breaking news
the software industry
-
సాఫ్ట్వేర్ సంగీతోపాసన
వారిది అమెరికాలో ఆనందమయమైన జీవితం...నాలుగు చేతులా సంపాదన... అంతకు రెండింతల గౌరవం...అయినా ఏదో తెలియని వెలితి... మరేదో అసంతృప్తి...మాతృభూమి కోసం ఏదైనా చేయాలనే తపన...ఆత్మసంతృప్తి కోసం అమెరికాను వదిలి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టారు...సాఫ్ట్వేర్ రంగంలోని తమ నైపుణ్యాన్ని సంగీత సాగర మథనానికి వినియోగించారు.ప్రపంచంలోనే ప్రప్రథమంగా...కర్ణాటక సంగీతాన్ని ఒక గురువుతో సమానంగా బోధించే సాఫ్ట్‌వేర్‌కు అంకురార్పణ చేశారు. తరతరాల వారసత్వమైన మన కర్ణాటక సంగీతాన్ని కొత్త తరాలకు సరికొత్తధోరణిలో దగ్గర చేస్తున్నారు - అప్పజోడు షణ్ముఖం, దీపిక దంపతులు. అమెరికాలో ఉన్నత ఉద్యోగాల్లో గడిపిన ఈ దంపతులు మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు చేపట్టిన మార్గం ఆశ్చర్యకరమే. ఆ మాటే అడిగితే, ‘‘అమెరికాలో 2002 వరకు ఉద్యోగం చేశాం. ఇక, 2004లో రింగ్ క్యూబ్ అనే కంపెనీని ప్రారంభించాం. ఆర్థికంగా స్థిరపడినా ఏదో అసంతృప్తి. మాతృదేశానికి ఏ విధంగా ఉపయోగపడాలా అని నిరంతర సంఘర్షణ. ఈ ఆలోచన మమ్మల్ని అమెరికాలో స్థిరంగా ఉండనీయలేదు. అంతే... 2010లో భారత్‌కు వచ్చేశాం. సాఫ్ట్‌వేర్‌పై సంగీత శిక్షణ విధానానికి రూపకల్పన చేసి భారతీయులకు ముందుగా పరిచయం చేయాలనుకున్నాం’’ అని వివరించారీ దంపతులు. కర్ణాటక సంగీతానికి తిరుగులేని కేంద్రంగా తమిళనాడు ప్రసిద్ధికెక్కడం, ఎక్కువమంది సంగీత విద్వాంసులు చెన్నైలో ఉండడం వల్ల వారు తమ కార్యస్థానంగా చెన్నైని ఎంచుకున్నారు. 2012లో గురుస్వర మ్యూజిక్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను చెన్నపట్నంలో స్థాపించారు. ‘‘భారతదేశంలో ఎక్కడా సంగీత విశ్వవిద్యాలయం లేదు. ఈ సంస్థ ద్వారా ఆ లోటును తీర్చాలన్నది మా ఆలోచన’’ అంటుందీ జంట. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించేయగలమని ఎంతో ఉత్సాహంతో భారత్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకోక తప్పదని పనులు ప్రారంభించిన తరువాత గానీ తెలిసి రాలేదు. మనుషుల్లో జవాబుదారీతనం లేకపోవడం, అప్పగించిన బాధ్యతను తమదిగా భావిస్తూ సొంతం చేసుకోక పోవడం వంటి ఇబ్బందుల వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఆలస్యమవుతోంది. పాఠశాలల్లో ప్రథమపాదం పాఠశాలల్లో సంగీతాన్ని ఒక పాఠ్యాంశంగా పరిచయం చేయాలన్నది వీరి ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్ఆర్డీ) సీబీఎస్ఈ విద్యావిధానంలో ఫైన్ ఆర్ట్స్‌ను తప్పనిసరి పాఠ్యాంశం చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ‘‘తొలి దశగా చెన్నై, హైదరాబాద్ నగరాలలో 3 - 6వ తరగతి మధ్య విద్యార్థులకు మా సాఫ్ట్వేర్ సంగీత శిక్షణ విధానంలో సంగీత పాఠాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తరువాత కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిచయం చేద్దామని భావిస్తున్నాం’’ అని ఈ జంట వివరించింది. మతభావనను అధిగమించి... అయితే, మన ఘన వారసత్వ సంపద అయిన సంగీత