యూనిఫాం పోస్టులకూ సడలింపు!
గరిష్ట వయోపరిమితి మూడు నుంచి ఐదేళ్ల వరకు సడలింపు
5 కి.మీ. పరుగు పందెం పోటీకి స్వస్తి
ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో మరణించిన వారికి రెట్టింపు ఎక్స్‌గ్రేషియా
కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు
సీఎం ఆమోద ముద్ర పడగానే అమల్లోకి
హైదరాబాద్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో తీపి కబురు వినిపించనుంది! యూనిఫాం సర్వీస్ పోస్టులకు కూడా గరిష్ట వయో పరిమితిని మూడు నుంచి ఐదేళ్ల వరకు సడలించేందుకు కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర పడగానే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చైర్మన్‌గా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రస్తుతం పోలీస్ రిక్రూట్మెంట్లకు నిర్వహించే 5 కి.మీ. పరుగు పందెం పోటీకి స్వస్తి పలకాలని నిర్ణయించింది. అలాగే ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో మరణించినా లేదా తీవ్రంగా గాయపడిన వారికి ప్రస్తుతం అందజేస్తున్న దానికన్నా రెట్టింపు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలను మరోసారి సమీక్షించి త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదిక రూపంలో అందజేయనున్నారు. కమిటీ నివేదికకు కేబినేట్ ఆమోదముద్ర వేసిన వెంటనే ప్రభుత్వం అమలు చేయనుంది.
తొలి విడత ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రభుత్వం భర్తీ చేయనున్న 15 వేల పోస్టుల్లో పోలీస్ శాఖకు చెందినవే 9 వేలకుపైగా ఉన్నాయి. సబ్ కమిటీలో ఈ అంశంపై చర్చించారు. ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాబట్టి పోస్టుల భర్తీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే యూనిఫాం సర్వీసులకు మినహా మిగతా పోస్టులన్నింటికీ వయో పరిమితిని పదేళ్ల పాటు సడలించారు. ఈ నేపథ్యంలో యూనిఫాం సర్వీసు పోస్టులకు సడలింపు లేకపోవడం సమంజసం కాదని భావించారు.
దేశంలోనే అత్యుత్తమ ఎక్స్‌గ్రేషియా..
ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో మరణించిన లేదా తీవ్రంగా గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున దేశంలోనే అత్యుత్తమ ఎక్స్‌గ్రేషియా అందజేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎక్స్‌గ్రేషియా కింద ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్ వరకు రూ.25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇస్తున్నారు. దీన్ని రెట్టింపు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఉగ్రవాద, నక్సల్స్ దాడుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు మరణిస్తే రూ.35 లక్షలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లకు రూ.25 లక్షలు అందజేస్తున్నారు. సాధారణ ప్రజలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నారు. వీటన్నింటినీ రెట్టింపు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అలాగే దాడుల్లో మరణించే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. సబ్ కమిటీ భేటీలో మంత్రి కె.తారకరామారావు, ముఖ్య కార్యదర్శులు వికాస్‌రాజ్, శివ శంకర్, రాజీవ్ త్రివేది, డీజీపీ అనురాగ్‌శర్మ, అడిషనల్ డీజీపీలు సుదీప్ లక్టాకియా (శాంతిభద్రతలు) తదితరులు పాల్గొన్నారు.