breaking news
Sindhuri
-
రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయింది.. తెల్లారి చూస్తే..
సాక్షి, అనంతపురం(రాప్తాడు): మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి కుమారై గడ్డం రాజ సింధూరి (18) కనిపించడం లేదు. అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సింధూరి శనివారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులతో కలసి నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు తల్లిదండ్రులు నిద్ర లేచి చూడగా కనిపించడం లేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాఘవరెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96817కు సమాచారం ఇవ్వాలని కోరారు. చదవండి: (హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు) -
ఈ చెయ్యి చాలు సేవ చేయటానికి...
కర్ణాటక ఉడిపిలో ఈ పది సంవత్సరాల చిన్నారి సింధూరి ఆరో తరగతి చదువుతోంది. భగవంతుడు ఆమెకు ఒక్క చెయ్యి మాత్రమే ఇచ్చాడు. సింధూరి మనసుకు వైకల్యం లేదు. రెండు చేతులు లేని వారి కంటె నేనే చాలా నయం అనుకుంది. ఒక్క చేత్తోనే మిషన్ మీద మాస్కులు కుట్టటం ప్రారంభించి, తోటి స్నేహితులందరికీ అందచేస్తోంది. ‘‘స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో మా స్కూల్ తరఫున లక్ష మాస్కులు కుట్టి, ఎస్ఎస్ఎల్సి వాళ్లకి అందచేయాలి. నేను 15 మాస్కులు కుట్టాను. మొదట్లో నేను, నా నిస్సహాయతకు బాధపడ్డాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పింది’’ అంటూ తనకు తల్లి ఇచ్చిన ధైర్యం గురించి ఎంతో ఆనందంగా చెబుతుంది సింధూరి. వీరు కుట్టిన మాస్కులను 12 తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందచేశారు. ఈ పరీక్షకు హాజరయ్యేవారికి మాస్కులు తప్పనిసరి. సింధూరి చాలా తెలివైన పిల్ల అని, శ్రద్ధగా చదువుకుంటుందని ఆ పాఠశాల టీచర్లు సింధూరిని మెచ్చుకుంటారు. సింధూరి మౌంట్ రోజరీ ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటోంది. ఇలా సింధూరి ఒకతే కాదు... ఏప్రిల్ నెలలో, 17 సంవత్సరాల ఒక దివ్యాంగుడు తను బహుమతిగా గెలుచుకున్న రెండు లక్షల రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి అందచేశాడు. ఢిల్లీకి చెందిన మరో విద్యార్థి 3డి ప్రింటర్‌తో ఫేస్ షీల్డ్ తయారుచేశాడు. పదో తరగతి చదువుతున్న జరేబ్ వర్ధన్.. 100 ఫేస్ షీల్డులు తయారుచేసి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ్‌కి అందచేశాడు. ఎంతో మంది సకలాంగులు, పెద్దల కంటే ఎంతో బాధ్యతతో మెలుగుతున్న ఈ యువతకు సెల్యూట్ చేయాల్సిందే. -
కూచిపూడి మయూరం
శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో భక్తితత్వాన్ని... సంక్రాంతి సంబరాలలోసంక్రాంతి లక్ష్మిని... తెలుగు మహాసభల్లో తెలుగుభాషను... అభినయంతో నర్తించే అమ్మాయే లలితాసింధూరి! కూచిపూడిలోనే ఆనందం... కూచిపూడితోనే కెరీర్... అంటోందీ అమ్మాయి. కళ దేవుడి వరం... కళ కోసం జీవించడమే మా లక్ష్యం... అంటున్నారు... వరలక్ష్మి, ప్రసాద్‌లు. సింధూరిని నాట్యమయూరిగా తీర్చిదిద్దడంలో వారి అనుభవాలే ఈ వారం లాలిపాఠం!! తిరుమల శ్రీవారిమండపంలో నాదనీరాజనంలో కూచిపూడి నాట్యప్రదర్శన...