breaking news
samikhyandra
-
క్రికెట్ మ్యాచ్‌కు మంత్రుల ఆధిపత్య పోరు షాక్
=క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామన్న గంటా =జరిపి తీరుతామన్న బాలరాజు =వన్డే క్రికెట్‌పై నీలినీడలు =రచ్చబండ కూ మంత్రుల రచ్చ =పది నిమిషాల వ్యవధిలోనే రెండు సమీక్షలు విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యుల ఆధిపత్య పోరు చివరకు క్రికెట్ మ్యాచ్‌నూ తాకింది. మ్యాచ్ జరపొద్దంటూ బీసీసీఐ (భార త క్రికెట్ నియంత్రణ మండలి)కి లేఖ రాయాలని మంత్రి గంటా కలెక్టరుపై ఒత్తిడి తెస్తున్నారు. సమైక్యవాదులంతా మ్యాచ్‌ను అడ్డుకుంటారంటూ సాక్ష్యాత్తూ మంత్రివర్యులే బీసీసీఐ ప్రతినిధులకు హెచ్చరికలు పంపడంతో పాటు బహిరంగంగానూ వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థి మ్యాచ్ జరగదని చెబితే తాను మౌనంగా ఉంటే ఎలా అనే రీతిలో మం త్రి బాలరాజు ఆరు నూరైనా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రకటించారు. మ్యాచ్ రద్దు చే యాలని బీసీసీఐకి లేఖ రాయాల్సిన అవసరం లేదని ఆయన కలెక్టరు మీద ఒత్తిడి తెచ్చారు. మ్యాచ్‌ను అడ్డుకుంటే విశాఖ ఖ్యాతిని దిగజార్చిన వారవుతారని పరోక్షంగా గంటాపై మీద విమర్శల బాణాలు సంధించారు. ఒకరు అవునంటే మరొకరు కాదని పట్టుబడుతుండంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రపంచం మొత్తం చూసే క్రికెట్ మ్యాచ్‌ను కూడా ఇద్దరు మంత్రులు ఓట్ల ప్రాతి పదిక యుద్ధంలా తయారు చేయడం పట్ల క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. మ్యా చ్ నిర్వహణపై అడుగు ముందుకేయాలా? వెనక్కు వేయాలా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం తేల్చుకోలేక సతమతమవుతోంది. ‘రచ్చ’బండ : రాష్ట్ర విభజన సెగ నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 26 వరకు రచ్చబండ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని ఎత్తుగడ వేసింది. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇతర దరఖాస్తుల బూజు దులపాలని, కొత్త దరఖాస్తులను కూడా జోడించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. రచ్చ బండను రచ్చ లేకుండా ఎలా నిర్వహించాలంటూ కలెక్టరు సాల్మన్ ఆరోఖ్యరాజ్ వారం రోజులుగా కుస్తీ పడుతున్నారు. అధికారుల బాధలు అధికారులు పడుతుంటే మంత్రులిద్దరూ ఇక్కడ కూడా మేమున్నామంటూ ముందుకొచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి గంటా తన మద్దతు ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, యు.వి.రమణమూర్తిరాజుతో కలసి సర్క్యూట్ హౌస్‌లో కలెక్టరు ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, ఎస్పీ విక్రం జిత్ దుగ్గల్, ఇతర అధికారులతో రచ్చబండ నిర్వహణపై సమీక్ష జరిపారు. భీమిలిలో 11న రచ్చబండ-3 ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తన వర్గ ఎమ్మెల్యేలు సూచించిన పనులన్నీ రచ్చబండలో పూర్తి చేసేలా సూచనలు ఇచ్చారు. ఇదే సమయంలో సర్క్యూట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రి బాలరాజు మరో గదిలో వేచి ఉండి గంటా, ఆయన వర్గ ఎమ్మెల్యేలు వెళ్లిన పది నిముషాలకు అధికారులతో అక్కడే మరో సమీక్ష జరిపారు. రచ్చబండ నిర్వహణపై ఆయన కూడా కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తొలి సమీక్షలో చెప్పిన ఏర్పాట్ల వివరాలనే అధికారులు మంత్రి బాలరాజుకు మరోసారి వివరించారు. -
వర్షంలోనూ అదే జోరు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలో జరుగుతున్న ఉద్యమం 16వ రోజూ ఉధృతంగా సాగింది. గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం ఆందోళనకారులు లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. నెల్లూరు నగరంలో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, మానవహారం, నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. న్యాయవాదులు ర్యాలీ చేశారు. సూళ్లూరుపేటలో ఆందోళనకారులు జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. జనజీవనం స్తంభించింది. నగరంలో ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి, మానవహారం నిర్వహించారు. పీఎస్ఆర్ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. 44 వ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బారకాసు సెంటర్లో నిరసన దీక్ష చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం మెడికల్, హెల్త్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పొదలకూరులో సమైక్యవాదులు 67 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పూలు పంపిణీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ మనుబోలులో విద్యార్థులు పోలీసులకు పూలు పంపిణీ చేశారు. ఉద్యమాలకు సహకరించాలని కోరారు. గురువారం జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర కోసం రెవెన్యూ సంఘం, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీల ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జేఏసీ, రెవెన్యూ సంఘం, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిలిచారు. చిట్టమూరు మండలంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను ఉపసంహరించేంత వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో జాతీయజెండా ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. పీర్లచావిడి సెంటర్ వద్ద సమైక్యవాదులు మూడోరోజు రిలే నిరాహరదీక్ష కొనసాగించారు. దీక్షకు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే పరసా రత్నయ్య సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. నాయుడుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండా ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. ఉదయగిరిలో ఎన్జీఓలు బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఉదయగిరి మండలం గండిపాళెంలోని బస్టాండ్ సెంటర్లో పాఠశాలల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి వాహనాలను అడ్డుకున్నారు. వింజమూరులో బస్టాండ్ సెంటర్లో విద్యార్థి జేఏసీ, ఎన్జీఓలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు కావలిలో ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ , ఎన్ఎంయూ నాయకులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ శిబిరం వద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆత్మకూరులో బస్టాండ్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం (రూరల్) జిల్లా అధ్యక్షుడు కొల్లా నాగరాజారావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు డిపోలో వంటావార్పు నిర్వహించారు. ఆపస్ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, నాయకుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సైదాపురం బస్టాండ్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వంటావార్పు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను గ్రామ పురవీధుల్లో ఊరేగించి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మండలంలోని ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించి టైర్లు దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కోర్టు గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.