breaking news
Selva Kannan
-
విద్యార్థులే నిర్మాతలు
తమిళసినిమా: విద్యార్థులతో పెట్టుకోకూడదు. వారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు అంటారు. అది సినిమా రంగంలోనూ నిజం అవుతోంది. అవును కథ నచ్చడంతో ఏకంగా 50 మంది విద్యార్థులు కలిసి సినిమా నిర్మించేస్తున్నారు. ఆ చిత్రం పేరు నెడు నల్వాడై. బీ స్టార్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక తాత పాత్రలో 70 ఏళ్ల పూరాము అనే నటుడు నటించడం విశేషం. ఆయనతో పాటు ఇళంగో, అంజలీనాయర్, మైమ్గోపీ, ఐందుకోవిలాన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సెల్వ కన్నన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ మారుతున్న ఈ ఆధునిక యుగంలో మన సంస్కృతి, సంప్రదాయాలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రాల రాక అరుదైపోతోందన్నారు. అయితే అలాంటి మంచి కథా చిత్రాలపై ప్రేక్షకులు మాత్రం ప్రత్యేక ఆదరణ చూపుతూనే ఉన్నారని అన్నారు. అలాంటి మన సంస్కృతిని ఆవిష్కరించే చిత్రంగా నెడు నల్వాడు ఉంటుందన్నారు. ఇది తాతామనవళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. నెల్లై జిల్లాలో ఇప్పటికీ జీవిస్తున్న ప్రజల జీవన విధానాన్ని యదార్థంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. తనతో పాటు నెల్లైలోని శంకర్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న 50 మంది విద్యార్థులు కథ నచ్చడంతో నిర్మించడానికి ముందుకొచ్చారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ నెడు నల్వాడై చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆగస్ట్ నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సెల్వ కన్నన్ వెల్లడించారు. -
దర్శకుడిపై నటి ఆరోపణలు
చెన్నై: దర్శకుడు సెల్వకణ్ణన్ వేధింపులకు గురి చేయడం వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని సినీ నటి అతిథి అలియాస్ అథిరా సంతోష్ వెల్లడించింది. తనను చంపుతానని బెదిరించాడని వాపోయింది. గత నెల 28న విషం తాగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది. సెల్వకణ్ణన్ పై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశానని మీడియాతో అతిథి చెప్పింది. నడిగర్ సంఘంలో సభ్యుడు కానందున అతడిపై చర్య తీసుకోలేమని అధ్యక్షుడు విశాల్ చెప్పారని వెల్లడించింది. దీంతో సెల్వకణ్ణన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ లో నటించిన అతిథి, తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ సెల్వకణ్ణన్ తన వెంటపడి వేధించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని వాపోయింది. తాను ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించాడని తెలిపింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్టు వెల్లడించింది.