ఆరు ఆస్పత్రులపై ‘ఫైర్’ విచారణ!
• అగ్నిమాపక శాఖ అదనపు డీజీ లక్ష్మీప్రసాద్
• దీపావళి టపాసులతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తనిఖీల్లో తేలడంతో వాటిపై చట్టపర విచారణ చేపట్టామని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖ అదనపు డెరైక్టర్ జనరల్ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 68 ఆస్పత్రులను తనిఖీ చేసి, నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) జారీ చేశామన్నారు. భువనేశ్వర్‌లోని ఎస్యూఎం ఆస్పత్రిలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది మృత్యువాత పడిన ఘటనపై ఆయన స్పందించారు.
రాష్ట్రంలో చాలా సురక్షిత పరిస్థితి ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద దుర్ఘటన జరగలేదన్నారు. దీపావళి రోజున టపాసులు కాల్చే సమయంలో పాటించాల్సిన సురక్షిత పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన మంగళవారం తన కార్యాలయంలో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నిలువరించవచ్చన్నారు. పెద్దవాళ్ల సమక్షంలోనే చిన్నపిల్లలు టపాసులు పేల్చాలన్నారు. గత దీపావళి రోజున రాష్ట్రంలో 30 చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. చైనా టపాసుల విక్రయాలపై నిషేధముందని, ఎవరైనా విక్రయిస్తే వారి లెసైన్స్‌ను రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెరైక్టర్ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.