breaking news
RBI warning
-
వడ్డీ తగ్గితే మనకేంటి?
హోమ్ లోన్లు ఇకపై చౌక ఇప్పటికే తీసుకున్న వారికీ తగ్గనున్న ఈఎంఐ భారం తగ్గే వడ్డీరేట్లతో డిపాజిట్‌దారులకు ఇబ్బందే కొంచెం రిస్క్‌కు సిద్ధపడితే ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం హమ్మయ్య! ఆర్బీఐ హెచ్చరిక ఫలితమైతేనేం... వ్యాపారం కోసమైతేనేం... వడ్డీరేట్లు దిగివస్తున్నాయి. వరసగా రెండుసార్లు ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా కిమ్మనని బ్యాంకులు... ఇపుడిపుడే వడ్డీరేట్లు తగ్గించటం మొదలెట్టాయి. ఫలితం... కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఈఎంఐ భారం ఇక నుంచి తగ్గనుంది. కొత్త రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి... పాత రుణాలకు అధిక వడ్డీరేట్లను కొనసాగిస్తుండటంపై ఆర్బీఐ కన్నెర్ర చేయడంతో బ్యాంకులు దిగిరాక తప్పడం లేదు. ప్రధాన బ్యాంకులు ఇప్పటికే బేస్ రేటును తగ్గించిన ఫలితంగా పాత రుణాలకూ ఈ ఉపశమనం లభించనుంది. మరి వడ్డీరేట్లు తగ్గుతున్న ఈ తరుణంలో రుణాలు తీసుకునేవారు ఏం చేయాలి? డిపాజిట్ చేయాలనుకునేవారు ఏం చేయాలి? ఇప్పటికే రుణాలు తీసుకున్నవారి సంగతేంటి? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఈ వారం ‘ప్రాఫిట్’ ప్రధాన కథనం... డిపాజిట్లతో ఇబ్బందే! ఇప్పటికే బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించాయి. రానున్న కాలంలో ఈ వడ్డీరేట్లు ఇంకా బాగా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా డిపాజిట్లపై వడ్డీరేట్లు దిగి రావడం వల్ల రిస్క్ లేకుండా స్థిరాదాయం పొందాలనుకునే వారికి ఇబ్బందే. అందుకే ఇలాంటి సమయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే కాస్త అధికాదాయం దక్కుతుంది. 1. దీర్ఘకాలానికి వెళ్లండి.. సాధారణంగా రెండు మూడేళ్ల కాలానికి డిపాజిట్లు చేస్తుంటారు. కానీ.. వడ్డీరేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది కనక సాధ్యమైనంత ఎక్కువ కాలానికి డిపాజిట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే రెండేళ్ల కాలపరిమితి అయిన తర్వాత డిపాజిట్ పునరుద్ధరించుకోవాలనుకుంటే అప్పటికి ఇంకా వడ్డీరేట్లు తగ్గి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేసిన పక్షంలో ఇప్పటి వడ్డీయే చివరిదాకా లభిస్తుంది. యండి. అలాగే దీర్ఘకాలానికి ఏ బ్యాంకులో అధిక వడ్డీ లభిస్తుందో పరిశీలించి ఆ కాలపరిమితికి డిపాజిట్ చేయటమే మంచిది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఒకటి నుంచి ఐదేళ్ల కాలపరిమితికి 8.5 శాతం నుంచి 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రాబ్యాంక్ 1-2 ఏళ్ల కాలానికి మాత్రమే 8.75 శాతం వడ్డీని అందిస్తోంది. కానీ కొన్ని బ్యాంకులు ఐదేళ్ల కాలానికి కూడా ఇదే వడ్డీని అందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రా బ్యాంక్‌లో రెండేళ్ల కాలానికి డిపాజిట్ చేయడం కంటే ఇదే వడ్డీరేటు అందిస్తున్న పీఎన్బీ, బీవోబీ బ్యాంకుల్లో ఐదేళ్ల కాలానికి డిపాజిట్ చేయడం ఉత్తమం. 2. కొద్దిగా రిస్క్ చేస్తే... కొద్దిగా రిస్క్ చేసే సామర్థ్యం ఉంటే అధిక వడ్డీరేటు కావాలనుకునే వారికి కంపెనీల డిపాజిట్లు, ఎన్సీడీలు, డెట్ ఫండ్స్ వంటి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్ల రేట్లతో పోలిస్తే కంపెనీల డిపాజిట్లు కాస్త అధిక వడ్డీరేటును అందిస్తాయి. ఇప్పుడు బ్యాంకులు మూడు నుంచి ఐదేళ్ళ కాలానికి 8.5 నుంచి 8.75 శాతం వడ్డీరేటును అందిస్తుంటే ఇదే కాలానికి వివిధ కంపెనీలు 9.25 శాతం నుంచి 9.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. కార్పొరేట్ డిపాజిట్లలో ఉన్న రిస్కల్లా మెచ్యూర్టీ అనేది ఆ కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ డిపాజిట్ల విషయంలో చాలా విషయాలు పరిశీలించాలి. తెలియని కంపెనీ కాకుండా దీర్ఘకాలంగా కొనసాగుతున్న, ఫండమెంటల్స్ పరంగా మంచి పటిష్టంగా ఉన్న కంపెనీలనే ఎంచుకోవాలి. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో కొన్ని కంపెనీలు అధిక వడ్డీ రేటుతో ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఇటువంటి కంపెనీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కొన్ని కంపెనీలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ను జారీ చేయడం ద్వారా నిధులను సేకరిస్తాయి. ఇవి కూడా దీర్ఘకాలానికి చెందినవే. కానీ ఇవి స్టాక్ మార్కెట్లో నమోదవుతాయి కాబట్టి మధ్యలో వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు షేర్ల మాదిరి విక్రయించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఎన్సీడీ ఇష్యూ నడుస్తోంది. 11 ఆప్షన్స్‌లో లభిస్తున్న ఈ ఎన్సీడీపై 9.75 శాతం నుంచి 10.8 శాతం వరకు వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నారు. 3. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ... కొద్దిగా రిస్క్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ పథకాలు కూడా ఒక చక్కటి ఆప్షన్‌గానే భావించాలి. వడ్డీరేట్లు తగ్గే సమయంలో ఏడాది నుంచి మూడేళ్ళ కాలపరిమితి గల డెట్ ఫండ్స్ మంచి రాబడిని అందిస్తాయి. కానీ ఈ రాబడిపై ఎటువంటి హామీ ఉండకపోవడమే వీటిలోని ప్రధానమైన లోపం. ఇంటి రుణమైతే ఏం చేయాలి? సుమారు రెండున్నర ఏళ్ల విరామం తర్వాత ఈఎంఐ భారం తగ్గుతోంది. బేస్ రేటు తగ్గడం వల్ల కొత్తగా తీసుకునే గృహరుణాలతో పాటు, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా ఈఎంఐ తగ్గనుంది. ఇటువంటి సమయంలో కొత్తగా రుణాలు తీసుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా గృహ రుణాల్లో వడ్డీరేట్లు రెండు రకాలుగా చలన (ఫ్లోటింగ్), స్థిర (ఫిక్స్డ్) రూపంలో ఉంటాయి. ఫ్లోటింగ్ రేటును ఎంచుకుంటే వడ్డీరేట్లు తగ్గుతుంటే ఈఎంఐ తగ్గుతుంది. పెరిగితే ఆ మేరకు ఈఎంఐ భారం పెరుగుతుంది. అదే ఫిక్స్డ్ వడ్డీరేటు తీసుకుంటే పెరగడం, తగ్గడంతో సంబంధం లేకుండా ఈఎంఐ ఒకే విధంగా ఉంటుంది. సాధారణంగా వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో బ్యాంకులు ఫిక్స్డ్ వడ్డీరేట్ల పథకాలను ప్రవేశపెడతాయి. ఈ మధ్యనే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి సంస్థలు ఫిక్స్డ్ వడ్డీరేటుపై గృహ రుణాలను ప్రకటించాయి. వడ్డీరేట్లు తగ్గే సమయంలో ఫిక్స్డ్ రేటు కంటే ఫ్లోటింగ్‌ను ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల రానున్న కాలంలో ఈఎంఐ భారం తగ్గుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్ ఎంచుకుంటే వడ్డీరేట్లు తగ్గుతున్నా ఆ ప్రయోజనాన్ని పొందలేరు. గతంలో తీసుకున్నవారైతే? గతంలో అధిక వడ్డీరేటుకు రుణం తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు కన్వర్షన్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. కన్వర్షన్ కింద కొంత మొత్తం చెల్లించడం ద్వారా ప్రస్తుత తక్కువ బేసు రేటు మీదకు రుణాన్ని మార్చుకోవచ్చు. లేకపోతే లోన్ టేకోవర్ ద్వారా కూడా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. అధిక వడ్డీరేటు ఉన్న బ్యాంకు నుంచి తక్కువ వడ్డీరేటుకు ఉన్న బ్యాంకుకి రుణాన్ని మార్చుకోవడాన్నే లోన్ టేకోవర్ అంటారు. తక్కువ వడ్డీరేటున్న బ్యాంకును సంప్రదిస్తే వారే మీ రుణం చెల్లించి.. ఆ రుణాన్ని తమ బ్యాంకుకు మార్చుకుంటారు. -
బ్యాంక్ బ్యాలెన్స్ యాప్‌తో జర భద్రం!
''మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి'' అనే యాప్ ప్రకటన చూసి డౌన్ లోడ్ చేసుకున్నారో.. అంతే సంగతులు! మీ అకౌంట్లోని డబ్బంతా మాయమవ్వకపోతే ఒట్టు! ఎందుకంటే అది పక్కా మోసపూరిత యాప్. ప్రస్తుతం వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న ఈ యాప్‌పై రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. బ్యాంక్ బ్యాలెన్స్ తెలసుకునేందుకు ప్రత్యేకంగా తాము ఎలాంటి యాప్‌ను రూపొందించలేదని, కొందరు హ్యాకర్లు ఆర్బీఐ లోగోను అక్రమంగా వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి స్పందించొద్దని బ్యాంకు ఖాతాదారుల్ని కోరింది. -
ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్త!
ముంబై: ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా మెలగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. ప్రత్యేకించి తన పేరుతో క్రెడిట్ కార్డులకు సంబంధించి జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, విదేశీ మారకపు నిధుల సేకరణ-నిల్వ లేదా ఇతర బ్యాంకింగ్ సేవల విషయంలో ఆర్బీఐ నేరుగా వినియోగదారులతో ఎటువంటి లావాదేవీలూ నిర్వహించదని, ఈ విషయంలో తన పేరుతో వచ్చే ఎటువంటి ఆఫర్లనూ విశ్వసించవద్దని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అటువంటి ఆఫర్లను విశ్వసిస్తే, తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతారని సైతం సూచించింది. ఒకసారి ఆయా ఆఫర్లకు సంబంధించి లావాదేవీలు జరిపితే... మోసపోయిన డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీస్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కి ఫిర్యాదు చేయాలని సూచించింది. -
బిట్‌కాయిన్ ఆపరేటర్ల దుకాణాలు బంద్
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించిన నేపథ్యంలో పలు బిట్‌కాయిన్ ఆపరేటర్లు దేశీయంగా తమ కార్యకలాపాలను నిలిపివేశారు. కొన్ని సంస్థలు తాత్కాలికంగానూ, మరికొన్ని నిరవధికంగాను లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు తమ వెబ్సైట్లలో పేర్కొన్నాయి. బెసైల్బిట్కోడాట్ఇన్, ఐఎన్‌ఆర్‌బీటీసీ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బిట్‌కాయిన్ అనే కల్పిత కరెన్సీ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ వ్యవస్థ ద్వారా ఈ కరెన్సీని రూపొందిస్తున్నారు. దీనిపై ఏ నియంత్రణ సంస్థకు అధికారాలు లేవు. గడిచిన మూడేళ్లలో ఈ యూనిట్ విలువ 200 డాలర్ల నుంచి ఏకంగా 1,000 డాలర్లకు ఎగిసింది. ఈ కరెన్సీ మారకం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ కూడా దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా ఆర్బీఐ ఈ నెల 24న బిట్కాయిన్ల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.