సీఎస్ పదవీకాలం పొడిగింపు
ఆమోదించిన డీవోపీటీ.. నేడో రేపో ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ పదవీ కాలాన్ని 3 నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) అనుమతించింది. ఈ ఫైలుపై కేంద్రం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. దీనిపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. సర్వీసు ప్రకారం మే 31న రాజీవ్ శర్మ రిటైర్ కావాల్సి ఉంది. తాజాగా డీవోపీటీ ఇచ్చిన అనుమతితో ఆయన పదవీకాలం ఆగస్టు 31 వరకు పొడిగించినట్లయింది.
రాజీవ్‌శర్మ పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాలని ఫిబ్రవరిలోనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారుల కొరతతో పరిపాలనా ఇబ్బందులున్నాయని, అందుకే సీఎస్ పదవీకాలాన్ని పెంచాలని సీఎం కోరారు. సీఎం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న డీవోపీటీ, సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామంతో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు లైన్ క్లియర్ కానుంది. కొందరు సీనియర్ అధికారులకు పోస్టింగ్‌లు మార్చడంతో పాటు పలు శాఖల అధికారులకు స్థాన చలనం కల్పించాలని గత నెలలోనే సీఎం కసరత్తు చేశారు. కానీ సీఎస్ పదవీకాలంపై కొనసాగిన సందిగ్ధతతో బదిలీలను పెండింగ్‌లో పెట్టారు.