breaking news
school cricket tournment
-
విజేత హైదరాబాద్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-17 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను హైదరాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ జట్టు 15.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో హైదరాబాద్ జట్టు మూడు పరుగుల ఆధిక్యంతో మహబూబ్‌నగర్ జట్టుపై; రంగారెడ్డి జిల్లా జట్టు తూర్పు గోదావరి జట్టుపై గెలిచాయి. రాష్ర్ట జట్టులో నలుగురికి చోటు చండీగఢ్‌లో జరగనున్న జాతీయ స్కూల్ అండర్-17 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో హైదరాబాద్ జట్టు నుంచి నలుగురు క్రికెటర్లకు చోటు లభించింది. మహ్మద్ అబ్రార్ (సెయింట్ మార్క్స్ బాయ్స్టౌన్ హైస్కూల్), ఎం.సంహిత్ రెడ్డి (శ్రీచైతన్య టెక్నో స్కూల్), మారుతీ రెడ్డి (ఆల్ సెయింట్స్ హైస్కూల్), సాయిప్రజ్ఞయ్ (శ్రీచైతన్య హైస్కూల్) ఎంపికయ్యారు. జిల్లా క్రికెట్ జట్టును అభినందించిన డీఈఓ రాష్ట్ర స్కూల్ అండర్-17 క్రికెట్ టోర్నీ ట్రోఫీని గెలిచిన హైదరాబాద్ జిల్లా క్రికెట్ జట్టును హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి బుధవారం అభినందించారు. హైదరాబాద్ జట్టు క్రికెటర్లు కనబర్చిన ప్రతిభను ఆయన కొనియాడారు. జట్టు విజయానికి కృషిచేసిన కోచ్ డాక్టర్ ప్రమోద్ కుమార్, మేనేజర్ నరేందర్‌తోపాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.యాదయ్యను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. -
12 నుంచి కోకాకోలా క్రికెట్ కప్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి కోకాకోలా క్రికెట్ కప్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), కోకాకోలా సంస్థలు సంయుక్తంగా ఈ అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు కోకాకోలా బెవరేజెస్ ఏపీ జోనల్ ఉపాధ్యక్షుడు గౌరవ్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. తమ సత్తా నిరూపించుకునేందుకు స్కూలు క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమని హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.వి.శ్రీధర్ అన్నారు. టోర్నీలో పాల్గొనేందుకు నగరంలోని 64 స్కూ ల్ జట్లు ఎంట్రీలను పంపాయి. జింఖానాతో పాటు వివిధ మైదానాల్లో 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ... నాకౌట్ పద్ధతిలో అనంతరం సూపర్ లీగ్ పద్ధతిలో జరుగుతుంది. ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.50 వేలు, రన్నరప్‌కు రూ. 35 వేలు అందజేస్తారు.