క్రమబద్ధీకరణతో ఆదాయం రూ.10 కోట్లపైనే
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ర్ట ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మున్సిపాల్టీలు, పట్టణ ప్రాంతాల్లోని అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని మున్సిపాలిటీలు, ఒంగోలు కార్పొరేషన్‌కు మొత్తం మీద పది కోట్ల రూపాయలకుపైగానే ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఒక్క ఒంగోలు కార్పొరేషన్‌కే 5.9 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 2008లో బీపీఎస్‌కు అనుమతి ఇచ్చినపుడు మొత్తం 1041 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 894 మందికి క్రమబద్ధీకరణకాగా మిగిలిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తిపన్ను పెంచేశారు. ఇప్పుడు వీరు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లేఅవుట్లు కూడా 15 వరకూ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
లేఅవుట్ వేసిన వారు అమ్మేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కొనుక్కున్న వారు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అంచనాకన్నా ఎక్కువ ఆదాయమే వస్తుందని భావిస్తున్నారు. మార్కాపురం పురపాలక సంఘంలో మొత్తం 324 మంది గతంలో తమ భవనాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 62మంది తమక్రమబద్ధీకరించుకున్నారు. మిగిలిన 262 మంది దరఖాస్తులను తిరస్కరించారు. పురపాలక సంఘానికి రూ.36.82 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తే కోటి రూపాయలకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. చీరాలలో 2008 సంవత్సరం వరకూ 914 భవనాలు క్రమబద్ధీకరించుకోగా కోటీ 90 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది.
ఇప్పుడు 166 భవనాలు లైన్లో ఉన్నాయని సుమారు రూ.60 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కందుకూరులో 125 వరకూ ఉండగా రూ.40 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. కొత్తగా నగర పంచాయితీలుగా ఏర్పడిన అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, సింగరాయకొండల్లో కూడా కాసుల వర్షం కురిస్తుంది. దీనివల్ల వీటికి కూడా అర్ధికంగా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. 2014 డిసెంబర్ 31నాటికి కార్పొరేషన్ వద్దరిజిస్టరైన భవనాలకే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తానికి ఈ పథకం పునరుద్ధరణతో రియల్టర్ల వల్ల మోసపోయిన సామాన్య ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అపార్టుమెంట్లలో ప్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటన్నింటినీ క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. అనధికారిక లే అవుట్లలో నిర్మించిన భవనాలకు ఈ పథకం వర్తించదు.