breaking news
samaikhya andhra strike
-
ఒంగోలులో కొనసాగుతున్న ఆందోళనలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో సమైక్యవాదుల నిరసనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర సమైక్యత కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. రోజుకో తరహా నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా నగరంలో సమైక్యవాదుల నిరసనలు జోరుగా సాగాయి. నిరసన ర్యాలీ రాష్ట్ర విభజనను నిరసిస్తూ హౌసింగ్‌బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలు వినూత్న నిరసనకు దిగారు. కాలనీ నుంచి చర్చి సెంటర్ వరకు కే సీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. కేసీఆర్ దిష్టిబొమ్మను టమోటాలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పోరాడుతున్నారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలుగు మాట్లాడేవారందరినీ ఒకే రాష్ట్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయని, తాగునీటికి, సాగునీటికి యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంద న్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఈదర వెంకట సురేశ్‌బాబు, కార్యదర్శి రావూరి లక్ష్మయ్య, కోశాధికారి టీవీ శేషయ్య, యన్జీఓ నాయకులు ఖాశిం, టి.కరుణాకర్, రాజేశ్, ఓలేటి ప్రసాద్, దండే కృష్ణారావు, తిరుపాలయ్య, కృష్ణారావు, సత్యసాయి, అరుణ, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, రామకృష్ణ, జైపాల్, ఉదయ్, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. వాటర్ ట్యాంకర్లతో.. ఉద్యమంలో అగ్రభాగాన ఉంటూ రోజుకో వినూత్న నిరసనతో ఆందోళన తెలుపుతున్న కార్పొరేషన్ ఉద్యోగులు తమ నిరసనల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నగరంలోని కాలనీలకు మంచినీటిని సరఫరా చేసే ట్యాంకర్లతో నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. స్థానిక కాార్పొరేషన్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో మానవహారంగా ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని, లేదంటూ తగిన బుద్ధి చెప్తామని ఉద్యోగులు హెచ్చరించారు. న్యాయవాదుల ఆందోళన రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 50వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం 50 మంది న్యాయవాదులు రిలే దీక్షలకు కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం 57 రోజులుగా పోరాడుతున్న ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కేంద్రం దిగిరాకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. రోడ్లు ఊడ్చిన పీఆర్ ఉద్యోగులు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ స్థానిక పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో కార్మికుల వేషధారణలతో రోడ్లు ఊడ్చారు. కడుపులు మాడ్చుకొని ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగుల, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల ైబె కు ర్యాలీ సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టి కర్నూల్ రోడ్, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్, మార్కెట్ సెంటర్, ట్రంకురోడ్ మీదుగా చర్చి సెంటర్, ప్రకాశం భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. రాష్ట్ర సమైక్యత కోసం ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్‌లో పదవులే లేకండా పోతాయని హెచ్చరించారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కేఎల్ నర సింహారావు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు అప్పు తిప్పలు
ఇంకొల్లు, న్యూస్‌లైన్: ఖరీఫ్ ముగిసి రబీ సీజన్ వస్తున్నా.. జిల్లాలో కౌలు రైతులకు బ్యాంకులు రుణాలివ్వక వారి పరిస్థితి దయనీయంగా మారింది. బయట అప్పులు పుట్టక కౌలు రైతులు పంటల పెట్టుబడుల కోసం అల్లాడుతున్నారు. అధిక వడ్డీలకు తెచ్చయినా పంటలు కాపాడుకునేందుకు రుణ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కౌలు రైతులకు గుర్తింపుకార్డులిచ్చే దిక్కులేదు. బ్యాంకర్లు మాత్రం కార్డులు లేనిదే రుణాలివ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. జిల్లాలో 1.50 లక్షల మందికిపైగా కౌలు రైతులున్నారు. వారు 3 లక్షల ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. ఈ ఖరీఫ్‌లో లక్ష ఎకరాలకు పైగా పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తుండటంతో పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. పైర్లను కాపాడుకునేందుకు ఎరువులు కొనేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో అప్పు తీసుకొని చెల్లించిన కౌలు రైతులకు కూడా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపుకార్డులివ్వాలని, గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన వారికి కార్డులతో నిమిత్తం లేకుండా రుణాలివ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11న జిల్లా కేంద్రంలో ధర్నా చేసి సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 12వ తేదీన బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కౌలు రైతుల సంఘ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గతంలో అప్పు తీసుకొని తిరిగి చెల్లించిన కౌలు రైతులందరికీ కార్డులతో నిమిత్తం లేకుండా వెంటనే రుణాలు చెల్లించాలని బ్యాంకర్లను ఆదేశించారు. అయినా బ్యాంకర్లు వ్యవసాయాధికారుల, వీఆర్వోల సంతకాలు కావాలని కౌలు రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల సంఘం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోంది. గురువారం జే పంగులూరులో జిల్లా సదస్సు నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తమవుతోంది. పాత రుణాలు చెల్లించాం: నల్లపు రంగారావు, కౌలు రైతు, ఇంకొల్లు మూడేళ్లుగా 2 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. పత్తి ఎకరం, మిర్చి ఒక ఎకరం వేశాను. గత ఏడాది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 30 వేలు రుణం తీసుకున్నాను. పంట చేతికి రాగానే రుణం తిరిగి చెల్లించాం. ఈ ఏడాది ఇంకా రుణాలివ్వలేదు. అధికారుల సంతకాలపేరిట బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 50 వేలు వరకు పెట్టుబడి పెట్టాను. బలం మందులు వేయాల్సి ఉంది. తక్షణం రూ. 50 వేలు వరకు అవసమమవుతాయి. అప్పుల కోసం ఎదురు చూస్తున్నాం : గట్టుపల్లి యహోషువా, కౌలు రైతు ఇంకొల్లు అప్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఈ ఏడాది ఒక ఎకరం పత్తి, ఒకటిన్నర ఎకరా మొక్కజొన్న, రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాను. ఇప్పటికి పెట్టుబడి రూ. 1.5 లక్షలు పెట్టాను. గత ఏడాది బ్యాంకు రుణం రూ. 30 వేలు తీసుకున్నాను. తిరిగి చెల్లించాం. కానీ ఇప్పుడు కౌలు రుణాలు ఇవ్వలేదు. సమ్మె మాపాలిట శాపంగా మారింది: బేతాల ఆనందరావు, కౌలురైతు ఇంకొల్లు ఉద్యోగుల సమ్మె మాపాలిట శాపంగా మారింది. సమ్మె కారణంగా రుణాలు సకాలంలో పొందలేక పోతున్నాం. ఈ ఏడాది 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. 5 ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో మిర్చి వేశాను. ఇప్పటి వరకు ఖర్చు రూ. 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. గత ఏడాది రూ. 30 కౌలు రుణం తీసుకుని తిరిగి చెల్లించా. కానీ ఈ ఏడాది ఇప్పటికీ ఇవ్వలేదు. రుణాల కోసం ఎదురు చూస్తున్నాం. అధికారులు స్పందించి రుణాలిచ్చి ఆదుకోవాలి.