breaking news
saperate district
-
ఆదివాసీల పోరుబాట
నేడు జోడేఘాట్‌లో బహిరంగ సభ హట్టి నుంచి వెయ్యి మందితో మోటార్ బైక్ ర్యాలీ వివిధ గ్రామాల్లో ముగిసిన ప్రచారం కెరమెరి : ఆదివాసీలు మరో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు హక్కులు, చట్టాల కోసం పోరాడిన నాయకులు ఇప్పడు ప్రత్యేక జిల్లా కోసం పోరాటం సాగించనున్నారు. ఇందుకు వారం రోజుల క్రితమే కార్యాచరణ సిద్ధం చేశారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి, వాంకిడి, ఆసిపాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్, మంచిర్యాలతోపాటు పలు ఇతర మండలాలకు చెందిన ఆదివాసీలు భారీ సంఖ్యలో రానున్నారు. ఈ కార్యక్రమానికి గిరిజన అమర వీరుడు కొమురం భీమ్ ప్రాణాలర్పించిన జోడేఘాట్ గ్రామం ప్రధాన వేదిక కానుంది. బుధవారం వరకు ఆదివాసీ యువనాయకులు వివిధ గ్రామాల్లో చేపట్టిన ప్రచారం ముగిసింది. ప్రధాన నాయకులు జోడేఘాట్‌లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు సుమారు వెయ్యి మందితో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. భీమ్ జిల్లా కావాలి.. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాకు కొమురం భీం జిల్లాగా నామకరణం చేస్తామని ప్రకటించారు. కానీ.. ఏ మండలంలో కొమురం భీం ఉన్నాడో ఆ మండలాన్నే ఆదిలాబాద్‌లో కలుపుతామని అధికారులు చెబుతుండడం పై ఆదివాసీలు మండి పడుతున్నారు. కెరమెరితోపాటు వాంకిడి, తిర్యాణి కూడా ఆదిలాబాద్‌లోనే చేర్చుకుంటామని ఊహాగానాలు రావడంతో ఆయా మండలాలకు చెందిన ప్రజలు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమేనని ఆదివాసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చట్టాలు, హక్కులు కోసం ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న ఆదివాసీలను.. ఇలా మండలాలను ముక్కలుగా చేసే కుట్రలు జరుగుతున్నాయని ప్రధాన నాయకుల ఆరోపణ. ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. -
జనగామను జిల్లా చేయాలని భారీ ధర్నా
జనగామ: జనగామను జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలపడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జిల్లా కోసం ఆందోళనలు జరుగుతుండగా.. సోమవారం హైవే దిగ్బంధనంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జనగామ జంక్షన్‌ను లోకల్ లారీలతో మూసివేసి సకలజనులు రోడ్డెక్కారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.