breaking news
Religious organization
-
మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. యమగామీకి తొలుత టార్గెట్‌గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం. అలసిపోయా.. రాజీనామా చేస్తా ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్‌లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. జపాన్ ప్రజల కన్నీటి నివాళులు షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్ శనివారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు. మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
జియో.. పార్శీ!
ఒక్కర్ని కంటే రూ.ఐదు వేలు.. ఇద్దర్ని కంటే రూ.10 వేలు.. ముగ్గుర్ని కంటే రూ.20 వేలు.. ఒకవైపు దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ బలంగా అమలవుతుండగా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రోత్సహిస్తూ నజరానాలు ప్రకటించడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! నిజమే హైదరాబాద్‌లోని ఒక ధార్మిక సంస్థ ఈ బహుమతులను అందజేస్తోంది. ఇరాన్లో పుట్టి శాఖోపశాఖలుగా విస్తరించిన పార్శీలు ఒకప్పుడు బలమైన ప్రభావిత సమూహం. ఇప్పుడు అత్యంత క్షీణదశను అనుభవిస్తోన్న పార్శీ సమాజం తన అస్తిత్వాన్ని, మనుగడను కాపాడుకొనేందుకు చేస్తోన్న ప్రయత్నం ఇది. వైవిధ్యం నిజాం జమానా నుంచే భాగ్యనగర సంస్కృతిలో భాగమైన పార్శీ జాతి ప్రమాదంలో పడింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్శీ జనాభా క్రమంగా క్షీణిస్తోంది. అది హైదరాబాద్‌లో మరింత ఆందోళనకరంగా ఉంది. నిజాం పాలనలో తమ మేధోసంపత్తితో కీలక పదవులు అలంకరించిన పార్శీలు ఇప్పుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఒకప్పుడు భాగ్యనగరంలో వేల సంఖ్యలో ఉన్న వీరి జనాభా ఇప్పుడు పదకొండు వందలకు పడిపోయింది. తమ జాతిని పునరుజ్జీవింపజేసేందుకు పార్శీ మత సంస్థలు, ధార్మిక సంస్థలు, పెద్దలు నడుం బిగించార ఈ తరం దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. సంతానోత్పత్తికి నోచని దంపతులకు వైద్య సహాయాన్ని అందజేస్తున్నారు. ప్రోత్సాహకాలు.. అంజుమన్ సంస్థ మొదటి సంతానానికి రూ.5,001, రెండో సంతానానికి రూ.10,001, మూడో సంతానానికి రూ.20,001 చొప్పున ఆర్ధిక ప్రోత్సాహకాలను అందజేస్తోంది. మిరాసన్ ట్రస్టు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అందజేస్తోంది. కానీ ఈ రెండు సంస్థలు కలసి ఆరేళ్లలో 25 జంటలకు మాత్రమే ఇలాంటి సహాయాన్ని అందజేశాయి. అలాగే బాంబే పార్శీ పంచాయత్, కేంద్రప్రభుత్వ ‘జియో పార్శీ’ పథకం కింద లబ్ధ్ది పొందుతున్న వాళ్లూ తక్కువ మందే ఉన్నారు. చాలా మంది ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు. ఇద్దర్ని కనేవాళ్లు చాలా తక్కువ . ఇక హైదరాబాద్‌లో ముగ్గురు పిల్లలను కన్న జంటలు మూడంటే మూడే ఉన్నాయి. పునరపి మరణం.. పార్శీ దంపతులు ఎదుర్కొంటున్న మరో సమస్య సంతానరాహిత్యం. రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్లిళ్లు అబార్షన్లకు దారితీస్తున్నాయి. నగరంలో ఉన్న పార్శీల్లో 55 ఏళ్ల నుంచి 100 ఏళ్లలోపు పెద్దవారు 540 మంది ఉంటే 30 నుంచి 39 ఏళ్లలోపు వాళ్లు కేవలం 182 మంది ఉన్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 11 మంది పిల్లలు మాత్రమే పుట్టారు. కానీ ఇదే సమయంలో 46 మంది వయోధికులు కాలం చేశారు. ఏటా సగటున 18 మంది చనిపోతుంటే ఇద్దరు మాత్రమే జన్మిస్తున్నారు. చారిటబుల్ బ్లాక్... అగ్నిని, నీటిని దైవంగా ఆరాధించే పార్శీ జాతి తనను తాను కాపాడుకొనేందుకు, మతాంతర వివాహాలను నియంత్రించేందుకు ‘చారిటబుల్ బ్లాక్’(మతపరమైన కట్టుబాటు)ను విధించింది. అబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్‌ల లోని విశాలమైన ఫైర్ టెంపుల్స్ ప్రాంగణాల్లోనే పార్శీ కుటుంబాలు సకల సదుపాయాలతో జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. అతి తక్కువ ధరలకే విశాలమైన ఇళ్లను అద్దెకు ఇచ్చారు. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాల్లో, ప్రార్థనల్లో పాల్గొనేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. అయినా నేటి యువత మతపరమైన కట్టుబాట్లను అధిగమించి తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. సద్వినియోగం చేసుకోవాలి పార్శీ జాతి ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దీనిని అధిగమించేందుకే అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు స్వతంత్రంగా ఆలోచించడం, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోరుకోవడం మంచిదే కానీ చారిత్రక బాధ్యతన విస్మరించొద్దు. వాళ్ల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. - ఓమిమ్ మాణిక్ దిబేరా, మెరాసన్ ట్రస్టు వ్యవస్థాపకులు స్వేచ్ఛ ఉండాలి ఇంతగా అభివృద్ధి చెందిన సమాజంలో కట్టుబాట్లలో బతకాలనడం కరెక్ట్ కాదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఎంతమందిని కనాలనేది వారి వ్యక్తిగత విషయం. ఎక్కువ మంది పిల్లల్ని కనడమే జీవితానికి అర్థం అనుకోవడం తప్పు. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలను కంటే వారి ఆలనాపాలన ఎవరు చూసుకుంటారు. అందుకే ఒక్కరు చాలు. - సైరస్, హెచ్ఎస్బీసీ ఉద్యోగి,పగిడిపాల ఆంజనేయులు