breaking news
Seemandhra advocates
-
లాయర్ల విధుల బహిష్కరణ
సాక్షి, నెట్వర్క్ : తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడానికే హైకోర్టు కేంద్రంగా సీమాంధ్ర న్యాయవాదులు కుట్రలు చేస్తున్నారని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర న్యాయవాదుల దాడులకు నిరసనగా రాష్ట్ర న్యాయవాద జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ జిల్లాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అంబరీషరావు, సునీల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టిస్తే.. తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందనే వారు ఇలా వ్యవహరిస్తున్నారని, దీన్ని తెలంగాణవాదులు అడ్డుకోవాలని కోరారు. సీమాంధ్ర న్యాయవాదులు హైకోర్టు నిబంధనలను సైతం ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్, జనగామలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఖమ్మంలోని జిల్లా కోర్టు ముందు సీమాంధ్ర న్యాయవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు. భద్రాచలంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. ఇల్లెందులో కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నల్లగొండ న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి, కోర్టు ఎదుట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వె ళుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు సర్దిచెప్పి పంపారు. నిజామాబాద్‌లో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ కోర్టుల్లో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. బోధన్‌లో విద్యార్థి సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 1354వ రోజుకు చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. -
'ఈ నెల11న సమైక్యాంధ్ర అడ్వకేట్స్ మానవహారం'
ఈ నెల 11న సమైక్యాంధ్ర అడ్వకేట్స్ ఆధ్వర్యంలో మళ్లీ మానవహారం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అందుకు సహకరించాలని ఆయన తెలంగాణ అడ్వకేట్స్ను కోరారు. సమైక్యాంధ్ర కోరుతున్న అడ్వకేట్స్ అందరితో ఈ నెల 28న ఓ సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం మానవహారానికి సిద్దమైన సీమాంధ్ర అడ్వకేట్స్పై తెలంగాణ లాయర్ల దాడిని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అందుకు నిరసనగా మంగళవారం హైకోర్టు ఆవరణలో సీమాంధ్ర అడ్వకేట్స్ బైటాయించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. హైకోర్టులో తెలంగాణ అడ్వకేట్స్‌కు అనుకూలంగా పోలీసులు వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసినందుకు ఏపీఎన్జీవోలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనంతపురంలో ఈ నెల 14న అడ్వకేట్ జేఏసీ ప్రకటించిన నిరసన కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం తెలుపుతున్నట్లు సీవీ మోహన్‌రెడ్డి ప్రకటించారు.