breaking news
social actions
-
President Droupadi Murmu: అసమానతలను రూపుమాపాలి
న్యూఢిల్లీ: సామాజిక అసమానతలను పెంచి పోషించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ‘‘వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన విభజన ధోరణులను సమూలంగా పెకిలించాలి. అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయేలా గట్టి కార్యాచరణ రూపొందించి అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినం సందర్భంగా మంగళవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. విస్తరిస్తున్న సామాజిక ప్రజాస్వామ్యానికి అది నిదర్శనమని చెప్పారు. భిన్నత్వం, బహుళత్వమే ఆభరణాలుగా దేశమంతా ఐక్యంగా ముందుకు సాగుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. సామాజిక న్యాయానికి మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన చర్యలను వివరించారు. మహిళల అభ్యున్నతికీ పెద్దపీట వేసిందన్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన అంతులేని అకృత్యాలు, మానప్రాణ నష్టం ఎన్నటికీ మర్చిపోలేనివంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్ఫూర్తిదాయక ప్రసంగం: మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా నవతరం ఆర్థిక సంస్కరణలకు రంగం సిద్ధమైందని రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతోందంటే దీర్ఘదృష్టితో కూడిన సారథ్యం, రైతులు, ఇతర సంపద సృష్టికర్తల నిరి్వరామ శ్రమే కారణమన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఏఐతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, ఉరకలెత్తుతున్న ఆర్థిక రంగం భారత్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మారుస్తున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందంటూ మోదీ ప్రశంసించారు. -
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
జిల్లా జడ్జి నాగమారుతీశర్మ ముకరంపుర : మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. శుక్రవారం స్వశక్తి కళాశాలలో జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ సభ్యుల నెలవారీ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సోషల్ యాక్షన్ కమిటీ ద్వారా కేసుల పరిష్కారం పారదర్శకంగా ఉండాలన్నారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు పరిష్కరించాలని సూచించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా న్యాయం వైపే మొగ్గు చూపాలన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇప్పించి అర్హులను పారా లీగల్ సభ్యురాలిగా కార్డు ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం జడ్జిని సన్మానించారు. డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, లీగల్ సర్వీసెస్ అ«థారిటీ సెక్రటరీ భవానిచంద్ర, ఏపీడీ వై.రమేశ్, ప్రాజెక్టు మేనేజర్ పి.సునిత, సెర్ప్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మేనేజర్ జంగారెడ్డి, లీగల్ కన్సల్టెంట్ వేణుగోపాల్ తదితరులున్నారు.