గుళికలను భారతీయులందరికీ అందుబాటులో తేవాలన్న వీరి ప్రయత్నానికి మతం అనుకోని అడ్డంకి అయింది. త్యాగరాజ కీర్తనల్లో సహజంగానే రాముడుంటాడు. ఇది మా కెందుకని హిందూయేతరులు అభ్యంతరాలు లేవనెత్తారు. అయినా షణ్ముఖం, దీపికలు వెనుకంజ వేయలేదు. సంగీతాన్ని లౌకికంగా మార్చాలన్న కొందరి సూచనను అక్షరాలా అమలు చేశారు. ‘‘సంగీతాన్ని అందరికీ సమ్మతంగా ఉండేలా తీర్చిదిద్దాం. సంస్కృత విద్యాలయ (తిరుపతి)లో సంస్కృత విభాగాధిపతి అయిన డాక్టర్ సదాశివానందమూర్తి మాకు మరికొంత తోడ్పడ్డారు. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే శ్లోకాలు, తాత్పర్యాలు, నీతి సూత్రాలను మా సాఫ్ట్‌వేర్‌కు జోడించి సహకరించారు’’ అని ఈ దంపతులు పేర్కొన్నారు. ఆత్మతృప్తి కోసం ఈ సంగీత వారసత్వ పరిరక్షణ ఉద్యమం చేపట్టిన ఈ దంపతుల ప్రయత్నం ఇంకా బుడిబుడి అడుగుల దశలోనే ఉంది. సంగీతపు మాధుర్యాన్ని మరింతమంది గుర్తించి, తగినరీతిలో పెద్దపీట వేస్తే వీరు పడ్డ శ్రమకు ఫలితం దక్కినట్టే. - కొట్రా నందగోపాల్, బ్యూరో చీఫ్, చెన్నై ఫొటోలు: వన్నె శ్రీనివాసులు కంప్యూటరే గురువు ఎంతోమందికి కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని కోరికగా ఉన్నా, గురువులు అందుబాటులో లేక ఆ కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారు. ‘గురుస్వర’ అనే సాఫ్ట్వేర్ సంగీత సౌలభ్యానికి రూపకల్పన చేశాం. ఈ పద్ధతిలో కంప్యూటర్ మానిటర్లో గ్రాఫ్‌ను చూస్తూ సరిగమల నుండి కీర్తనల వరకు నేర్చుకోవచ్చు. రెండేళ్లపాటు శ్రమించి రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ విధానంలో పలువురు కర్ణాటక సంగీత విద్వాంసులు పాడిన కీర్తనలు ఉన్నాయి. ఓ విద్వాంసుణ్ణి ఎంచుకొని, వారితో కలిసిపాడుతూ సాధన చేయవచ్చు. తప్పుగా పాడితే కంప్యూటర్ తెరపైన ఉండే గ్రాఫిక్స్ ద్వారా తెలుసుకొని సరిచేసుకోవచ్చు. అర్థం, భావం, ఎలా పాడాలనే వివరాలతో పుస్తకాలూ ఉన్నాయి. స్వరలిపి (నొటేషన్)ని కూడా ఇందులో నిక్షిప్తం చేశాం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చినసత్యనారాయణ వంటి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల సుమధుర గళం నుండి జాలువారిన కీర్తనలు గురుస్వర లైబ్రరీలో ఉన్నాయి. - దీపిక, ‘గురుస్వర’ నిర్వాహకురాలు -
ఐటీ..వెరీ పిటీ
వెనక్కుపోతున్న కీలక రంగం సహాయ నిరాకరణం.. మారని వాతావరణం పేరుకే రాష్ట్రంలో రెండో ఐటీ రాజధాని అడుగడుగునా అవస్థలతో హాని కొత్త కంపెనీల ఊసే కరువు ఉన్నవాటిపై సమస్యల బరువు పెరగని వ్యాపారాలు.. కలగామారిన కొత్త ఉద్యోగాలు అంగట్లో అన్నీ ఉన్నాయ్.. వైజాగ్ ఐటీ నెత్తిన మట్టి ఉంది. సిటీ పెద్దది.. పేరున్నది.. పరిశ్రమల పెన్నిధి. పారిశ్రామిక రాజధానిగా వన్నెకెక్కింది. ఐటీ రంగాన్ని చూస్తే ఇదంతా వృథా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ తాటాకు చప్పుళ్లలాటి ప్రకటనల హోరు తప్పితే ఈ రంగం ఇప్పటికే ముసుగు తన్నేసింది. ఐటీఐఆర్ మాటలో తీపి బాగుంది కానీ నిజం దీనంగా కనిపిస్తోంది. కొత్త పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే