breaking news
Silk the eggs
-
లాభాలు పట్టుకోండి
ఖమ్మం వ్యవసాయం: పట్టుదల ఉంటే పట్టు పరిశ్రమలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ పరిశ్రమను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ఏర్పాటుకు ప్రభుత్వం కూడా తోడ్పాటునిస్తోంది. పట్టు పరిశ్రమ నిర్వహణలో షెడ్ నిర్మాణం, నిర్వహణ ముఖ్యమైనది. పట్టు పురుగుల మేత కోసం మల్బరీ తోటలు పెంచుకోవాలి. జిల్లాలో మొత్తం 365 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 138 ఎకరాల్లో నూతనంగా మల్బరీ సాగు చేపట్టారు. తిరుమలాయపాలెం, ముదిగొండ, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కొత్తగూడెం, భద్రాచలం, కూసుమంచి తదితర మండలాల్లో పట్టుపరిశ్రమలను నిర్వహిస్తున్నారు. పట్టుపరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, పరిశ్రమల ఏర్పాటు, మల్బరీ తోటల పెంపకం గురించి జిల్లా పట్టుపరిశ్రమల అధికారి మడికంటి ఆదిరెడ్డి వివరించారు. ప్రభుత్వ చేయూత మల్బరీ తోటల పెంపకానికి, షెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం సీడీపీ (క్యాటలైటిక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పథకం కింద నిధులను మంజూరు చేస్తుంది. దీనికి రైతులు కనీసం 2 ఎకరాలు ఒక యూనిట్‌గా మల్బరీ తోటలను పెంచుకోవాలి. మల్బరీ సాగు చేసే రైతులు పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ విధిగా నిర్మించాలి. షెడ్ నిర్మాణానికి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనిలో సుమారు 50 శాతం నిధులను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుంది. షెడ్ 50ఁ20 పొడవు, వెడల్పు సైజులో నిర్మించాలి. షెడ్లో మెస్సు నిర్మాణానికి రూ.16 వేలు, పరికరాలు, ప్లాస్టిక్ ట్రేలు, ప్లాస్టిక్ నేత్రికలకు రూ.21,500లను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది. పట్టుపరిశ్రమ శాఖ మల్బరీ మొక్కలను సరఫరా చేస్తుంది. జిల్లాలోని అశ్వారావుపేట, అక్కినేపల్లి, ఖమ్మం సమీపంలోని టేకులపల్లి, కొత్తగూడెం మండలంలోని గరిమళ్లపాడు నర్సరీల్లో మల్బరీ మొక్కలు పెంచుతున్నారు. జిల్లాలోని నర్సరీల్లో వి-1 రకం మొక్కలు లభిస్తున్నాయి. ఎకరాకు 5,500 మొక్కలు పడుతాయి. వీటికి రూ.9,500 ఖర్చు వస్తుంది. వీటిలో పట్టుపరిశ్రమశాఖ రూ.6,750లను సబ్సిడీ కింద ఇస్తుం ది. అంటే రైతు మొక్క ల కోసం రూ. 2,250లను భరిస్తే సరిపోతుంది. ప్లాంటేషన్ మల్బరీ మొక్కలను జూన్ నుంచి నవంబర్ నెల వరకు నాటుకోవచ్చు. దుక్కిని లోతుగా దున్నాలి. 4 సార్లు దుక్కి దున్నితే మంచిది. దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. వర్మి కంపోస్టునూ వేసుకోవచ్చు. మొక్కల మధ్య, వరుసల మధ్య 3ఁ3 సైజు ఉండే విధంగా నాటు కోవాలి. మొక్క నాటిన తొలి రోజుల్లో వారానికి ఒక తడి ఇవ్వాలి. తరువాత 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వవచ్చు. నేల రకాలు, పట్టు పరిశ్రమశాఖ అధికారుల సూచనల మేరకు రెండునెలలకు ఒకసారి అవసరమైతేనే రసాయన ఎరువులు వాడాలి. 4 నెలలకు మొదటి పంట వస్తుంది. మొదటి సంవత్సరంలో మూడు పంటలు వస్తాయి. రెండో సంవత్సరం 5 నుంచి 7 పంటలు తీయవచ్చు. ఒకసారి మల్బరీ వేస్తే 12 నుంచి 15 ఏళ్ల వరకు దాన్ని మేతగా ఉపయోగించుకోవచ్చు. పట్టు పురుగుల పెంపకం సెంట్రల్ సిల్క్ బోర్డ్ విజయవాడ నుంచి పట్టుగుడ్లను సరఫరా చేస్తుంది. 100 పట్టుగుడ్ల ధర రూ.550 (మేలు రకమైన పట్టు గుడ్లు) నెల రోజుల్లో పట్టు గూళ్లు అల్లుకుంటాయి. ఆదాయం: ఎకరం మల్బరీ సాగు చేస్తే దాని ఆకుతో పెంచిన పురుగులతో సంవత్సరానికి రూ. లక్ష ఆదాయం వస్తుంది. ఒక కిలో పట్టు గూడు ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.340 వరకు ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సహకంగా కిలోకు రూ.50 చొప్పున అందిస్తోంది. మార్కెటింగ్ రైతులు పండించిన పంటను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు. తెలంగాణలోని జనగాం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని హనుమాన్‌జంక్షన్, అనంతపురం, రామ్‌నగర్ (బెంగళూరు)లలో పంటను అమ్ముకునే అవకాశం ఉంది. ఏడాదిలో ఆగస్టు 15, జనవరి 26 మినహా అన్ని రోజుల్లో ఇక్కడ పంటను అమ్ముకోవచ్చు. నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడే అమ్ముకోవడానికి వీలుకాదు. -
సబ్సిడీ ‘పట్టు’!
