breaking news
Rural poverty reduction
-
గ్రామీణ జీవనోపాధిం రయ్.. రయ్
రాష్ట్రంలో గత ఆర్థిక ఏడాది (2023–24)లో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగు పడింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం భారీగా తగ్గింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ప్రజల పొదుపు సైతం ఎక్కువగానే ఉంది. ఈ ప్రగతి సాధనలో నాటి ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలు కీలక పాత్ర పోషించాయి. – ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సాక్షి, అమరావతి: గత∙ఆర్థిక ఏడాదిలో మన రాష్ట్రంలో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగుపడటంతోపాటు జాతీయ స్థాయిని మించి ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంతో పాటు దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం తగ్గిందని చెప్పింది. ఇందుకు ఆయా ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలకు నగదు బదిలీ ద్వారా పథకాలను అమలు చేయడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగు పరచడమే కారణమని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రైతుల ఆదాయం పెరిగిందని తెలిపింది.దీంతో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగు పడినట్లు నివేదిక పేర్కొంది. మధ్య ఆదాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2011–12లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 53 శాతం ఉండగా, 2022–23లో 39 శాతానికి తగ్గిందని, 2023–24లో 35 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. దేశంలో కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం భారీగా తగ్గిందని తెలిపింది. 2009–10లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగం వ్యయంలో అంతరం 88.2 శాతం ఉండగా, 2023–2024లో 69.7 శాతానికి తగ్గిందని పేర్కొంది.2022–23తో పోల్చితే 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం పెరుగుదలలో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపింది. పట్టణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం కన్నా, గ్రామీణ తలసరి వినియోగం వ్యయం పెరుగుదల ఏపీలో ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. జాతీయ స్థాయిలో పొదుపు 31 శాతం ఉంటే, రాష్ట్రంలో 34 శాతం ఉందని వెల్లడించింది. దేశంలో 2022–23లో గ్రామీణ పేదరికం 7.20 శాతం ఉండగా, 2023–24లో 4.86 శాతానికి తగ్గిందని తెలిపింది. పట్టణాల్లో 2022–23లో 4.60 శాతం పేదరికం ఉండగా, 2023–24లో 4.09 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. -
రూ. 7,457 కోట్లతో ‘పేదరిక నిర్మూలన’!
బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన సెర్ప్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం లో రూ.7,457 కోట్లు అవసరమవుతాయని సర్కారు అంచనా వేసింది. 2017–18 బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు కసరత్తు చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా బడ్జెట్ అంచనాలను ప్రభుత్వానికి అందజేసింది.ఇందులో సింహభాగం ఆసరా పింఛన్లకే పోతుండటంతో ఇతర కార్యక్రమా ల అమలుపై ప్రభావం పడుతుందని కొంద రు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా 36లక్షల మంది ఆసరా లబ్ధిదారుల పింఛన్ల కోసం ఏటా రూ.4,787 కోట్లు అవసరమని సెర్ప్ పేర్కొంది. తాజాగా ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి అందించాలని నిర్ణయించడంతో, సుమారు 2లక్షల మందికి రూ.247కోట్లు అవసరమని అంచ నా వేసింది.మొత్తం రూ.5,034 కోట్లు ఆసరా పింఛన్ల కింద ప్రభుత్వం ఖర్చు చేయాలని భావిస్తోంది. సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్రం నుంచి రూ.209.58కోట్లు వస్తాయని అధికారులు అంచానా వేశారు. గత రెండున్నరేళ్లుగా వడ్డీలేని రుణాలు తీసుకొని తిరిగి చెల్లించిన స్వయంసహాయక సంఘాల మహిళలకు వడ్డీల బకాయిలతో కలిపి మొత్తం రూ.663.51 కోట్లు అవసరమవుతాయని అంచనా. పట్టాలెక్కనున్న ‘పల్లె ప్రగతి’! రాష్ట్రంలోని 150 వెనుకబడ్డ మండలాల్లో పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.642 కోట్లతో ప్రారంభించిన తెలంగాణకు పల్లె ప్రగతి పథకానికి గతేడాది రూ.40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించినా.. సర్కారు నిధులివ్వలేదు. దీంతో ప్రపంచ బ్యాంకూ నిధులివ్వలేదు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా పేద మహిళలకు రుణాలందించేందుకు గతేడాది కన్నా ఈ సారి ఎక్కువ మొత్తంలో నిధులివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తాజా ప్రతిపాదనలలోరూ.274 కోట్లు ఇవ్వాలని పేర్కొనడం స్త్రీ బ్యాంకు సిబ్బందికి ఊరటనిచ్చే అంశం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం గమనార్హం. అభయహస్తం పథకం కోసం తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.399.33 కోట్లు ఇవ్వాలని భావిస్తోంది.