breaking news
The second double century in ODIs
-
సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మ
కోల్ కతా: ప్రపంచ క్రికెట్ లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గురువారం నాటి నాల్గో వన్డేలో డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డులను తిరగరాసిన రోహిత్.. తాజాగా తాను ఆడిన ఇన్నింగ్స్ తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందన్నాడు. తన కెరీర్ లో మరిన్ని లక్ష్యాలను అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. టీమిండియా ఘనవిజయం సాధించిన అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ఈ రికార్డు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడే అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడాలనుకున్నానని సృష్టం చేశాడు. ఇదిలా ఉండగా తన పునరాగమంలో జట్టు ఫిజియో వైభవ్ దాగా కృషి మరువలేనిదని రోహిత్ తెలిపాడు. ఆస్ట్రేలియన్లు మంచి క్రికెట్ ఆడతారని, ఆస్ట్రేలియి పర్యటనకు భారత్ కు పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో టీం మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుందన్నాడు. జట్టు ప్రయోజనాలకు తనకు ముఖ్యమని రోహిత్ స్పష్టం చేశాడు. -
విధ్వంసం సాగిందిలా...
ఒక్క పరుగుకే తప్పిన రనౌట్... ఆ తర్వాత బంతిని ఎదుర్కోవడంలోనే ఇబ్బంది పడుతూ మెయిడిన్ ఓవర్... వెంటనే 4 పరుగుల వద్దే సునాయాస క్యాచ్ నేలపాలు... 22వ బంతికి మొదటి బౌండరీ... ఆరంభంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ సాగిన తీరిది... రెండు నెలల విరామం తర్వాత టీమిండియాకు ఆడుతుండటంతో పాటు తన ఓపెనింగ్ స్థానంపై ఉన్న అనిశ్చితి కూడా అతనిపై ఒత్తిడి పెంచినట్లుంది. అందుకే క్రీజ్‌లో ఉంటే చాలనే తరహాలో బ్యాటింగ్ కనిపించింది. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్నాక అతను విలయం సృష్టించాడు. ఏ బౌలర్‌నూ లెక్క చేయకుండా విరుచుకుపడ్డ తీరు అసలు సిసలు రోహిత్‌ను చూపించింది. ఏడాది వ్యవధిలో రెండో ‘రెండొందలు’ అతనికి వందనం చేసింది. అన్ని రకాలుగా... ఈ ఇన్నింగ్స్ మొత్తం చూస్తే రోహిత్ ఆడని షాట్ లేదు. మైదానంలో అతను బంతిని పంపించని చోటు లేదు. అతని విధ్వంసం బారిన పడని బౌలర్ లేడు. వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్ రుచి చూసిన శ్రీలంక బౌలర్లు ఇక్కడ మరీ నిస్సహాయంగా మారిపోయారు. చూడచక్కని డ్రైవ్‌లు, అద్భుతమైన కట్ షాట్లు, ఆకట్టుకునే లేట్ కట్, పుల్ షాట్, తనదైన శైలిలో చిన్న మార్పుతో హెలికాప్టర్ షాట్లు... ఇలా ప్రతీది పరుగుల ప్రవాహాన్ని అందించింది. ఆ షాట్ అపూర్వం... కులశేఖర వేసిన 48వ ఓవర్ చివరి బంతికి రోహిత్ ఆడిన షాట్ అయితే నిజంగా అపూర్వం. ఆఫ్ స్టంప్‌కు చాలా దూరంగా పడి వైడ్‌గా వెళుతున్న హాఫ్ వాలీ బంతి... రోహిత్ కుడివైపు అడుగున్నర వరకు కదిలాడు. ఆ వైపు నుంచి ఆన్‌సైడ్‌లో ఆడిన ఆ బంతి మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మారింది! అతని షాట్లలో ఎక్కడా తడబాటు లేదు. తిరుగులేని బ్యాటింగ్... అర్ధ సెంచరీ చేసేందుకు 72 బంతులు తీసుకున్న రోహిత్ మరో 28 బంతుల తర్వాత సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శతకం తర్వాతే అతను మరింత చెలరేగిపోయాడు. తర్వాతి 164 పరుగులను అతను 73 బంతుల్లోనే అందుకున్నాడు. 