breaking news
Rural areas Teenagers
-
డ్రైవింగ్ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి: ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం 8వ తరగతి వరకు చదివుండాలనే నిబంధన ఉంది. దీనివల్ల డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యం ఉండి చదువు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్లు లైసెన్స్ తీసుకోవాలంటే కుదిరేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. అలాంటివారి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి చదువుకోకపోయినా లైసెన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికోసం అడ్డుగా ఉన్న మోటార్ వెహికల్ చట్టం 1989లోని 8వ నిబంధనను తొలగించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు, రవాణా రంగం ఎదుర్కొంటున్న డ్రైవర్ల సమస్య కూడా తీరనుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న రవాణా, లాజిస్టిక్ రంగాల్లో దాదాపు 22 లక్షల డ్రైవర్ల అవసరం ఉందని అంచనా. ఈ విషయం గురించి కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువతకు డ్రైవింగ్‌లో నైపుణ్యంతో పాటు అనుభవం ఉన్నాకూడా చదువులేదనే నిబంధనతో లైసెన్స్‌కి అనర్హులయ్యేవారు. వారు చదువుకోకపోయినా నిరక్షరాస్యులు మాత్రం కారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడినవారు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత లబ్దిపొందుతారు. ఇదే సమయంలో రోడ్డు భద్రత, ప్రమాణాలు కూడా ముఖ్యమే. అందుకోసం లైసెన్స్ ఇచ్చే ముందు వారికి కఠిన పరీక్ష నిర్వహిస్తారు. నెగ్గితేనే లైసెన్స్ జారీ చేస్తారు. తర్వాత వారికి రహదారి భద్రత గురించి అవగాహనతో పాటు కొంత శిక్షణనిస్తారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తుందని ఆ అధికారి తెలిపారు. -
వాలీబాల్ ఆడేద్దాం రండి..!
శ్రీకాకుళం న్యూకాలనీ: మన దేశంలో ఎక్కువ మంది ఆడే క్రీడల్లో వాలీబాల్ ఒకటి. రాష్ట్రంతో పాటు మన జిల్లాలో వాలీబాల్కున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే క్రికెట్ కంటే వాలీబాల్‌కే యువత అధిక ప్రాధాన్యమిస్తారు. వాలీబాల్‌తో శరీరదారుఢ్యం సిద్ధిస్తుంది. ఆట ఉత్సాహభరితంగా ఉంటుంది. 12 మంది క్రీడాకారులు ఉంటే సరిపోతుంది. గ్రామీణ ప్రాంత యువకులు ప్రతిరోజు సాయంత్రం వాలీబాల్ ఆడుతూనే ఉంటారు. వాలీబాల్‌తో ఉపయోగాలు... * శారీరక వ్యాయామం లభిస్తుంది. * శారీరక కండరాలు పఠుత్వంతోపాటు పొడవు పెరిగేందుకు చక్కటి మార్గం. * కాళ్లు, చేతులు దృఢంగా తయారవుతాయి. * మానసిక ప్రశాంతత లభిస్తుంది. * పోటీతత్వం అలవడుతుంది. జిల్లాపై ఓ లుక్కేద్దాం... జిల్లాలో గత 30 ఏళ్ల కిందటే వాలీబాల్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో వాలీబాల్ క్రీడకు గుర్తింపు తీసుకొచ్చింది టి.రామజోగినాయుడు, ధర్మాన కృష్ణదాస్, పి.సుందరరావు తదితరులు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించి పతకాల పంట పండించారు. వాలీబాల్ క్రీడా సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, వర్సిటీల్లో పలు కోర్సుల్లో సీట్లు సాధించిన వారు ఉన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా జిల్లాలో వాలీబాల్ క్రీడకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం పది కేంద్రాలకు తక్కువ కాకుండా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. వాలీబాల్‌కు క్రేజీ జిల్లాలో వాలీబాల్‌కు ఉన్న క్రేజీ మరే క్రీడకు లేదు. యుక్తవయసు వారి నుంచి వెటరన్ వరకు అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాలీబాల్ ఆడితే ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెరుగుపడుతుంది. - వై.పోలినాయుడు, జిల్లా వాలీబాల్ సంఘ ప్రతినిధి, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు