breaking news
singapore open super series
-
సింధు సత్తాకు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ టైటిల్ నిలబెట్టుకోవాలంటే భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. నేడు మొదలయ్యే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ సింధుకు తొలి రౌండ్లోనే కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తొలి రౌండ్లో ఆడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–9తో ఆధిక్యంలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వాంగ్‌చరోన్ (థాయ్‌లాండ్)తో కిడాంబి శ్రీకాంత్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రణయ్... సునెయామ (జపాన్)తో ప్రియాన్షు రజావత్... చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ ఆడతారు. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత బౌలర్లకు పాక్ లెజెండ్ కీలక సలహా -
సాయిప్రణీత్ సాధించాడు
► సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం ► హోరాహోరీ ఫైనల్లో శ్రీకాంత్‌పై విజయం ► కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ హస్తగతం ► ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ ప్లేయర్ ► రూ. 16 లక్షల 91 వేల ప్రైజ్‌మనీ సొంతం భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రంపై మరో రాకెట్ దూసుకొచ్చింది. సైనా, సింధు, శ్రీకాంత్ ఆటను తలపిస్తూ మరో యువ కెరటం ఎగిసింది. గతంలో పలువురు మేటి క్రీడాకారులపై సంచలన విజయాలు సాధించి భవిష్యత్ ఆశాకిరణం అని గుర్తింపు తెచ్చుకున్నా... ఈ కుర్రాడు ‘ఫినిషింగ్ టచ్’ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఆ వెలితిని ఎట్టకేలకు ఇప్పుడు తొలగించుకుంటూ తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. కెరీర్లో ఫైనల్‌కు చేరిన తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లోనే చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా సైనా, సింధు, శ్రీకాంత్ తర్వాత సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా ఘనత సాధించాడు. సింగపూర్ సిటీ: తనకంటే మెరుగైన ర్యాంక్ క్రీడాకారులపై సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని సాయిప్రణీత్ నిరూపించాడు. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తన జైత్రయాత్రను దిగ్విజయంగా ముగించాడు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సాయిప్రణీత్ తన సహచరుడు కిడాంబి శ్రీకాంత్‌పై పైచేయి సాధించాడు. ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య తొలిసారి జరిగిన ‘సూపర్ సిరీస్’ అంతిమ సమరంలో... ప్రపంచ 30వ ర్యాంకర్ సాయిప్రణీత్ 55 నిమిషాల్లో 17–21, 21–17, 21–12తో 29వ ర్యాంకర్ శ్రీకాంత్‌ను ఓడించి చాంపియన్ అయ్యాడు. విజేతగా నిలిచిన సాయిప్రణీత్‌కు 26,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 91 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ శ్రీకాంత్‌కు 13,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 56 వేలు)తోపాటు 7,800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తడబడి: ఇప్పటికే కెరీర్లో రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్‌తో జరిగిన ఫైనల్లో తొలి సూపర్ సిరీస్ ఫైనల్ ఆడుతోన్న సాయిప్రణీత్ కాస్త తడబడ్డాడు. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ శిష్యులైన వీరిద్దరికీ ఒకరి ఆటపై మరొకరికి స్పష్టమైన అవగాహన ఉండటంతో ప్రతి పాయింట్ కోసం హోరాహోరీ పోరాటం జరిగింది. ఒకసారి శ్రీకాంత్ కళ్లు చెదిరే స్మాష్‌లతో పైచేయి సాధించగా... ఇంకోసారి సాయిప్రణీత్ మెరిశాడు. అయితే అనుభవజ్ఞుడైన శ్రీకాంత్ తొలి గేమ్‌ను 19 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. నిలబడి: తొలి గేమ్ కోల్పోయిన నిరుత్సాహంలో సాయిప్రణీత్ రెండో గేమ్ ఆరంభంలోనూ ఒత్తిడికి లోనయ్యాడు. ఫలితంగా ఒకదశలో 1–6తో వెనుకబడ్డాడు. అదే జోరులో శ్రీకాంత్ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంటాడని భావిస్తున్న తరుణంలో సాయిప్రణీత్ కోలుకున్నాడు. గతంలో శ్రీకాంత్‌ను నాలుగుసార్లు ఓడించిన అనుభవమున్న సాయిప్రణీత్ స్కోరు 2–7 వద్ద ఉన్నపుడు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును 7–7తో సమం చేశాడు. ఈ తరుణంలో శ్రీకాంత్ అనవసర తప్పిదాలు చేయడం సాయిప్రణీత్‌కు కలిసొచ్చింది. స్కోరు 9–10 వద్ద ఉన్నపుడు సాయిప్రణీత్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 12–10తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఈ స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో గేమ్‌ను 19 నిమిషాల్లో గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. దూకుడుగా ఆడి: నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సాయిప్రణీత్ 5–2తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌కు ఒక పాయింట్ సమర్పించుకున్నా సాయిప్రణీత్ వెంటనే విజృంభించి మరోసారి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 10–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పాయింట్ పాయింట్‌కూ సాయిప్రణీత్ ఆట మెరుగుకాగా... మరోవైపు శ్రీకాంత్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ఇటీవలే మృతి చెందిన భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తాకు సంతాప సూచకంగా సాయిప్రణీత్, శ్రీకాంత్ చేతికి నల్ల బ్యాండ్లు ధరించి ఫైనల్ బరిలోకి దిగారు. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కల ఇప్పుడు నెరవేరింది. జూనియర్ స్థాయిలో విజయాల తర్వాత సీనియర్ స్థాయిలో నా కెరీర్ ఒడిదుడుకులతోనే సాగింది. బాగా ఆడటం, ఒక్కసారిగా వెనుకబడి పోవడం, మళ్లీ కోలుకోవడం... వీటికి తోడు గాయాలు... ఇలాంటి స్థితిలో గతంలో కొన్నిసార్లు చాలా మంచి మ్యాచ్‌లు ఆడినా పెద్ద స్థాయి విజయం లభించలేదు. అది నన్ను తీవ్ర నిరాశకు గురి చేసేది. ఎలాగైనా పెద్ద టైటిల్ సాధించాలనే లక్ష్యం నా మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు సూపర్ సిరీస్ విజయంతో చాలా చాలా ఆనందంగా ఉన్నాను. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. సయ్యద్ మోదీ టోర్నీ ఫైనల్లోనే భుజానికి గాయమై ఆల్ ఇంగ్లండ్, స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నమెంట్లకు దూరమయ్యాను. ఆ సమయంలోనే ఫిట్నెస్ మెరుగు పర్చుకున్నాను. సూపర్ సిరీస్ ఫైనల్ అనే ఒత్తిడి తప్ప శ్రీకాంత్‌తో ఆడటంలో విశేషమేమీ లేదు. అతనిపై ఉన్న గత రికార్డుకు కూడా ప్రాధాన్యత లేదు. మేమిద్దరం అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఒకరి బలాలు, బలహీనతల గురించి మరొకరికి బాగా తెలుసు. గోపీ అన్నయ్యకు ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే కాబట్టి మ్యాచ్‌కు ముందు ప్రత్యేకంగా సూచనలేమీ ఇవ్వలేదు. ఈ విజయంతో మున్ముందు నాపై అంచనాలు పెరుగుతాయని తెలుసు. అయితే వాటిని పట్టించుకోకుండా నా గేమ్‌పైనే దృష్టి పెడతా’ – సింగపూర్ నుంచి ‘సాక్షి’తో సాయిప్రణీత్ సాయిప్రణీత్ చాలా పెద్ద టోర్నీ గెలిచాడు. ఇది నాకు గర్వకారణం. ఈ విజయం భవిష్యత్తులో పెద్ద స్థాయిలో పోటీ పడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అతనికి అందిస్తుంది. అతని కెరీర్లో పెద్ద స్టార్లను కూడా ఓడించాడంటే ఆటలో సత్తా ఉందనడంలో సందేహం లేదు. ఏ రకంగా చూసినా ఇది పెద్ద ఘనతే. అయితే ప్రణీత్‌కు మరింత నిలకడ అవసరం. అతను ఇంకా కుర్రాడే కాబట్టి మున్ముందు ఇంకా చాలా ఏళ్లు ఆడగలడు. సాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధిస్తాడని ఆశిస్తున్నాను. – పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ సీఎం కేసీఆర్, జగన్ అభినందనలు సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో జరగబోయే టోర్నమెంట్లలో ప్రణీత్ ఇదే విధంగా విజయాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. మా అబ్బాయి తొలి సూపర్ సిరీస్ టైటిల్ గెలవడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. గతంలో ఒకట్రెండు సార్లు టోర్నీ విజయానికి చేరువగా వచ్చినా దక్కకపోవడంతో నిరాశ చెందాం. పలువురు ప్రముఖ షట్లర్లపై గెలిచిన రికార్డు ఉన్నా... టైటిల్ సాధించడంలో ఉండే విలువ వేరు. గత వారం మలేసియా టోర్నీలో లిన్ డాన్‌తో ఓడినా, సాయి పోరాటం చూస్తే చాలా బాగా ఆడుతున్నాడని మాకు అర్థమైంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత పూర్తి ఫిట్‌గా అతను బరిలోకి దిగాడు. ఆరు వారాల విరామం సాయి ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడిందనేది మా అభిప్రాయం. ఇన్నేళ్లుగా అతను ఆట కోసం పడిన శ్రమ చూసిన తర్వాత సాయి సూపర్ సిరీస్ విజయంపై తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం. – ‘సాక్షి’తో దీక్షితులు, మాధవీలత (సాయిప్రణీత్ తల్లిదండ్రులు) గాయత్రి ‘డబుల్’ హైదరాబాద్: ఇండోనేసియాలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో పుల్లెల గాయత్రి డబుల్ ధమాకా సాధించిం ది. భారత కోచ్ గోపీచంద్ తనయ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. అండర్–15 బాలికల సింగిల్స్ ఫైనల్లో గాయత్రి 21–11, 18–21, 21–16తో హైదరాబాద్‌కే చెందిన సామియా ఇమాద్ ఫారుఖిపై గెలుపొందింది. డబుల్స్ ఫైనల్లో గాయత్రి–సామియా జోడి 21–17, 21–15తో కెల్లీ లారిస్సా–షెలండ్రి (ఇండోనేసియా) జంటను ఓడించింది. -
సింగపూర్‌లో చరిత్ర సృష్టించిన తెలుగుతేజం