200 నుంచి 250 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు అయితే అతనికి 15 బంతులే సరిపోయాయి! రికార్డులు సృష్టిస్తూ.... ఈ క్రమంలో అత్యధిక ఫోర్లు సహా అనేక రికార్డులు అలవోకగా అందుకుంటూ ముందుకు సాగాడు. ముందుగా తన అత్యధిక స్కోరు (209)ను అధిగమించిన ఈ ముంబైకర్... ఎరంగ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది సెహ్వాగ్ (219) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. గత ఏడాది బెంగళూరులో ద్విశతకం సాధించిన రోజున చిన్నస్వామి మైదానం చాలా చిన్నదన్నారు. కానీ క్లాస్‌కు, సత్తాకు మైదానం సైజు లెక్క కాదని ఈడెన్ గార్డెన్స్‌లో అతను నిరూపించాడు. 4, 201, 222 పరుగుల వద్ద రోహిత్ క్యాచ్‌లను వదిలి లంక ఆటగాళ్లూ రికార్డులో ఇతోధిక సహాయం అందించినా... ఈ యువ ఆటగాడి ప్రదర్శనను అది తక్కువ చేయలేదు. కోహ్లితో 202 పరుగులు జత చేస్తే, అందులో 132... ఉతప్పతో 128 పరుగులు జోడిస్తే అందులో 109 రోహిత్‌వే కావడం విశేషం. 30వ ఓవర్‌నుంచి రోహిత్ దూకుడు ప్రారంభమైంది. అదే తొలి ఓవర్ నుంచే సాగితే ‘ట్రిపుల్’ కూడా సాధ్యమయ్యేదేమో! -
అ'ద్వితీయం 264
వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్ నాలుగో వన్డేలోనూ లంకపై భారత్ గెలుపు సిరీస్‌లో 4-0తో ఆధిక్యం ఒకవైపు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ 150 వసంతాల సంబరాలకు సిద్ధమైంది. కానీ వాటి వెలుగు జిలుగులను తగ్గిస్తూ మరో మెరుపు మెరిసింది. అది ముంబై నుంచి రోహిత్ శర్మ రూపంలో వచ్చింది. అంతే... ఒక మహాద్భుతం జరిగిపోయింది. గత ఏడాది సిక్సర్ల దీపావళి జరుపుకున్న రోహిత్, ఈసారి బౌండరీలతో పండగ చేసుకున్నాడు. బ్యాట్‌ను విల్లుగా.. బంతులను బాణాలుగా చేసిన రోహిత్ శర్మ... లంకను జయించిన శ్రీరాముడిలా... కోల్‌కతాలో కాళికావతారం ఎత్తాడు. బౌండరీల జోరుతో... సిక్సర్ల హోరుతో... వన్డేల్లో రెండో ‘డబుల్ సెంచరీ’తో కొత్త చరిత్ర లిఖించాడు. మ్యాచ్ ఆద్యంతం తనదైన శైలిలో చెలరేగుతూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పరుగుల తుపాన్ సృష్టించాడు. రోహిత్ శర్మ ఒక్కడే 264 పరుగులు చేయగా... శ్రీలంక జట్టు మొత్తం 251 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా: పది వారాల తర్వాత బరిలోకి దిగినా... లంకేయులకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. టచ్‌లోకి రావడానికి కాస్త సమయం తీసుకున్నా... ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ చేశాడు. కలలో కూడా ఎవరూ ఊహించని... సాహసించని స్థాయిలో దుమ్మురేపిన రోహిత్ శర్మ (173 బంతుల్లో 264; 33 ఫోర్లు, 9 సిక్సర్లు) వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీతో శివమెత్తాడు. లంక బౌలర్లను చేష్టలుడిగేలా చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఫలితంగా గురువారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ 153 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ సేన 4-0 ఆధిక్యంలో నిలిచింది. వన్డే చరిత్రలో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ కొత్త చరిత్ర సృష్టించగా, కరణ్ శర్మ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే ఆదివారం రాంచీలో జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 404 పరుగుల భారీ స్కోరు చేసింది. రహనే (24 బంతుల్లో 28; 6 ఫోర్లు), అంబటి రాయుడు (8) తొందరగా అవుటైనా... రోహిత్ చెలరేగిపోయాడు. కోహ్లి (64 బంతుల్లో 66; 6 ఫోర్లు) కూడా రాణించడంతో బ్యాటింగ్ పవర్ ప్లేలో ఈ ఇద్దరు 57 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. మూడో వికెట్‌కు 155 బంతుల్లో 202 పరుగులు జోడించాక కోహ్లి అనూహ్యంగా రనౌటయ్యాడు. ఈ దశలో వచ్చిన రైనా (11) విఫలమైనా... సెంచరీ తర్వాత రోహిత్ మరింత రెచ్చిపోయాడు. ఉతప్ప (16 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి ఐదో వికెట్‌కు 128 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చివరి బంతికి క్యాచ్ అవుటయ్యాడు. మ్యాథ్యూస్ 2, కులశేఖర, ఎరంగా చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 43.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. మ్యాథ్యూస్ (68 బంతుల్లో 75; 9 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. తిరిమన్నే (69 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. దిల్షాన్ (33 బంతుల్లో 34; 6 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడినా.... టాప్ ఆర్డర్ విఫలం కావడంతో లంక 48 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. మ్యాథ్యూస్, తిరిమన్నే ఐదో వికెట్‌కు 118 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే మ్యాథ్యూస్ అవుటైన తర్వాత లంక ఇన్నింగ్స్‌ను కులకర్ణి ఘోరంగా దెబ్బతీశాడు. తన వరుస రెండు ఓవర్లలో తిరిమన్నే, తిసారా పెరీరా (29 బంతుల్లో 29; 1 ఫోర్, 3 సిక్సర్లు), కులశేఖర (0), ప్రసన్న (11)లను అవుట్ చేశాడు. దీంతో 15 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో లంకకు ఓటమి తప్పలేదు. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఒకే ఒక్కడు ‘టాలెంటెడ్’ రోహిత్ శర్మ... ఈ ముంబై బ్యాట్స్‌మన్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అతని గురించి ఇదే మాట వినిపిస్తుంది. అయితే ఎక్కువ సార్లు ఈ పదాన్ని ప్రతిభకు గుర్తింపు కంటే వ్యంగ్య వ్యాఖ్యకే ఎక్కువ మంది పరిమితం చేశారు. కానీ ఎంతో మంది దిగ్గజాలు తమ కెరీర్లో అందుకోలేని ఘనత 27 ఏళ్లకే ఈ ముంబై బ్యాట్స్‌మన్‌కు సొంతమైంది. సచిన్‌కు అవకాశం