కొత్త బాదుడు!
► నూతన మద్యం విధానంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార ధోరణి
► రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో భారీ వడ్డన
► ఏటా అదనపు ఆదాయం ఆర్జనకు పథక రచన
► బెంబేలెత్తుతున్న దరఖాస్తుదారులు
ఒంగోలు క్రైం: నూతన మద్యం విధానం దరఖాస్తుదారులకు బుగ్గగిల్లి జోల పాడినట్లుగా మారింది. ఒక పక్క మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను తగ్గిస్తున్నామని చెబుతూనే భారీ వడ్డనకు రాష్ట్ర ప్రభుత్వం పథక రచన చేసింది. మద్యం విధానంలో వ్యాపార ధోరణినే అవలంభించినట్లయింది. ముందుగా మద్యం షాపుల లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించినట్లు చూపించి, ఇతరత్రా ఫీజుల మోతతో బెంబేలెత్తించే పనిలో పడింది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణానికి దరఖాస్తు చేసి లాటరీ విధానం కోసం గేటుదాటి లోపలకు వెళ్లాలంటే అక్షరాలా రూ.లక్ష కట్టాల్సిందే. నగరం పరిధిలో 30 షాపుల కోసం టెండర్లో పాల్గొనాలంటే రూ.30 లక్షలు సాధారణంగా వస్తాయి. ఒక్కో దుకాణానికి పది చొప్పున దరఖాస్తులు వస్తే 300 దరఖాస్తులు అన్నమాట. అంటే టెండర్ల దశలోనే రూ.3 కోట్లు ప్రభుత్వానికి అదనంగా వస్తున్నట్లు. మున్సిపాలిటీల పరిధిలో రూ.75 వేలు చెల్లించాలి. ఇక నగర పంచాయతీలు, మండలాల్లోని షాపులకు రూ.50 వేలు. ఈ విధంగా లెక్కిస్తూ పోతే గత ఏడాదికంటే మూడు, నాలుగు రెట్లు అధికంగా ఆదాయాన్ని ఒక్క రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారానే ప్రభుత్వం సమకూర్చుకోనుంది. 2015–17 మద్యం విధానంలో 11 వేల దరఖాస్తులు వస్తే దరఖాస్తు ఫీజు ద్వారా రూ.40 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెండేళ్లకు కాకుండా ఏటా రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో గతంలో కంటే మూడు, నాలుగురెట్లు దరఖాస్తుదారుల నుంచి గుంజనున్నారు.
పర్మిట్ రూమ్లు తప్పనిసరి...: గతంలో మద్యం విధానం ప్రారంభించినప్పుడు మాత్రమే దరఖాస్తు ఫీజు కట్టించుకునే వారు. ఆ తర్వాత రెండేళ్లపాటు మద్యం షాపు కొనసాగేది. ప్రస్తుతం కూడా రెండేళ్లపాటు మద్యం విధానం అమలు చేస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిందే. దీంతో పాటు మద్యం షాపులకు పర్మిట్ రూము తప్పనిసరి చేశారు. ప్రతి షాపు ఏడాదికి రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సిందే. జిల్లాలో 331 షాపులకు ఏడాదికి అదనంగా రూ.6.62 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ అదనపు బాదుడుతో ఏడాదికి రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర రిజిస్ట్రేషన్ ఫీజులు, పర్మిట్ రూము ద్వారానే రాబట్టే విధంగా నూతన మద్యం విధానాన్ని రూపొందించారు. ఇక మద్యం విక్రయాలు సరేసరి. జిల్లాలో ప్రతినెలా రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అంటే ఏడాదికి జిల్లాలో రూ.1,100 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల మద్యం విక్రయాలు సర్వసాధారణం..