భోపాల్‌లో ఆంధ్రతెలుగు కళాసమితి, కోల్‌కతాలోని ఆంధ్రసంఘం ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు, చెన్నైలో చిత్తూరు నాగయ్య అవార్డు ప్రదానోత్సవం, ఒడిషాలో గజపతి ఉత్సవాలు, కూచిపూడిలో తానీషా యువ ఉత్సవ్, రాజమండ్రిలో త్యాగరాజ నారాయణదాస సేవాసమితి వేడుకలు, నెల్లూరులో జాతీయస్థాయి కూచిపూడి నాట్యపోటీలు... ఇవి కూచిపూడి నర్తకి లలితాసింధూరి నాట్యం చేసిన వేదికలలో కొన్ని. నాట్యసాధన మొదలుపెట్టిన పదేళ్లలో ఈ అమ్మాయి ఆరు వందలకుపైగా ప్రదర్శనలు ఇచ్చింది. లలితాసింధూరి మనకు కూచిపూడి నాట్యకారిణిగానే తెలుసు. నిజానికి ఆమె మూలాలు కూచిపూడి నాట్యం రూపుదిద్దుకున్న కూచిపూడి గ్రామంతోనే ముడిపడి ఉన్నాయి. కూచిపూడి త్రయంలో ఒకరైన వెంపటి వెంకటనారాయణ సింధూరి ముత్తాత. పన్నెండేళ్ల వయసులో శాస్త్రీయంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. సింధూరి తండ్రి ప్రసాద్ ఇదే విషయం చెప్తూ ‘‘ఎల్కేజీ నుంచి స్కూల్ ప్రోగ్రాముల్లో డాన్స్ చేసేది. జెమినీ టీవీలో ‘డాన్స్ బేబీ డాన్స్’లో కూడా చేసింది. సింధూరి డాన్సును ఇష్టపడుతోందని సంప్రదాయనృత్యాన్ని నేర్పిద్దాం అనుకున్నాం. అలా తను ఏడవ తరగతిలో ఉండగా నాట్యసాధన మొదలుపెట్టింది. తొలిగురువు పసుమర్తి శ్రీనివాస్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్‌యూనివర్శిటీలో శాస్త్రీయ నృత్యంలో పీజీ చేస్తోంది. పీహెచ్‌డి సీటు కూడా వచ్చింది’’ అన్నారు. చిన్న చిన్న త్యాగాలు... పిల్లలను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు చిన్న చిన్న త్యాగాలకు సిద్ధం కావల్సిందేనంటారు వరలక్ష్మి. రాజమండ్రిలో స్కూల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తూ సింధూరి నాట్యసాధన కోసం ఉద్యోగం మానేశారు. ‘‘సింధూరి కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏడాదికి నేను ఉద్యోగం మానేశాను. పాపను నాట్యప్రదర్శనలకు తీసుకెళ్లడంతోపాటు నాట్యసాధనకు కూడా నా సహాయం అవసరమయ్యేది. సింధూరి గురువు హైదరాబాద్‌కి మారిపోయారు. దాంతో వారాంతాలలో హైదరాబాద్‌కి వచ్చేవాళ్లం. సింధూరి వేసవి సెలవులు హైదరాబాద్‌లో నాట్యసాధనలోనే గడిచేవి. ఆ తర్వాత బీటెక్ చదివేటప్పుడు భామాకలాపం నేర్చుకోవడానికి రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లేవాళ్లం. గురువుగారి వెసులుబాటుని, కాలేజీ ప్రాక్టికల్స్‌ను బట్టి ప్లాన్ చేసుకుంటూ ప్రయాణాలు చేసేవాళ్లం. డాన్సుకోసం ఎంతగా శ్రమించినా సరే చదువును పక్కనపెట్టకూడదనేది మా వారి అభిప్రాయం. బీటెక్ తర్వాత సింధూరి డాన్సులోనే కెరీర్ డెవలప్ చేసుకుంటానని చెప్పగానే ఆయన సందేహించకుండా ప్రోత్సహించారు. సింధూరి డాన్సుకోసం నేను ఉద్యోగం మానేస్తే మావారు బ్యాంకులో ప్రమోషన్లను వదులుకున్నారు’’ అన్నారామె. హోమ్‌వర్క్ చేయాల్సిందే! కళ రాణించాలంటే గురువు దగ్గర చేసే సాధన ఒక్కటే సరిపోదు, బాగా హోమ్‌వర్క్ చేయాలంటారు ప్రసాద్. ‘‘నేను కర్ణాటక సంగీతం పాడుతాను. సాంస్కృతిక కార్యక్రమాలలో పాడడం నా ప్రవృత్తి. అందుకోసం చాలా పాటలతో ఆల్బమ్‌లు తయారు చేసుకున్నాను. సింధూరి చేత ఆ పాటల మీద వర్కవుట్ చేయించాను. ఘంటసాల ప్రైవేట్ పాటలను సాధన చేస్తున్న గాయకులు ఉన్నారు కానీ కొరియోగ్రఫీ చేసిన వాళ్లు లేరు. ఆ పని నువ్వే చేయచ్చుగా అని కె.వి.రావు సూచించారు. ఆ సూచనతో ‘జయహే ఆంధ్రమాతా...’ పాటకు డాన్సు కంపోజ్ చేసింది. తర్వాత సుమారు పాతిక పాటలకు కొరియోగ్రఫీ చేసుకుంది సింధూరి. వాటికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఘంటసాల పాటలతోపాటు ఇతర జానపదాలు, జావళులకు కూడా నాట్యరీతిని రూపొందించింది. మా ఆవిడ చెప్పినట్లు ప్రమోషన్ వదులుకోవడం అనేది పెద్ద త్యాగమే అయితే... ఆ త్యాగానికి ప్రతిఫలంగా మా అమ్మాయి నాకు లెక్కలేనన్ని బహుమతులిచ్చింది. నాట్యప్రదర్శనల ద్వారా అనేక ప్రదేశాలు పర్యటించాను. కళ భగవంతునికే అర్పణం అని మా అమ్మాయికి చెప్తుంటాను’’ అని సింధూరి నాట్యప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారాయన. పాత పాటలు అభినయవాచకాలు! ‘‘సింధూరికి సినీనటి సావిత్రి అంటే ఇష్టం. డాన్స్ బేబీ డాన్స్‌లో సావిత్రి పాటలకే డాన్సులు చేసేది. సాహిత్యమే ప్రధానంగా సాగే పాటలకు నాట్యసాధన చేయించడంతో సింధూరికి నాట్యంలో ప్రావీణ్యత వచ్చింది. సినిమా పాటలకు క్లాసికల్ డాన్సేంటి అని విమర్శించిన వాళ్లు లేకపోలేదు. కానీ మేము ఆ మాటలను పట్టించుకోలేదు. నాట్యాన్ని ప్రదర్శించే వేదికను బట్టి పాటను తీసుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ అంతా మావారిదే. సింధూరికి పాట ఇస్తే అరగంటలో డాన్సు కంపోజ్ చేసుకుంటుంది. అలా ఏ ప్రదర్శనకైనా అమ్మాయి దృష్టి డాన్సు మీద మాత్రమే ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటారాయన. సింధూరి వాగ్గేయకారుల కీర్తనలకూ, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గానం చేసిన హనుమాన్చాలీసాకు నాట్య రూపకల్పన చేసింది’’ అన్నారు వరలక్ష్మి. అక్క కోసం తమ్ముడు! ‘‘మేము సింధూరి నాట్యసాధన, ప్రదర్శనలతో ప్రయాణాలు చేస్తుంటే మా అబ్బాయి మాత్రం ఒక్కడే ఇంట్లో ఉండి వంట చేసుకుని కాలేజ్కెళ్లేవాడు. ఇప్పుడు వాళ్లక్క కోసం తనే నెట్ నుంచి పాటలు డౌన్లోడ్ చేయడం, రికార్డింగ్, మిక్సింగ్... వంటి పనులన్నీ చేసి ఇస్తాడు. కాలేజీకి సెలవు ఉంటే అక్కకు తోడుగా వెళ్తాడు. తనకి ఏ అవసరం వచ్చినా అందుకోసం పరుగులు తీస్తాడు’’ అని వరలక్ష్మి మురిపెంగా చెప్పారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా..! ‘‘మా ఇంట్లో అందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. అందుకే ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ప్రదర్శనలకు తీసుకెళ్లేవాళ్లం. చాలా సందర్భాల్లో ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బుకంటే అందుకు అయిన ఖర్చే ఎక్కువగా ఉండేది. అయినా లెక్క చేయలేదు. డాన్సులో మంచి స్థాయికి వెళ్లాలి, కానీ కమర్షియల్ చేయకూడదు. కళ యెడల అంకిత భావంతో ఉంటూ, జీవితంలో భాగం చేసుకోవాలి. అప్పుడే అందులో రాణిస్తాం. పిల్లలకు అదే చెప్తుంటాం. కళ అనేది దేవుడిచ్చినవరం, దానిని ఆయనకే అంకితం చేయాలన్నది మా ఉద్దేశ్యం’’ అంటారు సింధూరి తల్లిదండ్రులు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఉద్యోగం ఎప్పుడైనా వస్తుంది, డాన్సు రావాలంటే వయసు మించకూడదు. అందుకే నాట్యంలో రీసెర్చ్ చేస్తానంటే మేము అడ్డుచెప్పలేదు. సింధూరి విజయాల్లో నాకు అత్యంత సంతోషం కలిగించిన సందర్భాలు రెండు. రాష్ట్రపతి చేతుల మీదుగా బాలశ్రీ పురస్కారం అందుకోవడం, పీహెచ్‌డి ఎంట్రన్స్‌లో సెలెక్ట్ కావడం... - వరలక్ష్మి, లలితాసింధూరి తల్లి లలితాసింధూరి విజయాలలో కొన్ని... 2011లో జూనియర్ చాంబర్ నుంచి జాతీయస్థాయి ‘అవుట్‌స్టాండింగ్ పర్సన్’ అవార్డు 2006లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చేతుల మీదుగా బాలశ్రీ జాతీయ పురస్కారం 2004-05లలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా బాలరత్న, ప్రతిభ అవార్డులు నృత్యకౌముది, నృత్య భారతి, అభినవ రసధుని, నాట్యమయూరి బిరుదులు 2004 నుంచి నాలుగేళ్లు ‘నవ్యనాటక సమితి’ జాతీయస్థాయి డాన్స్పోటీలలో ప్రథమ బహుమతి పద్మశ్రీ శోభానాయుడు నిర్వహించిన ‘సిరిసిరిమువ్వ’ డాన్స్ కాంపిటీషన్లో మొదటి బహుమతి దూరదర్శన్ ‘మువ్వల సవ్వడి’లో ప్రథమ బహుమతి ఒంగోలులో అఖిల భారత తెలుగు మహాసభల్లో ప్రదర్శన.