జిల్లాలో ఐదు పట్టు విత్తన క్షేత్రాలు.. సేంద్రియ ఎరువులతో మల్బరీ తోటల పెంపకం పట్టు పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం జిల్లాలో ఐదు పట్టు విత్తన క్షేత్రాలను ఏర్పాటుచేసింది. మొయినాబాద్ మండలంలోని నజీబ్‌నగర్, తాండూరు, వికారాబాద్ మండలంలోని అనంతగిరిపల్లి, దూలపల్లి, మంచన్‌పల్లి గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసింది. వీటిలో మల్బరీ మొక్కలను, చాకీ వామ్స్ను పెంచి రైతులకు తక్కువ ధరకు అందజేస్తున్నారు. మల్బరీ మొక్కలను క్షేత్రంలోనే నాటువేసి అవి కొంత పెద్దవైన తర్వాత ఒక్కో మొక్కను రూపాయి పావలాకు అందజేస్తారు. ఎకరా పట్టు తోటలను సాగు చేయాలంటే ఐదువేల మల్బరీ మొక్కలు అవసరం. నజీబ్‌నగర్ క్షేత్రంలో సేం ద్రియ ఎరువులైన పేడ, వేపపిండిని ఉపయోగించి మొక్కలను పెంచుతున్నారు. దీంతో ఈ మల్బరీ మొక్కలకు ఎక్కువ చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. రైతులు మ ల్బరీ తోటలు నాటిన నాలుగో నెల నుంచి పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. రైతు ఒక ఎకరంలో మల్బరీ తోట సాగు చేసిన రెండో సంవత్సరం నుంచి పట్టు పురుగులను పెంచి పట్టుగూళ్లను ఉత్పత్తి చేసి విక్రయించడం వల్ల సంవత్సరానికి రూ.లక్షా 20వేలనుంచి రూ.లక్షా 50వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. సబ్సిడీకి అర్హతలివే.. పట్టు పరిశ్రమ చేపట్టే రైతులు వ్యవసాయ బావి గానీ, బోరు గానీ కలిగి ఉండి సంవత్సరం పొడవునా నీటి వసతి పుష్కలంగా కలిగి ఉండాలి. సొంత పట్టా భూమి కలిగిన అన్ని కులాలు, అన్ని కేటగిరీలకు సంబంధించిన రైతులు అర్హులు. ఇసుక భూములు, ఆమ్ల, క్షార భూములు మల్బరీ తోటలు పెంచేందుకు పనికిరావు. సమతుల భూములు అత్యంత శ్రేష్టమైనవి. నీటిని పారించేందుకు ఎరువులు వేసేందుకు అనువుగా ఉండాలి. మట్టి నమూనా పరీక్షలు చేయించటం అవసరం. మల్బరీ తోటకు రెండున్నర ఎకరాలు కేటాయించాలి. అక్కడే పట్టు పురుగులు పెంచేందుకు షెడ్లను నిర్మించుకోవాలి. పట్టు పరిశ్రమను చేపట్టే రైతులు సబ్సిడీ పొందేందుకు తప్పనిసరిగా 5 సంవత్సరములు మల్బీరీ తోటను పెంచి, పట్టు పురుగుల పెంపకం చేపట్టి, పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తామని అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో పట్టు పరిశ్రమ శాఖ ద్వారా పొందిన సబ్సిడీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి ఏడాదికి 1000 నుంచి 1200 రింగుల పట్టు గుడ్లు పెంచి 600 కేజీల నుంచి 720 కేజీల నాణ్యత కలిగిన పట్టుగూళ్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. పట్టు పరిశ్రమ శాఖనుంచి సీడీపీ స్కీం కింద రైతులకు ఆయా పనులు చేసేందుకు సబ్సిడీ అందజేస్తారు. సబ్సిడీ కోసం రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను దరఖాస్తుతోపాటుగా సంబంధిత శాఖ అధికారులకు సమర్పించాలి.