breaking news
reddys
-
ప్రతిభను ప్రోత్సహించేందుకే రెడ్డీస్ మల్టీప్లెక్స్
‘‘మహిళలకు అవకాశం ఇస్తే ఎంత ఎత్తుకు అయినా ఎదుగుతారు. జగన్‌గారిని సీఎం చేయడం కోసం మహిళలుగా మేమంతా కష్టపడ్డాం. శైలజ డేరింగ్ స్టెప్ వేస్తోంది. ఈ సంస్థ నుంచి మరింత ఎంటర్టైన్మెంట్ రావాలి.. ఇది సక్సెస్ కావాలి’’ అని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె. రోజా అన్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ లోగో, ఈ సంస్థకు చెందిన యూ ట్యూబ్ చానల్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు, యూ ట్యూబ్, రియల్ ఎస్టేట్.. ఇలా అన్నింటినీ ఒక పద్ధతిలో చేస్తున్నారు. యువతరం తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఒక మంచి వేదిక అవుతుంది’’ అన్నారు. రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ చైర్మన్ విజయ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్‌ని ప్రారంభించాం. టాలీవుడ్ అనే చేపల చెరువును ఆన్లైన్ అనే మహాసముద్రం మింగేస్తోంది. రీల్‌పై ఎందరు హీరోలున్నా ప్రజల హృదయాల్లో రియల్ హీరో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిగారే.. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిగారు కూడా ఎన్నో మంచి పనులు చేశారు’’ అన్నారు. ‘‘ఇది కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ’’ అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, రెడ్డీస్ మల్టీప్లెక్స్ చైర్ పర్సన్ శైలజా చరణ్ రెడ్డి అన్నారు. ‘మనస్సాక్షి, వాయిస్ ఆఫ్ ఉమెన్, టుడే పాలిటిక్స్, కామన్ మ్యాన్, వైయస్ఆర్ డ్రీమ్ వరల్డ్, యువతరం’ అనే యూట్యూబ్ చానల్స్‌తో పాటు ఆర్ ప్లెక్స్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించారు. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, నరసింహారెడ్డి, విద్యావతి, అవినాష్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, స్నేహ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీలు మారినా అభ్యర్థులు వారే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎట్టకేలకు కాంగ్రెస్, మహాకూటమి సీట్ల లెక్క పూర్తయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మూడు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ, ఒక నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల్లో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కలిగించిన ఇల్లెందు అభ్యర్థిత్వం ఎట్టకేలకు హరిప్రియనాయక్‌కు ఖరారైంది. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన హరిప్రియనాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో ఆమెకు టికెట్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మినహా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వారెవరూ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులుగా లేకపోవడం విశేషం. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి పోటీ చేస్తున్న అభ్యర్థులకు.. కాంగ్రెస్ అభ్యర్థులకు మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక భద్రాచలం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల్లో టీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులు గతంలో పార్లమెంట్‌కు పోటీ చేయగా.. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. సీపీఎంకు చెందిన మిడియం బాబూరావు గతంలో భద్రాచలం ఎంపీగా గెలుపొందగా.. టీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక భద్రాచలం కాంగ్రెస్ టికెట్‌ను అనూహ్య రీతిలో చేజిక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య జిల్లాలో రాజకీయంగా అడుగిడటం ఇదే మొదటిసారి. గతంలో ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వీరయ్యకు కాంగ్రెస్ పార్టీ భద్రాచలం టికెట్ కేటాయించింది. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంజా సత్యవతి గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాల మధ్య పోటాపోటీ నెలకొంది. పినపాకలో 2014లో సీపీఐతో పొత్తు వల్ల మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పోటీ చేయనప్పటికీ.. 2009లో తనపై తలపడిన రాజకీయ ప్రత్యర్థితోనే ఈసారి సైతం తలపడుతున్నారు. 2009లో సీపీఐ తరఫున పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు ఆ ఎన్నికల్లో ఓటమి చెందగా.. 2014లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీచేసి గెలిచారు. ఇప్పుడు రేగా కాంతారావుపై పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా తలపడుతున్నారు. అశ్వారావుపేటలో ఇద్దరు పాత ప్రత్యర్థుల మధ్యే పోటాపోటీ నెలకొంది. 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ నుంచి ఈసారి పోటీ చేస్తుండగా.. తాటి వెంకటేశ్వర్లు ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనూ పాత ప్రత్యర్థుల మధ్యే పోటాపోటీ నెలకొంది. ఇక్కడ టీఆర్ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీలు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నాయి. టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే నామినేషన్ వేయగా.. టీఆర్ఎస్ తరఫున పిడమర్తి రవి పోటీ చేస్తున్నారు. మధిరలో 2014లో పోటీ చేసిన ప్రధాన పార్టీల పాత ప్రత్యర్థులే ఈ ఎన్నికల్లోనూ పోటీపడుతుండగా.. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి గా పోటీ చేసిన లింగాల కమల్‌రాజు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన మల్లు భట్టి విక్రమార్క మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పాలేరులో 2016 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి విజయం సాధించగా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి ఈసారి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అక్కడ రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్న కందాళ ఉపేందర్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కింది. ఆయన తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా.. ఇక వైరాలో 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన బానోత్ మదన్‌లాల్ ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈసారి ఆయన టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై 2014 ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయగా.. ఈసారి సైతం అదే పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అభ్యర్థి మాత్రం మారారు. సీపీఐ అభ్యర్థిగా బానోతు విజయబాయి పోటీ చేస్తుండగా.. ప్రజాకూటమి రెబెల్ అభ్యర్థిగా బానోతు రాములునాయక్ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీపీఐ అధికారిక అభ్యర్థిగా విజయబాయి నామినేషన్ దాఖలు చేయగా.. తిరుగుబాటు అభ్యర్థిగా లాల్‌సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన పువ్వాడ అజయ్‌కుమార్ ఆ తర్వాత జరిగిన జిల్లా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామా 2009 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అసెంబ్లీకి పోటీ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్, ప్రజాకూటమి, సీపీఎంల నుంచి పోటీ చేస్తున్న వారిలో మాజీ ఎంపీలు మిడియం బాబూరావు, నామా నాగేశ్వరరావు ఉండగా.. లోక్‌సభకు పోటీ చేసిన తెల్లం వెంకట్రావు ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తుండడం విశేషం. ఇల్లెందులో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన కోరం కనకయ్య, బాణోతు హరిప్రియ అప్పుడు పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా.. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో చేరి మళ్లీ ప్రధాన ప్రత్యర్థులుగా ఇల్లెందు రాజకీయ తెరపైన నిలిచారు. కోరం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో కోరం కనకయ్యపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బాణోతు హరిప్రియ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కోరం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగగా.. హరిప్రియ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడం విశేషం. తొలిసారిగా.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరా సీపీఐ అభ్యర్థి బానోతు విజయాబాయి, ఖమ్మం బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద, పినపాక బీజేపీ అభ్యర్థి చందా సంతోష్, వైరా బీజేపీ అభ్యర్థి, సినీ నటి రేష్మారాథోడ్, ఇల్లెందు బీజేపీ అభ్యర్థి నాగ స్రవంతి, మధిర బీఎల్ఎఫ్ అభ్యర్థి డాక్టర్ రాంబాబు, సత్తుపల్లి సీపీఎం అభ్యర్థి మాచర్ల భారతి, వైరా బీఎల్ఎఫ్ అభ్యర్థి భూక్యా వీరభద్రం, ఖమ్మం బీఎల్ఎఫ్ అభ్యర్థి పాల్వంచ రామారావు, పాలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి బత్తుల హైమావతి తదితరులు ఉన్నారు. ఇక ఇల్లెందు నుంచి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున పోటీ చేస్తున్న గుమ్మడి నర్సయ్య ఇదే నియోజకవర్గం నుంచి తొమ్మిదోసారి పోటీ చేస్తుండడం విశేషం. జిల్లాలో ఒకే నియోజకవర్గం.. ఒకే పార్టీ నుంచి తొమ్మిదోసారి పోటీ చేస్తున్న పార్టీ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావు, వైఎస్సార్ సీపీ నుంచి పోటీచేసిన వనమా వెంకటేశ్వరరావు మరోసారి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన వనమా.. మిత్రపక్షాల పొత్తులో భాగంగా ఆ సీటు సీపీఐకి కేటాయించడంతో ఆ ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ కొద్ది నెలలకే తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించిన వనమా ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా జలగం వెంకటరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఈ ఎన్నికల్లో ఆ సీటును కూటమి భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో సీపీఐ ఇక్కడ ఎటువంటి వ్యూహం అనుసరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ మినహా కాంగ్రెస్ నుంచి ఒకరు, బీఎల్ఎఫ్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలో ఉండడం విశేషం. -
అన్ని రంగాల్లో రెడ్లు రాణించాలి
హైదరాబాద్: ఆర్థికంగా అభివృద్ధి చెందిన రెడ్లు ఇతరులకు సాయం చేయాల్సిన బాధ్యత ఉందని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాగోలు సమీపం లోని జే కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ‘గ్లోబల్ రెడ్డి కన్వెన్షన్’ రెండో రోజు సదస్సుకు ఆదివారం ఆయన హాజరయ్యారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారన్నారు. సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలని మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. యువతకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలన్నారు. కొందరు విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతు న్నారని, అలాంటి వారి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని చదివించాలని పద్మభూషణ్ అవార్డు గ్రహీత జి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చి దిద్దాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజ నేయరెడ్డి సూచించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వర ప్రసాద్‌రెడ్డి, ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, హైకోర్టు మాజీ జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి మాట్లా డుతూ... విద్యార్థులు ఆర్థికంగా ఎలా అభి వృద్ధి చెందాలో, యువ పారిశ్రామిక వేత్త లుగా ఎలా రాణించాలో అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రమాకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు పటోళ్ల కార్తీక్‌రెడ్డి, రెడ్డి జాతీయ ఐక్య వేదిక అధ్య క్షుడు కరుణాకర్‌రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వసుంధరా రెడ్డి, ధనుంజయరెడ్డి, తరుణ్శ్రీరెడ్డి, శేఖర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. -
రెడ్ల కులస్తుల బలోపేతానికి ...
కడప వైఎస్సార్ సర్కిల్ : రెడ్ల కులస్తుల సంఘం బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలని రెడ్ల ఐక్యవేదిక కన్వీనర్ బి.జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని మానస హోటల్లో రెడ్ల ఐక్యవేదిక ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ల కులస్తులు చాలా మంది అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధికి పాటుపడాలన్నారు. రెడ్ల కులస్తులందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో రెడ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను అందరికీ అందే విధంగా సహకరిస్తామన్నారు. ఎవరికైనా ఆపద వస్తే సహాయం కోసం అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవరెడ్డి, కృష్ణకిశోర్‌రెడ్డి, లేవాకు మధుసూదన్‌రెడ్డి, గంగా ప్రసాద్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, గజ్జెల సుధాకర్‌రెడ్డితోపాటు రెడ్ల కులస్థులు పాల్గొన్నారు.