థం వచ్చేలా చూచాయగా చెప్తాడు కథకుడు. దీన్ని పట్టుకుంటే, రెండు వృత్తాంతాలలోని సామ్యం బోధపడుతుంది. చాలా తేటతెల్లంగా చెప్పడం చాసో కథల్లో సాధారణంగా కనపడదు. లేదా, ఇదే విషయాన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు: కథనంలో కొంత యుక్తిని ప్రవేశ పెట్టడం మంచిదే అనే అభిప్రాయం ఉన్నవాడు చాసో. రావిశాస్త్రి, ఆళ్వారుస్వామి మాత్రం కథలను తేటతెల్లంగా రాసేవాళ్లే. ఈ కథలను మాత్రం ఈ విధంగా రాయటం ఉద్దేశపూర్వకమైనా కావాలి, లేదా యాదృచ్ఛికమైనా కావాలి. ఆంగ్ల కథల్లో కూడా ఇటువంటి చమత్కారాలున్న సందర్భాలున్నాయి. The Dream: ఈ మామ్ కథను దాదాపు నలభై సంవత్సరాల కిందట నేను తెలుగులోకి అనువదిస్తే, ‘విపుల’ వారు ప్రచురించారు. ఒక రష్యన్ వ్యక్తి వేరే దేశపు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ, వాళ్ల మధ్య విపరీతమైన ద్వేషాలుంటాయి. ఆ భార్యాభర్తలు ఎన్నో అంతస్తులున్న భవనంలోని పై అంతస్తులో నివసిస్తుంటారు. న్యాయవాది అయిన ఒక పాత మిత్రునితో కలిసి ఒక హోటల్లో భోజనం చేస్తూ, తన భార్య పైనుండి గ్రౌండ్ ఫ్లోర్‌లోని నేల మీద పడి చనిపోయినట్టు ప్రతిరోజూ కల వస్తోందని చెప్తాడు ఆ భర్త. ఒకరోజు నిజంగానే ఆమె కింద నేల మీద పడి చనిపోయి వుంటుంది. అంతటితో కథ ముగుస్తుంది. అతను నిజంగా తన భార్యను హత్య చేశాడా? అనే సందేహం పాఠకుని మెదడును తినేస్తూనే వుంటుంది. A Friend in Need: జపాన్ లోని కోబె పట్టణంలో బర్టన్ అని ఒకాయనుంటాడు. అతడు బ్రిడ్జ్ బాగా ఆడుతాడు. కానీ, అదే పేరు గల మరొకతడు మొదటి బర్టన్ను చాలాసార్లు బ్రిడ్జ్‌లో ఓడిస్తాడు. కొంత కాలం తర్వాత ఈ రెండవ బర్టన్ దారుణమైన ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతుంటాడు. అతడు మొదటి బర్టన్ దగ్గరికి వచ్చి, తనకు ఉద్యోగమివ్వమని ప్రార్థిస్తాడు. ‘‘నువ్వు ఏ పని చేయగలవు?’’ అని మొదటి బర్టన్ అడిగినప్పుడు, ‘‘ఈదగలుగుతాను’’ అని జవాబిస్తాడు. ఒకప్పుడతడు మంచి ఈతగాడే. కానీ, ఇప్పుడు చాలా పీలగా, బలహీనంగా ఉన్నాడు. మొదటి బర్టన్ ‘‘నువ్వు సముద్ర తీరంనుండి ఈదడం మొదలుపెట్టి, అదే సముద్రంలో మరోచోట వున్న బండరాళ్ల దగ్గరికి చేరుకోవాలి’’ అంటాడు. ‘‘నేనిప్పుడు బలహీనంగా ఉన్నాను కనుక, ఈదటం కష్టం’’ అంటాడతడు. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం నేను లైట్ హౌస్ చుట్టూ ఈదుతూ బండరాళ్ల దగ్గరికి చేరుకునే వాణ్ని. ఈ దూరాన్ని ఈదటానికి నీకు గంటపావుకన్న ఎక్కువ సమయం పట్టదు, నేను కొంచెం ఆలస్యంగా కారులో వస్తానక్కడికి’’ అంటాడు మొదటి బర్టన్. అయితే అంత సమయం గడిచినా రెండవ బర్టన్ ఆ రాళ్లగుట్ట దగ్గర కనిపించడు. ‘‘ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని ఈదలేదా?’’ అని అడుగుతాడు కథకుడు. ‘‘సుడిగుండాల్లో చిక్కుకుని మరణించి వుంటాడు. మూడు రోజులదాకా అతని శవం దొరకలేదు’’ అంటాడు బర్టన్. ‘‘అతడు ఈదలేక మునిగిపోతాడని ముందుగానే ఊహించావా?’’ అని అడుగుతాడు కథకుడు. అప్పుడు దాపరికం లేని నీలికళ్లతో గెడ్డాన్ని రుద్దుకుంటూ ‘‘అప్పుడు నా ఆఫీసులో ఖాళీ లేదు మరి’’ అని జవాబిస్తాడు బర్టన్. ఇది కూడా మామ్ రాసిన కథే. లాటిన్ అమెరికన్ కథకులు కూడా కొందరు ఇటువంటి కథలను రాశారు. వీటిలో హూలియో కొర్తాజర్ రాసిన Letter to a Young Lady in Paris, ఉక్తావియో పాజ్ రాసిన The Blue Bouquet చెప్పుకోతగినవి. కొర్తాజర్ కథ అద్భుతమైన కవితా వచనంతో నిండి వుంటుంది. అంతే కాక, కథాంశం మాంత్రిక వాస్తవికతతో కూడుకున్నది. లిఫ్టు్టలో పై అంతస్తులకు పోతుంటే మధ్యమధ్యన కథానాయకుని గొంతులోంచి అకస్మాత్తుగా చిన్న కుందేలు పిల్లలు బయటికి వచ్చినట్టు చెప్తాడు రచయిత. అవి పుస్తకాలకు ప్రతీకలు అని కొందరు పాఠకులు మాత్రమే ఊహించగలుగుతారు – అదీ కథ చివరి దాకా వచ్చింతర్వాతనే. ఉక్తావియో పాజ్ రాసిన కథ పెద్ద పజిల్ లాగా ఉంటుంది. పాఠకుల ఊహాశక్తిని పరీక్షకు పెట్టే ఇటువంటి కథలు కూడా అప్పుడప్పుడు కొన్ని రావటం మంచిదేనేమో అనిపిస్తుంది, బాగా ఆలోచిస్తే. ఎలనాగ 9866945424