సింగపూర్: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగుతేజం సాయి ప్రణీత్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణీత్ విజయం సాధించి తన కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ సమరంలో ప్రణీత్ 17-21, 21-17, 21-12 స్కోరుతో కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. ప్రణీత్ తొలి గేమ్ కోల్పోయినా, వెంటనే పుంజుకుని రెండో గేమ్‌ను సొంతం చేసుకుని విజయావకాశాలను కాపాడుకున్నాడు. నిర్ణాయక చివరి, మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని విజేతగా నిలిచాడు. పలువురు క్రీడాకారులు, అధికారులు.. ప్రణీత్‌ను అభినందించారు. ప్రణీత్‌కు వైఎస్ జగన్ అభినందనలు: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన ప్రణీత్‌కు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రణీత్ తన కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
కరోలినా వర్సెస్ సింధు
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పివి సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 19-21, 21-17, 21-8 తేడాతో ఇండోనేషియాకు చెందిన 27వ ర్యాంకర్ ఫిత్రానిపై విజయం సాధించి క్వార్టర్ కు చేరింది. ఈ పోరులో తొలి గేమ్ ను కోల్పోయిన సింధు.. ఆ తరువాత రెండు గేమ్ ల్లో విజయం సాధించి తదుపరి రౌండ్ కు అర్హత సాధించింది. ప్రధానంగా నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు వరుస పాయింట్లతో దూసుకుపోయింది. తొలుత 11-4 తో స్పష్టమైన ఆధిక్యం సాధించిన సింధు.. ఆపై మరో నాలుగు పాయింట్లను మాత్రమే ప్రత్యర్థికి సమర్పించుకుని గేమ్ ను సొంతం చేసుకుంది. రేపు జరిగే క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి కరోలినా మారిన్ తో సింధు తలపడనుంది. మరొక ప్రి క్వార్టర్ ఫైనల్లో మారిన్ 21-7,21-11తేడాతో చియా సిన్(చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది.ముఖాముఖి రికార్డులో సింధు4–5తో వెనుకబడి ఉంది. అయితే ఇటీవల ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ లో మారిన్ ను సింధు ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్న సంగత తెలిసిందే. అంతకుముందు చివరిసారి గత డిసెంబరులో దుబాయ్‌లో జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో తలపడగా... మారిన్‌పై సింధు గెలిచింది. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండటంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. -
శ్రమించిన శ్రీకాంత్
♦ సింగపూర్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి చేరిక ♦ కశ్యప్, ప్రణయ్ అలవోక విజయం ♦ గురుసాయిదత్, సాయిప్రణీత్ ఓటమి సింగపూర్ : అదే టోర్నీ... అదే ప్రత్యర్థి... అదే ఫలితం... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. శ్రీకాంత్‌తోపాటు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే గురుసాయిదత్, సాయిప్రణీత్, పీసీ తులసి మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ శ్రీకాంత్ 21-18, 19-21, 21-14తో ప్రపంచ 28వ ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై గెలుపొందాడు. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండో గేమ్‌లోనే విజయాన్ని ఖాయం చేసుకోవాల్సింది. అయితే 19-18తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్న దశలో ఈ హైదరాబాద్ ప్లేయర్ తన ప్రత్యర్థికి వరుసగా మూడు పాయింట్లు కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. ఆరంభంలోనే 11-5తో ముందంజ వేసి అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. గతేడాది ఇదే టోర్నీలో రెండో రౌండ్లో తియెన్ మిన్తో తలపడ్డ శ్రీకాంత్ మూడు గేముల్లో విజయం సాధించడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ 21-11, 21-13తో లీ హున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందగా... ప్రణయ్ 21-15, 21-17తో వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించాడు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 21-16, 12-21, 15-21తో నాలుగో సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో; సాయిప్రణీత్ 11-21, 18-21తో రెండో సీడ్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-12, 21-16తో గో ఆ రా-యు హె వన్ (కొరియా) జంటను ఓడించింది. అయితే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీ 17-21, 13-21తో పెబా జెబాదియా-రిజ్కీ అమెలియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ జోడీ 15-21, 17-21తో కో సంగ్ హున్-కిమ్ హా నా (కొరియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.