breaking news
sadistu
-
చీరాల్లో మహిళ దారుణ హత్య
గొడ్డలితో నరికి చంపిన శాడిస్టు పరారీలో నిందితుడు చీరాల: పిండి రుబ్బుకుంటున్న మహిళను పక్కింటిలో నివాసముండే ఓ యువకుడు గొడ్డలితో విచక్షణా రహితంగా తలపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన చీరాల వడ్డె నాగేశ్వరరావు బజారులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, మృతురాలి తల్లి తెలిపిన వివరాల మేరకు...వడ్డె నాగేశ్వరరావు బజారులో చిచ్చుల మల్లిక (33) స్థానిక ఒక షేర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. సోమవారం పని ముగించుకుని ఇంటికి చేరింది. ఉదయం రోడ్డుపై ఉన్న రోలు వద్ద పిండి రుబ్బుతుండగా పక్కింటిలో నివాసముండే కన్నంరెడ్డి వెంకటేశ్వర్లు అలియాస్ చిన్నా అనే యువకుడు గొడ్డలితో ఆమె తలపై నరకడంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందింది. హత్య చేసిన వెంటనే నిందితుడు గొడ్డలి అక్కడే వదిలి పరారయ్యాడు. చిన్నా కొంతకాలంగా శాడిస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న మహిళలతో ఘర్షణలకు దిగి దాడులకు పాల్పడడం చివ రకు తల్లిదండ్రులను కూడా వేధించడంతో వాళ్లు సైతం ఇల్లు వదిలి మరోచోటకు వెళ్లారు. ఒంటరిగా ఉండే చిన్న..మృతురాలు మల్లికతో కూడా పలుమార్లు ఘర్షణకు దిగాడు. తమ స్థలంలోకి గేదెలు వె ళ్తున్నాయంటూ కొద్ది రోజులు క్రితం ఘర్షణ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తరచూ మల్లికను చంపుతానని బెదిరించడంతో మల్లిక తల్లి, ఆమె బంధువులు నిందితుడి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు కూడా చెప్పారు. వాళ్లు మందలించినా ఫలితం లేదు. నిందితుడు మల్లికకు సమీప బంధువు. తమ్ముడి వరుస అవుతాడు. మృతురాలు పదేళ్ల నుంచి భర్తతో విభేదాలు వచ్చి తన కూతురితో కలసి తల్లి వద్దే ఉంటూ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. హత్య వార్త తెలుసుకున్న డీఎస్పీ జయరామరాజు టూ టౌన్ సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సై రామానాయక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయరామరాజు మీడియాతో మాట్లాడుతూ ఒంటరిగా ఉంటున్న మహిళను దారుణంగా హతమార్చిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. -
గత చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి..?
నా వయసు 33. పదేళ్ల క్రితం నాకు పెళ్లయింది. నా భర్త చాలా క్రూరుడు, శాడిస్టు. అనుమానం మనిషి. ఆయన పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక మా పుట్టింటికి చేరాను. అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ నా కాళ్లమీద నేను నిలబడ్డాక మళ్లీ పెళ్లి చేసుకున్నాను. ఈయన చాలా మంచివారు. ఇప్పుడు నాకు నాలుగేళ్ల బాబు. జీవితం హాయిగా గడిచిపోతోంది అనుకుంటుంటే... నన్ను గత జీవితం తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. సరిగా నిద్రపట్టదు... ఎలాగో నిద్రపోతే పీడకలలు రావటం, సడన్‌గా మూడ్స్ మారటం, అందరినీ విసుక్కోవడం... ఇంట్లోవాళ్లు చాలా బాధపడుతున్నారు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, విశాఖపట్నం శాడిస్టు అయిన భర్తతో దుర్భరజీవితాన్ని అనుభవించారు. ఎలాగో తప్పించుకుని మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని అనుభవిద్దామనుకునేంతలో మిమ్మల్ని గత ం తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడటం బాధాకరం. ప్రస్తుతం మీరనుభవించే స్థితిని పీటీఎస్డీ లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఈ వ్యాధి ... దాని పేరుకు తగ్గట్టుగానే, మెదడుపొరల్లో నిక్షిప్తమై ఉన్న గతం మిమ్మల్ని వెంటాడుతూ ఉండటం వల్ల మీరు ప్రస్తుతం ఎంతటి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం మీమీద పడి మీ మూడ్స్ మారిపోతుంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీని ప్రభావం మీ దైనందిన జీవితంపై పడి ప్రస్తుత జీవితం భారంగా అనిపిస్తుంది. అయితే మీ గతం ఎంత విషాదకరమైనదైనప్పటికీ అది గడిచిపోయింది, తిరిగి మీరు మంచి జీవితాన్ని గడపగలుగుతున్నారు కాబట్టి, దానిని మరచిపోయేందుకు గట్టిప్రయత్నం చేయండి. అది గతమే కదా, తిరిగి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను కదా అన్న భావనతో మీ మెదడుకు మీరు సజెషన్స్ ఇచ్చుకోండి. అందులో భాగంగా మీ గతాన్నంతటినీ పేపర్ మీద రాసి, దాన్ని ఒకసారి చదువుకుని, కాల్చేయండి. దీనివల్ల కొంత మెరుగైన ఫలితం కలుగుతుంది. అయితే మీరు గతం తాలూకు పీడకలలతో సరిగా నిద్రపోలేకపోతున్నానంటున్నారు కాబట్టి అయితే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే మాత్రం సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, మీ పరిస్థితినంతటినీ వివరించండి. అవసరాన్ని బట్టి మందులు కూడా వాడవలసి ఉంటుంది. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్ ద్వారా, మందుల ద్వారా మీలోని మానసిక ఒత్తిడిని, టెన్షన్‌ను తగ్గించి, వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిస్తూ, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగేలా చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం కలిగిస్తూ, మందులద్వారా హాయిగా నిద్రపట్టేలా చేస్తారు. మీరు క్రమేణా మామూలు స్థితికి వస్తారు. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్