breaking news
RTC bus passes
-
బస్‌పాస్‌లపై బాదేశారు!
సాక్షి, హైదరబాద్: ఆర్టీసీ బస్‌పాస్ ధరలను భారీగా పెంచేసింది. ఈ పెంపు గ్రేటర్‌లోని సుమారు 2.5 లక్షల మందిపై పిడుగుపాటుగా మారింది. అకస్మాత్తుగా చార్జీలను 20 శాతం పెంచడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆరీ్టసీలో నగదు నిల్వలు దారుణంగా పడిపోవడంతో బస్సుల నిర్వహణ, విడిభాగాల కొనుగోళ్లు, డిపోల రోజువారీ ఖర్చులు తదితర అవసరాలకు కష్టంగా మారింది. ఈ క్రమంలో ఒకవైపు పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్న ఆర్టీసీ అధికారులు.. తాజాగా బస్‌పాస్‌లపై దృష్టి సారించారు. ప్రతి నెలా బస్‌పాస్ చార్జీల రూపంలో నగదు ఆదాయం లభించనున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బస్‌పాస్ చార్జీల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త చార్జీలు ఇలా.. సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వినియోగించే ఆర్డినరీ నెలవారీ పాస్ రూ.1,150 నుంచి రూ.1,400కు పెరిగింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,300 నుంచి రూ.1,600కు చేరింది. మెట్రోడీలక్స్ రూ.1,450 నుంచి రూ.1,800. మెట్రో లగ్జరీ (ఏసీ) రూ.1,800 నుంచి రూ.2,200. విద్యార్ధుల నెలవారీ ఆర్డినరీ పాస్ రూ.400 నుంచి రూ.600కు పెరిగింది. క్వార్టర్లీ (మూడు నెలలు) పాస్ రూ.1,200 నుంచి రూ.1,800. గ్రేటర్ హైదరాబాద్ ఆర్డినరీ రూ.470 నుంచి రూ.705కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ క్వార్టర్లీ పాస్ రూ.1,350 నుంచి రూ.1,950కి చేరింది. ఆర్డినరీ స్పెషల్ పాస్ రూ.450 నుంచి రూ.650. ఎన్జీఓల నెలవారీ ఆర్డినరీ బస్‌పాస్ రూ.400 నుంచి రూ.600, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.550 నుంచి రూ.800, మెట్రో డీలక్స్ పాస్ రూ.700 నుంచి రూ.1000కి పెంచారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నడిచే పుష్పక్ ఏసీ బస్సుల పాస్ ధర రూ.5000 ఉంది. ఆర్టీసీ అధికారులు ప్రస్తుతానికి పుష్పక్ పాస్ జోలికి వెళ్లలేదు. -
విద్యార్థులకు ఏపీ సర్కారు తీపి కబురు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న 35 కిలోమీటర్ల పరిమితిని 50 కిలో మీటర్లకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 35 కిలోమీటర్ల పరిధితో రాష్ట్రంలోని విద్యార్థులు ఇప్పటివరకు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటోంది. ఈ కారణంగా రాయితీ బస్ పాస్‌లకు అర్హత కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో 660 విద్యాసంస్థలు 35 కిలోమీటర్ల కంటే అధిక దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధి 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. దీని కారణంగా ప్రభుత్వంపై ఏడాదికి 18.50 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఆర్టీసీ అందించే అన్ని రకాల బస్ పాస్‌లకు ప్రభుత్వం సంస్థకు వంద శాతం నిధుల్ని రీయింబర్స్ చేస్తుంది. ఈ బస్ పాస్‌లకుగాను ఏటా రూ.290 కోట్ల మేర ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. -
విద్యార్థులకు ఆర్టీసీ నజరానా
సాక్షి, రామచంద్రపురం(తూర్పు గోదావరి) : ఆర్టీసీ బస్సుల్లో విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ చిరు కానుకగా ఏడాది బస్‌పాస్‌లను అందిస్తోంది. గతంలో విద్యార్థులు ప్రతినెలా బస్‌పాస్‌ల కోసం గంటల కొద్దీ క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చేది. గత ఏడాది నుంచి ఏడాది మొత్తానికీ ఒక్కసారే బస్‌పాస్‌ను తీసుకునే వెసులుబాటు ఆర్టీసీ కల్పించింది. ఏపీఎస్ ఆర్టీసీలో విద్యార్థులకు అందించే ఉచిత పాస్‌లతో పాటు రాయితీ పాస్‌లు ఎలా పొందాలో రామచంద్రపురం ఆర్టీసీ డిపో మేనేజర్ కొడమంచిలి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలియజేశారు. ఏడో తరగతి వరకు బాలురకు ఉచితం ఏడో తరగతి చదువు, 12 ఏళ్ల వయస్సు ఉన్న బాలురకు 20 కిలో మీటర్ల దూరం వరకు ఇంటి నుంచి పాఠశాలకు ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తారు. ఆర్టీసీ డిపోల్లోని ప్రత్యేక కౌంటర్లలో లేదా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి బస్‌పాస్ తీసుకోవచ్చు. రూ. 50 చెల్లించి ఈ పాస్ పొందవచ్చు. దాతల సహకారంతో కూడా ఈ ఉచిత బస్‌పాస్ పొందవచ్చు. 