కష్టం వెంటాడుతోంది. సాక్షి,విశాఖపట్నం: వైజాగ్ ఐటీ.. వెరీ పిటీ! సాఫ్ట్వేర్ రంగం నిపుణులు తేలిగ్గా చేసే వ్యాఖ్య ఇది! చేదనిపించినా కాదనలేని వాస్తవం ఇది! ఐటీ రంగంలో రెండోరాజధానిగా కీర్తి బాగుంది కానీ కళ్లెదుట నిజం కలవరం కలిగిస్తోంది. కనీస వసతులు లేక, ప్రభుత్వం కనికరించక, కాస్తయినా ప్రోత్సాహం కానరాక విశాఖలో ఐటీ నానాటికీ వెనకడుగు వేస్తోంది. మొత్తం 70 కంపెనీలు, నాలుగు ఎస్ఈజెడ్లుంటే అందులో పాతిక శాతమైనా పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది. అసలు డొల్ల విశాఖలోని 70 ఐటీ కంపెనీల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నవి 20 లోపే. నాలుగుఎస్ఈజెడ్ల్లో రెండు మాత్రమే పనిచేస్తుండగా,మిగతావి నిరుపయోగంగా మారాయి. దీనివల్ల కార్యకలాపాలు జరగక 2014-15నాటికి విశాఖలో రూ.5 వేల కోట్లదాటాల్సి ఉన్న టర్నోవర్ రూ. 1450 కోట్ల వద్దే ఆగిపోయింది. ఉద్యోగాలు 70వేలు దాటాల్సి ఉండగా, కేవలం 10,200 మందికే ఉపాధి లభిస్తోంది. గడిచిన అయిదేళ్లలో నాలుగైదు పెద్ద కంపెనీలు మినహా మరేం రాలేదు. కొత్త ఐటీ కంపెనీలు విశాఖకు రావాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఐటీ ప్రమోటింగ్ స్టాఫ్‌గా ఇక్కడ నియమించాలి. అది జరగడం లేదు. ఐటీ అభివృద్ధి చెందాలంటే అనుబంధ సౌకర్యాలూ ముఖ్యం. అత్యున్నత విద్యా, వైద్య, రవాణా సౌకర్యాలు ప్రధానం. కానీ నగరంలో వీటి అభివృద్ధి అంతంతే. విదేశీ క్లయింట్లు విశాఖకు రావాలంటే సరయిన విమాన సౌకర్యమూ లేదు. ఐటీ రంగ అభివృద్ధికి నిరంతరం విద్యుత్ అత్యవసరం. కాని విశాఖలో మాత్రం కంపెనీలకు కేటాయించిన విద్యుత్ కోటాను మించి వాడితే యూనిట్‌కు రూ.50 వంతున వసూలు చేస్తున్నారు. గతేడాది విద్యుత్‌కోతతో ఐటీ పరిశ్రమలు విలవిలలాడాయి. ఈసారీ అదే పరిస్థితి ఉంది. నగరానికి దూరంగా ఉన్న ఐటీ ఎస్‌ఈజెడ్‌ల్లో పనిచేసే కంపెనీ ఉద్యోగుల రాకపోకలకు కనీస రవాణా వ్యవస్థ లేదు. ఇక ఐటీఐఆర్ సంగతే సందేహంగా ఉంది. అవసరమైతే 10 వేల ఎకరాలు ఉన్నా వాటిని మాస్టర్‌ప్లాన్‌లో గుర్తించకపోవడంతో ఐటీఐఆర్ సాధ్యమా అనిపిస్తోంది. రుషికొండలో మొత్తం మూడు ఐటీ సెజ్‌లలో కనీస సౌకర్యాల అభివృద్ధి కోసం హైదరాబాద్ తరహాలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి 2012 జనవరిలో ఐటీ శాఖ మంత్రి పొన్నాల శంకుస్థాపనచేశారు. ఇంకా అది మొదలవలేదు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌కు రూ. 23 కోట్లు మంజూరు చేసింది. దీనికి భూమి మంజూరు కాలేదు. ఇదా ప్రోత్సాహం? కొత్త ఐటీ కంపెనీలు రావాలన్నా , ఉన్నవి సక్రమంగా పనిచేయాలన్నా ఎస్ఈజెడ్లను ప్రభుత్వం వెంటనే డీ-నోటిఫై చేయాలి. లేకపోతే కంపెనీలకు రుణాలు కూడా పుట్టక మూతపడే పరిస్థితి ఎదురవుతుంది. వీటిని డీ నోటిఫై చేస్తేనే విశాఖలో ఐటీకి మనుగడ . ఈపీడీసీఎల్ విద్యుత్ కోతలు తీవ్రంగా విధిస్తోంది. రాష్ట్రప్రభుత్వం తరఫున గతకొన్నేళ్లుగా ఏ ఒక్క ఉన్నతాధికారికూడా ఇక్కడకురాలేదు. అభివృద్ధి ఇంకెలా సాధ్యమవుతుంది? - ఓ.నరేష్కుమార్, రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు