breaking news
Sri laksmi
-
ఆర్థిక కష్టాలు.. నేను నటించకపోతే అమ్మ విషం తాగి చస్తానంది: నటి
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలు కలుపుకుని 500కు పైనే సినిమాలు చేసింది నటి శ్రీ లక్ష్మి. 1983లో వచ్చిన రెండు జళ్ల సీతలో నవ్వులు పండించిన ఆమె తర్వాత కూడా కమెడియన్‌గానే రాణించింది. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో ఆమె చెప్పిన బాబూ.. చిట్టీ డైలాగు అప్పటికీ, ఇప్పటికీ ఫేమసే. హావభావాలతోనే కామెడీ పండించే ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి స్టార్‌గా వెలుగొందింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మా నాన్నకు మేము ఎనిమిది మంది పిల్లలం. నాన్న అమర్నాథ్ ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద హీరో. జాండిస్ రావడంతో పని చేయడం మానేశాడు. సైడ్ క్యారెక్టర్లు వస్తే తాను హీరోగా మాత్రమే చేస్తానని మొండికేశాడు. ఆర్థిక కష్టాలు తీవ్రం కావడంతో అమ్మ నన్ను ఇండస్ట్రీలోకి పంపించాలనుకుంది. కానీ నాన్నకు అసలు ఇష్టం లేదు. ఆడపిల్లవి, ఇండస్ట్రీలో కష్టాలు పడటం ఎందుకమ్మా? అన్నాడు. పరిస్థితులు బాలేవు కదా అని బదులిస్తే నా చేతకానితనం వల్లే ఇలా మాట్లాడుతున్నావంటూ బాధపడ్డాడు. శ్రీలక్ష్మి సోదరుడు, నటుడు రాజేశ్ మరోవైపు అమ్మ మాత్రం.. నువ్వు నటిస్తేనే అందరం కడుపునిండా తినగలుగుతాం, లేదంటే విషం తాగి చస్తాం అంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చి 41 ఏళ్లుగా రాణిస్తున్నా. శుభోదయం సినిమాకు హీరోయిన్గా సంతకం చేశాక నాన్న చనిపోయారు. నేను ఇంటిదగ్గర ఉండాల్సి రావడంతో ఆ అవకాశం చేజారిపోయింది. కానీ హీరోయిన్గా చేయకపోవడం వల్లే ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉండగలిగాను. నా తమ్ముడు రాజేశ్ కూడా హీరో అయ్యాడు. ఆరోజుల్లోనే లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఎంత త్వరగా వచ్చాడో అంతే త్వరగా వెళ్లిపోయాడు. సెట్లో ఉన్నంతసేపు నేను సంతోషంగా ఉండేదాన్ని. ఇంటికి వెళ్లాలంటే మాత్రం భయమేసేది. ఆ కష్టాలు, బాధలు భరించలేకపోయేదాన్ని. కానీ మేము ఎనిమిది మందిమి కాస్తా ముగ్గురమే మిగిలాం.. అదే నాకు బాధనిపిస్తూ ఉంటుంది. నాకు పెళ్లైంది. భర్త ఉన్నాడు. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదు, చెప్పను కూడా! ఎందుకంటే తన గురించి అందరికీ తెలియడం తనకిష్టం లేదు. నేను నా కుటుంబంతో చెన్నైలో స్థిరపడ్డాను. అయితే ప్రొఫెషనల్‌గా మాత్రం ఇక్కడే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి. -
ఏడాదైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏడాది గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఏడాది గడువు సరిపోలేదా అని ప్రశ్నించింది. మూడు నెలల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్‌పేట మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి జనవరి 4న ప్రకటించిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన బండారి కొమరేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఏడాది గడిచిందని, రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి మారుతాయని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్ నివేదించారు. రెండు పర్యాయాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతాయని మున్సిపల్ శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...ప్రతివాదులు మూడు నెలల్లో కౌంటర్ దాఖలు చేయాలని, దానిపై రెండు నెలల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి నా పేరు తొలగించండి : శ్రీలక్ష్మి సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)పై సీబీఐ నమోదు చేసిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. మైనింగ్ లీజుల మంజూరులో నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది. -
పెద్దల మాటే పెళ్లిమంత్రం
ఈ ఇంట్లో రెండో అబ్బాయ్ శ్రీరామ్. ఆ ఇంట్లో రెండో అమ్మాయ్ శ్రీలక్ష్మి. ఇద్దర్నీ కలిపి ఒకటి చేసేస్తే? ఏడడుగులు నడిపిస్తే? ఈ ఇంటి పెద్దాయనకి, ఆ ఇంటి పెదనాన్నకీ... ఒకేసారి వచ్చిన ఐడియా! ఐడియా వస్తే సరిపోతుందా? పిల్లల్ని అడగాలి కదా! శ్రీరామ్‌ని అడిగారు... మీ ఇష్టం అన్నాడు. శ్రీలక్ష్మిని అడిగారు... తనదీ అదే మాట! పెళ్లయిపోయింది. పాతికేళ్లు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడీ దంపతుల్ని కదిపి చూడండి... ‘‘అరేంజ్డ్ మ్యారేజ్ ఇంత కుదురుగా ఉంటుందా!!’’ అని ఇద్దరూ ఒకేమాటగా ఆశ్చర్యపోతారు. ఉమ్మడి కుటుంబంలోని కోడలిగా శ్రీలక్ష్మి... నలుగురిలో ఒక తోడల్లుడిగా శ్రీరామ్... సాగిస్తున్న కలుపుగోలు ప్రయాణమే ఈవారం ‘మనసే జతగా...’ మొన్నటి సినీ నటుడు. నిన్నటి సీరియల్ నటుడు, ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు రెండవ కుమారుడు ఏడిద శ్రీరామ్! ‘డిగ్రీ వరకు చదివినా, సినిమా హీరో అనిపించుకున్నా తల్లిదండ్రుల చాటు బిడ్డగానే పెరిగాను’ అంటారు శ్రీరామ్! ‘పెద్దలు కుదిర్చిన వివాహబంధంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాం కనుకనే పాతికేళ్లుగా ఆనందంగా ఉంటున్నాం’ అంటూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాపురం ఉంటున్న శ్రీరామ్, ఆయన అర్ధాంగి శ్రీలక్ష్మి తమ వైవాహిక జీవితం ముచ్చట్లను ఇలా తెలిపారు. శ్రీరామ్: ‘స్వరకల్పన’ సినిమా చేస్తున్న సమయంలో అమ్మానాన్నలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అలా శ్రీలక్ష్మితో నా పెళ్లి అక్టోబర్ 5, 1989 జరిగింది. అప్పటివరకు చెన్నైలోనే ఉండేవాళ్లం. వివాహవ్యవస్థ పట్ల ఉండే గౌరవం, అందులోని ఆనందం... మా అమ్మానాన్నల దాంపత్యం చూసి తెలుసుకున్నాను. మాది ఉమ్మడికుటుంబం. ఇంట్లో అందరికీ నచ్చిన, అణకువ కలిగిన అమ్మాయి నాకు తోడుంటే చాలనుకున్నాను. అలాగే నా జీవితంలోకి శ్రీలక్ష్మి అడుగుపెట్టింది. మా ఇంట అడుగుపెట్టినరోజే తనది కలుపుగోలు స్వభావమనీ, ఆనందంగా ఉండే తత్త్వమనీ అర్థమైంది. ఆ ఆనందం పాతికేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది. నటుడిగా కొనసాగుతూనే సీరియల్స్ వైపు పయనించాను. ఆ తర్వాత ఇక నటనాపరంగా చాలనుకున్న సమయంలో కన్స్ట్రక్షన్ రంగం వైపు ఆసక్తి కనబరిచాను. ఏం చేసినా భార్యగా నన్ను ప్రోత్సహించడంలో తను ముందుంటుంది. జీవితభాగస్వామి అర్థం చేసుకుని ఆలంబనగా ఉండటంలోనే ఉంది అసలైన విజయం. శ్రీలక్ష్మి: మాది కాకినాడ. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలకు నలుగురు ఆడపిల్లలం. నేను రెండవ అమ్మాయిని. మా పెదనాన్న, మామయ్యగారు స్నేహితులు. ముందు ఈ సంబంధం గురించి పెదనాన్న చెప్పినప్పుడు ‘సినిమా రంగానికి చెందిన వ్యక్తి కదా... ఎలా ఉంటారో’ అని భయమేసి వద్దన్నాను. కాని, కుటుంబం చాలా ఉన్నతమైనదని, అబ్బాయి మంచి వాడని పెదనాన్న చెప్పారు. పెద్దవాళ్లు అంతగా చెబుతున్నారంటే నా బాగు గురించే అనుకుని ఒప్పుకున్నాను. ‘ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లాలి, ఎలా నడుచుకుంటానో, ఏం తప్పుపడతారో...’ అని ఎప్పుడూ ఆలోచించలేదు. పెళ్లయ్యాక నాకు మరింత స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. అత్తవారింట్లో అడుగుపెడుతూనే, ఇదే నా ఇల్లు, ఈయనతోనే నా జీవితం అని డిసైడయ్యాను. అప్పటికి వయసురీత్యా కూడా చిన్నదాన్ని కావడంతో మా అత్తగారు నన్ను చిన్నపిల్లలా, సొంత కూతురులా చూసుకునేవారు. తోటికోడలు, అత్త, మామ... ఎక్కడా పరాయి భావన కలగలేదు. ఏ విషయమైనా అందరితో అంత బాగా పంచుకునేదాన్ని. బాధ అనేది ఎవరూ మచ్చుకైనా నా దరికి రానివ్వలేదు. పోనుపోను కుటుంబంలో నా ప్రాముఖ్యం పెరుగుతూ వచ్చింది. మావారు ఇప్పుడు సినిమా నిర్మాతగా మారాలనుకుంటున్నారు. ఏ కొత్త ప్రాజెక్ట్ చేపట్టినా నా సలహా అడుగుతారు. ఏది ఆసక్తిగా ఉంటుందో ఆ పని చేస్తే నూటికి నూరుపాళ్లు విజయం లభిస్తుందని చెబుతుంటాను. మా నాన్నగారికి నలుగురు అల్లుళ్లు. అన్నదమ్ముల్లా కలిసిపోతారు. మా నాన్నగారు ‘ఇది నా అదృష్టం’ అంటారు. శ్రీరామ్: శ్రీలక్ష్మికి మంచి అభిరుచులున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆసక్తి. పెయింటింగ్స్ వేయడమంటే ప్రేమ. నృత్యం, సంగీతం అంటే ఇష్టం. ఇవన్నీ నలుగురిలో తనని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇంటికి కావలసిన డిజైనింగ్‌లోనే కాదు నా వర్క్‌లో కూడా సలహాలు అడిగి తెలుసుకుంటాను. శ్రీలక్ష్మి: శ్రీరామ్ బయటకు సీరియస్‌గా, అంత ఎక్కువ మాట్లాడనట్టు కనిపిస్తారు. కాని ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇంట్లో ఈయన లేకపోతే బోర్‌గా అనిపిస్తుంటుంది. మా అత్తగారు కూడా ఈయన ఇంట్లో లేకపోతే ‘రాంబాబు(శ్రీరామ్) ఎప్పుడొస్తాడు, బోర్‌గా ఉంది’ అని అడుగుతుంటారు. మాకు ఒక పాప. పేరు శ్రీజ. తను ఇప్పుడు అమెరికాలో చదువుకుంటోంది. ముగ్గురం కలిశామంటే పండగే! ఆయన పాపను గారాబంగా చూస్తుంటే, నేను మాత్రం స్ట్రిక్ట్ అనే పేరు తెచ్చుకున్నాను. ఈ విషయంలోనే అప్పుడప్పుడు దెబ్బలాడుతుంటాను. శ్రీరామ్: చిన్న చిన్న గొడవలు, మాటపట్టింపులు మా ఇద్దరి మధ్య వస్తుంటాయి. అలాగని ఏ విషయాన్నీ సాగదీయం. ఎదుటివారిని సాధిద్దామనే ఆలోచన ఉండదు. ఎప్పుడైనా నేనే కాస్త కోపం తెచ్చుకుంటాను. అప్పుడు తను కూల్‌గా ఉంటుంది. తనవైపు కరెక్ట్ అనిపించినప్పుడు నేను కూల్‌గా ఉంటాను. ఇరువైపులా కుటుంబ సభ్యులు ఎక్కువ. అందువల్ల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, వేడుకలూ ... అన్నీ ఎక్కువే! మా కుటుంబంలోని పిల్లలకు, పెద్దవారికి శ్రీలక్ష్మి ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేస్తుంటుంది. శ్రీలక్ష్మి: ఆర్థిక విషయాలు నేనంతగా పట్టించుకోను. కాని, శ్రీరామ్ అవి నాకు తెలియాలనుకుంటారు. అందువల్ల ప్రతిదీ నాతో చర్చిస్తారు. ఆలూమగల మధ్య ఎటువంటి దాపరికాలూ లేకపోతేనే వారిద్దరూ ఆనందంగా ఉండగలరన్న పెద్దల సూచనను ఇద్దరం పాటిస్తాం. తన కింద పనిచేసేవారు తప్పులు చేసినా వారిని ఒక్కమాట కూడా అనరు. డౌన్ టు ఎర్త్ అనిపిస్తారు. ఆ ప్రవర్తన నాకు బాగా నచ్చుతుంది. ఎప్పుడో ఈయన దగ్గర పనిచేసిన వారు కూడా ఇప్పటికీ ఈయనను కలిసి వెళుతుంటారు. ఈయన దేనికీ టెన్షన్ పడరు. నేనే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాను. వాటిని వెంటనే అమల్లో పెట్టవచ్చు కదా! అని అడుగుతుంటాను. అప్పటికి సరే అంటారు. కాని ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరమని చెబుతుంటారు. అలాగే పనులు కూడా చేస్తారు. ఇది ముందు నచ్చకపోయినా, ఫలితం చూశాక సబబే అనిపిస్తుంది. ‘భార్యాభర్తలిద్దరూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నించాలి. అహానికి ఏమాత్రం చోటివ్వకూడదు. ఏదైనా విషయం వస్తే.. ఇద్దరూ సర్దుబాట్లు చేసుకోవాలి. సాధించాలనే ధోరణి ఇద్దరిలోనూ ఉండకుండా జాగ్రత్తపడితేనే ఆ ఇల్లు ఆనందనిలయంగా మారుతుంది’ అని ఈ జంట పాతికేళ్ల వివాహబంధం విజయంలోని అసలు కిటుకులను వివరించారు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మా ఇంట అడుగుపెట్టినరోజే తనది కలుపుగోలు స్వభావమనీ, ఆనందంగా ఉండే తత్త్వమనీ అర్థమైంది. ఆ ఆనందంపాతికేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది. - శ్రీరామ్ పెళ్లయ్యాక నాకు మరింత స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. అత్తవారింట్లో అడుగుపెడుతూనే, ఇదే నా ఇల్లు, ఈయనతో నేనా జీవితం అని డిసైడయ్యాను. - శ్రీలక్ష్మి