breaking news
Sanjeev Jaiswal
-
థానేలో అక్రమ కట్టడాలపై కొరడా
ముంబై: ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) కమిషనర్ సంజీవ్ జైస్వాల్ కొరడా ఝులిపిస్తున్నారు. అందులో భాగంగా అక్రమ కట్టడాల కూల్చివేత పనులు చేట్టిన సిబ్బంది ఐదు రోజుల్లో థానే-ముంబ్రా ప్రాంతాల్లో వెలసిన వెయ్యికి పైగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. టీఎంసీ పరిధిలో ఇంత తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేయడం ఇదే తొలిసారి. టీఎంసీ పరిధిలో ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలు అనేకం ఉన్నాయి. వాటిపై నిఘావేసే నాథుడే లేక అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇటీవల సత్యం భవనం భూగర్భంలో రెండు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు వెలుగులోకి రావడంతో జైస్వాల్ చర్యలు తీసుకున్నారు. ముంబ్రాలోని శీల్ రోడ్ నుంచి కల్యాణ్ ఫాటా వరకు అక్రమంగా వెలసిన 40 హుక్కా సెంటర్లు, పార్లర్లు, దాబాలు, 10 లాడ్జిలు, సుమారు 400పైగా మోటార్ గ్యారెజ్లను సిబ్బంది కూల్చేశారు. ముఖ్యంగా వీటిని సిబ్బంది నేల మట్టం చేస్తుండగా స్వయంగా సంజీవ్ జైస్వాల్ అక్కడే ఉన్నారు. దీంతో సిబ్బంది ఎవరికి భయపడకుండా పనులు పూర్తిచేశారు. గత వారం నుంచి కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత పనులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అక్కడ అనేక భవనాలు టీఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండానే నిర్మించారు. దీంతో తమపై ఎక్కడ వేటు పడుతుందోనని బిక్కుబిక్కు మంటు కాలం వెల్లదీస్తున్నారు. -
వారిని వెంటనే ఖాళీ చేయించండి
ముంబై : జిల్లాలో ప్రమాదకర, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాల్లో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయించాలని థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల థానేలో భవనం కూలి 11 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ సంజీవ్ జైస్వాల్ గురువారం టీఎంసీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న, ముప్పై ఏళ్ల పైబడిన భవనాలు సుమారు 2,500 వరకు ఉన్నాయని, ఆయా భవనాల్లో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు తెలిపారు. 30 ఏళ్ల పైబడిన భవనాలను గుర్తింపు పొందిన ఆడిటర్లతో స్ట్రక్చరల్ ఆడిట్ చేయించాలని హౌసింగ్ సొసైటీ యజ మానులకు సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలు 58 ఉన్నాయని, వాటిలో 38 భవనాలను ఖాళీ చేయిం చామని, సాధ్యమైనంత త్వరలో మిగ తా భవనాలను కూడా ఖాళీ చేయిస్తామని జైస్వాల్ మీడియాకు వివరించారు. జిల్లాలో ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలు 2,500 ఉండగా వాటిలో 25,000 మంది ప్రజలు నివసిస్తున్నారని వెల్లడించారు. నివాసితులను ఖాళీ చేయించడం, లేదా భవనాలు కూల్చేస్తామని చెప్పారు. థానే రైల్వేస్టేషన్‌కు సమీపంలోని బీ క్యాబిన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 50 ఏళ్లనాటి ఓ భవనం కూలి 11 మంది మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం కూలడానికి గల కారణాలు తెలుసుకోడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది.