breaking news
Speaker of the Legislative Assembly of Andhra Pradesh
-
గంటా రాజీనామా వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లతో పాటు గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను, ఇతర ఆధారాలను తమ ముందుంచాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని గంటా శ్రీనివాసరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. తన రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ఈనెల 23న జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ శాసనసభ సెక్రటరీ జనరల్ అదే రోజు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం విచారణ జరిపారు. గంటా వ్యాజ్యానికి విచారణార్హతే లేదు.. గంటా తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, 2021లో సమర్పించిన రాజీనామాను స్పీకర్ మూడేళ్ల తరువాత ఆమోదించారన్నారు. రాజీనామా ఉపసంహరణకు గంటా ఎలాంటి లేఖ ఇవ్వలేదని అంగీకరించారు. రాజీనామాను ఆమోదించడం వెనుక దురుద్దేశాలున్నాయి కాబట్టే, స్పీకర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజీనామా ఆమోదించారని, ఆ ఎన్నికల్లో గంటా ఓటు కీలకమని ఆయన వివరించారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేసినప్పుడు, దానిని జారీ చేసిన సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని, అయితే ఈ పిటిషన్లో సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చలేదన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యాజ్యాలు ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. విధి విధానాల ప్రకారమే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలిపారు. తరువాత అసెంబ్లీ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. స్పీకర్ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకునే రాజీనామాను ఆమోదించారన్నారు. శాసనసభ్యుడిగా కొనసాగాలన్న ఉద్దేశం గంటాకు ఉంటే, ఈ మూడేళ్లలో తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉండాల్సిందని, ఈ పని చేయకుండా ఆయనను ఎవరూ ఆపలేదని వివరించారు. రాజీనామాను ఆమోదించే విషయంలో నిర్ధిష్టంగా ఎలాంటి నిబంధనలు లేవన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని రిట్ ద్వారా ప్రశ్నించడానికి వీల్లేదని తెలిపారు. -
నా కుమారుడిని కిడ్నాప్ చేశారు
హైకోర్టులో ఏపీ స్పీకర్ కోడెల కోడలు హెబియస్ కార్పస్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు కె.శివరామకృష్ణ తన నాలుగేళ్ల కుమారుడిని అపహరించారని, తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శివప్రసాదరావు కో డలు పద్మప్రియ బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కోడెల కుమారుడు కె.శివరామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖపట్నం ఎస్పీ, విశాఖపట్నం త్రీటౌన్ సీఐలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘నా భర్త శివరామకృష్ణకు ఇంతకు ముందే పెళ్లైందని, హింస భరించలేకే మొదటి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని తెలిసింది. వీరి హింస, బాధలు భరించలేక నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో నేను నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాను. 2010 అక్టోబర్ 18న నేను మగబిడ్డకు జన్మనిచ్చాను. ఈ నెల 17న నా తండ్రి ఇంటిలో లేని సమయంలో శివరామకృష్ణ, జయలక్ష్మీ సీఫుడ్స్ అధినేత కె.రమేష్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సూరపనేని కోటేశ్వరరావు, వైజాగ్‌కు చెందిన కోనేరు సురేష్, ఇండో అమెరికన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుమతి, ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రికి చెందిన జితేంద్ర కలిసి మా ఇంటికి వచ్చి నా కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.’ అని ఆమె తన హెబియస్ కార్పస్ పిటిషన్లో పేర్కొన్నారు.