breaking news
Scarcity of drinking water
-
తాగునీటి ఎద్దడి నివారణకు రూ.4.48 కోట్లు
రాబోవు రెండు నెలలు గడ్డుకాలంగా పరిగణిస్తున్నఅధికారులు సమస్యను అధిగమించేందుకు కరువు నివారణ నిధులు మంజూరు జిల్లాలో తాత్కాలికంగా బోర్ల డ్రిల్లింగ్ నిలుపుదల టైఅప్, ట్రాన్స్పోర్ట్లకే ప్రాధాన్యం చిత్తూరు (టౌన్): జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 4.48 కోట్లతో అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రానున్న రెండు నెలల పాటు జిల్లాలో తాగునీటి పరిస్థితిని అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోతుండడంతో జిల్లాలో వర్షాలు కురిసేంతవరకు కొత్తబోర్ల తవ్వకాలను చేపట్టరాదనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. టైఅప్‌కు మొద టి ప్రాధాన్యతనిస్తూ, విధిలేని పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కూడా నిర్ణయించారు. ఆ మేరకు జిల్లా ప్రజాపరిషత్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులుతో కలిసి ముందస్తు ప్రణాళికలతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తాగునీటి ఎద్దడి నుంచి జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. జెడ్పీ సీఈవో వారంలో రెండుమూడు రోజులు జిల్లాలోని ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, డీఈఈలతో సమీక్షలు, వైర్లెస్ సెట్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ తాగునీటి ఎద్దడిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 918 గ్రామాల్లో నీటిఎద్దడి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని 10,872 హ్యాబిటేషన్లకుగాను మొత్తం 18,537 చేతిపంపులు ఉండగా వాటిలో 785 ఎండిపోయాయి. 8,594 రక్షిత మంచినీటి పథకాలు ఉండగా వాటిలో 225 పనిచేయడం లేదు. 2,278 గ్రామాల్లో డెరైక్ట్ పంపింగ్ ద్వారా నీటిసరఫరా జరుగుతోండగా వాటిలో సగానికి పైగా బోర్లు ఎండిపోయాయి. దాంతో 866 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా 52 గ్రామాల్లో టైఅప్ చేపట్టారు. జిల్లా మొత్తం మీద 918 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొని ఉంది. ఇది ఇప్పటివరకు జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి పరిస్థితి. అయితే జిల్లాలో వర్షాలు కురవని కారణంగా మరో రెండు నెలల పాటు తాగునీటి ఎద్దడి మరింత తీవ్రతరం కానుంది. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలోని 41 మండలాల పరిధిలో మొత్తం 2,259 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 994 గ్రామాల్లో పరిస్థితి తీవ్రంగా వుండగా, 1,265 గ్రామాల్లో మరింత తీవ్రంగా ఉండనుందని అధికారులు గుర్తిం చారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు గాను సీఆర్ఎఫ్ (కెలామిటీ రిలీఫ్ ఫండ్) ద్వారా రూ.4.48 కోట్లను కలెక్టర్ ప్రత్యేకంగా విడుదల చేశారు. దాంతో టైఅప్, ట్రాన్స్‌పోర్ట్‌లను చేపట్టనున్నారు. బోర్ల తవ్వకాలకు బ్రేక్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్ల తవ్వకాలను కలెక్టర్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇప్పటివరకు జిల్లా ప్రజాపరిషత్‌కు చెందిన 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 13 కోట్లను తాగునీటి ఎద్దడి నివారణ కోసం విడుదల చేయగా వాటిలో చాలావరకు కొత్తబోర్ల తవ్వకాలకే ఖర్చు చేశారు. అయితే వాటిలో 30 శాతం కూడా విజయవంతం కాలేదు. దాంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ వర్షాలు కురిసేంత వరకు జిల్లాలో కొత్త బోర్ల తవ్వకాలను నిలుపుదల చేశారు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం టైఅప్, ట్రాన్స్‌పోర్ట్‌లు మాత్రమే చేపట్టాలని ఆదేశించారు. అందులోనూ టైఅప్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తూ విధిలేని పరిస్థితిలోనే ట్రాన్స్పోర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించి ఉన్నారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు పక్కా ప్రణాళిక
నీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులు కేటాయింపు త్వరలో నియోజక వర్గాలవారీగా సమీక్షలు తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ నిధులను ఎక్కువగా కేటాయిస్తానని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మదనపల్లెకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో చర్చించనున్నట్టు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికను రూపొందించనున్నట్టు చెప్పారు.ముఖ్యంగా కండలేరు నదీజలాలను తీసుకురావడానికి నిధులు కొరత ఉందన్నారు. జిల్లాలో అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. రాజంపేట పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మదనపల్లె, పుంగనూరు పట్టణాల్లో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దొంగదార్లలో కౌన్సిలర్లను కొనుగోలుచేస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వారు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి కౌన్సిలర్లను కొనుగోలుచేస్తే ఆ డబ్బును సంపాదించేందుకు అవినీతికి పాల్పడతారే తప్ప అభివృద్ధి ఏంచేస్తారని ప్రశ్నించారు. ఎంపీ వెంట మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి షమీమ్ అస్లాం, మైనారిటీల నాయకుడు బాబ్జాన్, కౌన్సిలర్ జింకా వెంకటా చలపతి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, రాష్ర్ట బీసీ నాయకులు పాల్ బాలజీ, నాయకులు బాలకృష్ణారెడ్డి, కోటూరి ఈశ్వర్, భువనేశ్వరి సత్య, కత్తి కృష్ణమూర్తి, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.