లేదు. సెహ్వాగ్‌కు కూడా ఇకపై సాధ్యం కాకపోవచ్చు! కానీ, రోహిత్ గురునాథ్ శర్మ చేసి చూపించాడు. వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీ బాది తన స్థాయిని అమాంతం పెంచుకున్నాడు. అదీ ఏడాది వ్యవధిలోగా అంటే సాధారణ విషయం కాదు. అపార ప్రతిభతోపాటు కఠోర శ్రమ కూడా తోడు కావాలి. వన్డేల్లో తొలి ఆరేళ్ల పాటు రోహిత్ కెరీర్లో ఎలాంటి మెరుపులు లేవు. ఎవరైనా గాయపడితే జట్టులోకి రావడం, పోవడం... ఎప్పుడో సహాయక పాత్రలో కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడటం తప్ప వాటిలో రోహిత్ ముద్ర కనపడలేదు. రెండేళ్ల క్రితం శ్రీలంకతో ఐదు వన్డేల్లో కలిపి 13 పరుగులు చేసినప్పుడైతే ఇలాంటి ఆటగాడిని ఇంకా ఎంత కాలం భరిస్తారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ అలాంటి స్థితిలోనూ అతడిని కెప్టెన్ ధోని నమ్మాడు. గత ఏడాది ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి కొత్త రోహిత్‌ను పరిచయం చేశాడు. ఈ అవకాశాన్ని అతను అందిపుచ్చుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీతో మొదలైన ఆ ఫామ్ తొలి డబుల్ సెంచరీ వరకు సాగింది. ఫలితంగా జట్టులో స్థానం సుస్థిరమైంది. ఇప్పుడు మరో ద్విశతకం అతడిని ఒక్కసారిగా శిఖరాన నిలబెట్టింది. వరుస వైఫల్యాలతో గత ప్రపంచ కప్ జట్టులో రోహిత్ సభ్యుడు కాలేకపోయాడు. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ ఆడటం ఖాయమైపోవడంతో మరో అవకాశం అతని ముంగిట నిలిచింది. ఈ టోర్నీలో రోహిత్ కీలకమవుతాడంటూ కోహ్లి వ్యాఖ్యానించిన మరుసటి రోజే అతను దుమ్ము దులిపాడు. ఆసీస్ గడ్డపై కూడా ఇదే జోరు కొనసాగించి జట్టును గెలిపిస్తే వన్డే దిగ్గజాల జాబితాలో అతని పేరు కూడా చేరవచ్చు! - సాక్షి క్రీడావిభాగం ► వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264)ను రోహిత్ శర్మ సాధించాడు. గతంలో సెహ్వాగ్ (219) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ► వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్. గత ఏడాది ఆస్ట్రేలియాపై అతను 209 పరుగులు చేశాడు. ► ఈ మ్యాచ్‌లో రోహిత్ 33 ఫోర్లు కొట్టడం కొత్త ప్రపంచ రికార్డు. గతంలో సచిన్, సెహ్వాగ్‌లు తాము డబుల్ సెంచరీలు చేసిన మ్యాచ్‌ల్లో 25 చొప్పున ఫోర్లు కొట్టారు. ► లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఇది రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. సర్రే ఆటగాడు అలిస్టర్ బ్రౌన్ (268) అగ్రస్థానంలో ఉన్నాడు. లిస్ట్ ‘ఎ’లోనే బ్రౌన్ రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. ► భారత్ ఇన్నింగ్స్‌లో రోహిత్ 65 శాతం పరుగులు సాధించాడు. రిచర్డ్స్ (69.5 శాతం), కపిల్ (65.8 శాతం) తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. ► వన్డేల్లో భారత ఆటగాళ్లు నాలుగు డబుల్ సెంచరీలు చేయగా, మూడు సార్లు భారత్... ప్రత్యర్థిపై 153 పరుగుల తేడాతోనే గెలవడం విశేషం ► వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ ► ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ రోహిత్‌కు, రెండో స్థానంలో ఉన్న కోహ్లి (66)కి మధ్య పరుగుల తేడా. వన్డేల్లో ఇదే అత్యధిక తేడా. ⇔ ‘చాలా బాగా ఆడాడు. అపార ప్రతిభ రోహిత్ సొంతం. ఆ ఆటను ఆస్వాదించండి’ - ధోని ⇔ ‘264 పరుగుల రికార్డు ఎప్పటికీ చెరిగిపోదు. చరిత్ర సృష్టించినందుకు అభినందనలు’ - హర్భజన్ సింగ్ ⇔ ‘రోహిత్ ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా. అతని ఇన్నింగ్స్ చూడలేకపోయా. కానీ రెండో డబుల్ సెంచరీ చేయడం ప్రత్యేకమే’ - సచిన్ ⇔ ‘నీ తర్వాతి లక్ష్యం ఐపీఎల్లో 200 కావాలి. అసాధ్యమేమీ కాదు’ - అనిల్ కుంబ్లే ⇔ ‘ఒక స్పెషల్ ఆటగాడి నుంచి స్పెషల్ ఇన్నింగ్స్ జాలువారింది. రోహిత్‌కు శుభాకాంక్షలు’ - వీవీఎస్ లక్ష్మణ్ ‘రోహిత్ శర్మకు అభినందనలు. రెండు డబుల్ సెంచరీలు అసాధారణం. వన్డేల్లో అత్యధిక స్కోరు కూడా సాధించిన రోహిత్ ప్రదర్శన నిజంగా అద్భుతం’ - వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోహ్లి రనౌట్‌తోనే... 2013 నవంబర్ 2న రోహిత్ తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఆ రోజు కూడా రోహిత్‌తో సమన్వయ లోపంతో కోహ్లి రనౌటయ్యాడు. ఈసారి కూడా అదే తరహాలో రోహిత్ మరోవైపు ఉండగానే కోహ్లి రనౌటయ్యాడు. ఇప్పుడూ రోహిత్ డబుల్ కొట్టాడు. పూర్తిగా 50 ఓవర్ల పాటు ఆడటం సంతోషకరం. దీనిపై చాలా కాలంగా శ్రమిస్తున్నా. ఇప్పుడు ఫలితం దక్కింది. ఇన్ని రోజుల విరామం ఎలాగూ తీసుకున్నా కాబట్టి అలసిపోవడం అనే మాటే లేదు. మరో 50 ఓవర్లు కూడా ఆడగలిగేవాడిని. ఇన్ని షాట్లలో ఏది అత్యుత్తమం అంటే తేల్చుకోవడం కష్టం. ఈడెన్‌లో నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. వాటిలో ఇది అత్యుత్తమం. భవిష్యత్తులో 300 పరుగులు చేయడానికి కూడా ప్రయత్నిస్తా. అయితే ఇప్పుడు 264తో సంతృప్తిగా ఉంది. - రోహిత్ శర్మ ఒక్కసారి రోహిత్ నిలదొక్కుకుంటే ప్రమాదకరంగా మారతాడని ఒక రోజు ముందే చెప్పా. ఈ రికార్డు ఇప్పట్లో చెరిగిపోయేది కాదు. ఆ సమయంలో నేనూ అక్కడ ఉన్నానని భవిష్యత్తులో నా పిల్లలకు చెప్పగలను. క్రీజ్‌లో పరుగులు సులభంగా రావడం లేదని అతను చెప్పినప్పుడు కాస్త సమయం తీసుకోమని సూచించా. అతను 70-80 దాటితే ఆపడం అసాధ్యం. ప్రస్తుతానికి కెప్టెన్‌గా సంతృప్తిగా ఉన్నా. కఠిన పరిస్థితుల్లో ఇంకా నేనేంటో తెలుస్తుంది. - విరాట్ కోహ్లి, కెప్టెన్ ‘క్యాబ్’ బహుమానం రూ.2.64 లక్షలు ఈడెన్ గార్డెన్స్‌లో తుపాన్ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన రోహిత్ శర్మకు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) చిరు బహుమతిని ప్రకటించింది. అతను ఈ ఇన్నింగ్స్‌లో సాధించిన ఒక్కో పరుగుకు వేయి రూపాయల చొప్పున అందజేయనుంది. ఫలితంగా 264 పరుగులకుగాను రూ. 2 లక్షల 64 వేల రూపాయలు రోహిత్‌కు దక్కాయి. ఇదే మైదానంలో తొలి రంజీ మ్యాచ్, తొలి టెస్టు ఆడిన రోహిత్ ఇప్పుడు ప్రపంచ రికార్డు కూడా ఇక్కడే సృష్టించడం విశేషం.