18 ఏళ్ల బాలికలకు ఉచితం ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ 18 ఏళ్ల లోపు బాలికలు ఉచిత బస్‌పాస్‌లు పొందవచ్చు. 20 కిలోమీటర్ల వరకు ఇంటి నుంచి పాఠశాలకు ఈ బస్‌పాస్‌లను ఉపయోగించుకోవచ్చు. రాయితీ బస్‌పాస్ పొందడం ఇలా బాలురు ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు రాయితీ బస్‌పాస్‌లు పొందవచ్చు. 35 కి.మీ. వరకు ఇంటి నుంచి పాఠశాల, కళాశాల వరకు ఈ రాయితీ బస్‌పాస్‌లు ఉపయోగించుకోవచ్చు. గతంలో నెలకు ఇచ్చే పాస్‌లు ఇప్పుడు మూడు నెలలు, ఏడాది గడువుతో ఇస్తున్నారు. పదో తరగతి వరకు మూడు నెలలు 5 కిలో మీటర్ల వరకు రూ. 235, ఏడాదికి ఒక్కసారే తీసుకుంటే రూ. 850 చెల్లించాలి. ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులు మూడు నెలలకు ఒకసారి పాస్ తీసుకుంటే రూ. 935, డిగ్రీ అయితే రూ. 1020 చెల్లించాలి. 10 కిలోమీటర్ల వరకు 10 వ తరగతి వరకు మూడు నెలలలకు రూ.315, ఏడాదికి తీసుకుంటే రూ. 1050 చెల్లించాలి. ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులు మూడు నెలలకు పాస్‌కు రూ. 1155, డిగ్రీ అయితే రూ. 1260 చెల్లించాలి. 15 కిలోమీటర్లకు 10వ తరగతికి రూ. 385, ఇంటర్‌కు రూ.1350, డిగ్రీకి రూ.1415, 20 కిలోమీటర్లకు మూడు నెలలకు రూ.510, సంవత్సరానికి రూ.1,800, 25 కిలోమీటర్లకు రూ.645, ఏడాదికి రూ. 2250, 30 కిలోమీటర్లకు మూడు నెలలకు రూ. 705, ఏడాదికి రూ. 2500, 35 కిలోమీటర్లకు రూ. 775 వంతున చెల్లించి రాయితీపై బస్‌పాస్‌ను పొందవచ్చు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లకు మూడు నెలలకోసారి, ఏడాది పాస్‌లు తీసుకుంటే రూ. 1155 నుంచి రూ. 3240 వరకు ఉంటుంది. ఆన్లైన్లో పొందడమెలా..? విద్యార్థులు కళాశాల ధ్రువీకరణ పత్రంతో ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లలో బస్‌పాస్ పొందవచ్చు.online. apsrtcpass. in వెబ్సైట్లోకి వెళ్లి పదో తరగతి పైబడిన విద్యార్థులు తమ తరగతిని క్లిక్ చేయాలి. గత ఏడాది బస్‌పాస్ నెంబరు ఉంటే నమోదు చేయాలి. లేదా కొత్త రిజిస్ట్రేషన్ ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. వివరాలు నమోదైన వెంటనే దరఖాస్తుదారు పేరు, చిరునామా, పాఠశాల, కళాశాల, ఆధార్ సంఖ్యలను నమోదు చేయాలి. ఫొటో అప్లోడ్ చేసి విద్యార్థి పయనించే రూట్ వివరాలు నమోదు చేయాలి. ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని కళాశాల ప్రిన్సిపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంతకం చేసి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో కౌంటర్లో రుసుం చెల్లించి బస్‌పాస్ పొందవచ్చు. విద్యార్థుల కోసం ఆయా డిపోలు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నా యి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కొడమంచిలి వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగులకు రాయితీ బస్‌పాస్‌లు దివ్యాంగులు బస్ చార్జీలో 50 శాతం రాయితీతో ప్రయాణించేలా ఆర్టీసీ బస్‌పాస్‌లను మంజూరు చేస్తోంది. దీనికోసం దివ్యాంగులు ఎస్కార్ట్ అవసరం లేనివారు రూ. 50 తోను, ఎస్కార్ట్ అవసరం ఉన్నవారు రూ. 100 తోను బస్‌పాస్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సదరన్ మెడికల్ సర్టిఫికెట్లు (పెద్దది, చిన్నది) ఒక సెట్, ఆధార్ కార్డు జెరాక్స్‌లతో పాటు ఒక ఫొటో తీసుకువచ్చి బస్‌పాస్ కౌంటర్ల వద్ద ఈ రాయితీ పాస్‌లు తీసుకోవచ్చు. నియోజకవర్గంలోని దివ్యాంగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. – కొడమంచిలి వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్, రామచంద్రపురం ఆర్టీసీ డిపో -
బస్ పాసుల జారీ ఇక ఆన్లైన్లోనే...
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు బస్సుపాసులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని డిపో మేనేజర్ హేమంత్‌రావు తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సిటీ జనరల్, సిటీ స్పెషల్, గ్రేటర్ హైదరాబాద్ పాసులు ఆన్లైన్ ద్వారా జారీ చేయనున్నట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్, రూట్ పాసులను కూడాఆన్లైన్లోనే జారీకి నూతన సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లో డిస్ట్రిక్, రూట్ పాసులు కూడా ఆన్లైన్ ద్వారా అందజేస్తామన్నారు. విద్యార్థులు సహకరించాలని సూచించారు.