breaking news
Ravi Foods
-
హైదరాబాద్ వద్ద డ్యూక్స్ మెగా ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్యూక్స్ బ్రాండ్‌తో బిస్కెట్లు, కన్ఫెక్షనరీ తయారీలో ఉన్న రవి ఫుడ్స్ హైదరాబాద్ సమీపంలోని కొత్తూరు వద్ద మెగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో 5 యూనిట్లతో ఇది రానుంది. నాలుగేళ్లలో ఈ మెగా ప్రాజెక్టుపై రూ.250 కోట్ల దాకా వెచ్చిస్తామని రవి ఫుడ్స్ ఎండీ రవీందర్ అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. భాగ్యనగరి వెలుపల కాటేదాన్ పారిశ్రామిక వాడలో రవి ఫుడ్స్‌కు ప్రస్తుతం 10 తయారీ కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో వీటన్నిటినీ దశల వారీగా మూసివేస్తారు. వచ్చే కొన్నాళ్లలో తయారీ అంతా కొత్తూరులోని మెగా ప్లాంటులోనే చేపడతారు. బ్రిటానియా, ఐటీసీ, పార్లె వంటి కంపెనీల కోసం రవి ఫుడ్స్ పలు ఉత్పత్తులను తయారు చేస్తోంది. రెండింతలకు టర్నోవర్.. రవి ఫుడ్స్ 2017–18లో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి టర్నోవర్ రెండింతలకు చేరుస్తామని రవీందర్ అగర్వాల్ చెప్పారు. ‘10 ప్లాంట్లకుగాను నెలకు 15,000 టన్నుల తయారీ సామర్థ్యం ఉంది. ఇందులో 50 శాతం కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, 50 శాతం సొంత బ్రాండ్ అయిన డ్యూక్స్ కైవసం చేసుకుంది. నాలుగేళ్లలో ఉద్యోగుల సంఖ్య ప్రస్తుత 2,200 నుంచి 4,000లకు చేరుతుంది. ఎగుమతుల ఆదాయం రెండింతలై రూ.800 కోట్లను తాకుతుందని విశ్వసిస్తున్నాం’ అని తెలియజేశారు. కాగా, ఆసియా వన్ మ్యాగజైన్, యునైటెడ్ రిసర్చ్ సర్వీసెస్ మీడియా కన్సల్టింగ్ నుంచి 2017–18కిగాను ఆసియాలోని 100 వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్రాండ్స్‌లో డ్యూక్స్, గ్రేటెస్ట్ లీడర్స్ జాబితా లో రవీందర్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. -
వేఫర్ బిస్కెట్ల రారాజు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘రవి ఫుడ్స్’ అంటే... ఇదేదో చంటిగాడు-లోకల్లా ఉందే!! అనుకుంటాం. అదే ‘డ్యూక్స్’ అంటే... నోరూరించే వేఫర్ బిస్కెట్లు, చాక్లెట్లు ఠక్కున గుర్తొచ్చేస్తాయందరికీ. ఈ డ్యూక్స్ది మామూలు స్టోరీ కాదు. రోజుకో కొత్త రుచిని ఇష్టపడే పిల్లలచేత 29 ఏళ్లుగా తమ బిస్కెట్లనే తినిపించటమంటే మాటలు కాదు. అందుకే... ఈ మూడు దశాబ్దాల్లో రూ.400 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసే స్థాయికి చేరింది రవి ఫుడ్స్. ఒక ప్లాంటు నుంచి ఏకంగా 12 కంపెనీలనే స్థాపించే స్థాయికి చేరుకుంది. 30 రకాల బిస్కెట్లు, చాక్లెట్లను తయారు చేయటమే కాదు... వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తోందీ సంస్థ. అదే ఈ వారం మన మాణిక్యం... మిఠాయిలంటే ఇష్టపడనిదెవరు చెప్పండి! అయితే నాణ్యమైనవి తక్కువ ధరకు అందిస్తే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. ఎగబడతారు కూడా..!! బహుశా అందుకే కావచ్చు. ‘రవి ఫుడ్స్’ పేరుతో 1985లో ప్రారంభించిన మిఠాయి (కన్ఫెక్షనరీ) వ్యాపారం తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు పిల్లల అభిరుచులు మారుతూ వస్తుండగా... అందుకు తగ్గట్టే తాము కూడా చాక్లెట్లు, బిస్కెట్లు, వేఫర్లు వంటి కొత్త కొత్త వ్యాపారాల్ని ప్రారంభిస్తూ వచ్చామని చెబుతారు రవి ఫుడ్స్ ఎండీ రాజేంద్రన్ అగర్వాల్. ‘‘రూ.10 కోట్ల పెట్టుబడితో మార్కెట్లోకి వచ్చాం. ఇపుడు అదే పెట్టుబడి రూ.200 కోట్లకు చేరింది. ప్రస్తుతం మాకు 12 కంపెనీలున్నాయి. ఇక్కడ హైదరాబాద్‌లో అంకిత్ బిస్కెట్స్, బాదామీ ఫుడ్స్, డ్యూక్స్ కన్సూమర్ కేర్, హర్షా బేకరీస్, సింఘానియా ఫుడ్స్, దిశా ఫుడ్స్, రవి ఫుడ్స్, కమల్ కన్సూమర్ కేర్, ప్యారగాన్ ఇంజనీర్ కేర్ పేరిట మొత్తం 10 కంపెనీలున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో డ్యూక్స్ ప్రొడక్ట్స్, మహబూబ్‌నగర్‌లోని కొత్తూర్‌లో ప్యాకేజింగ్ యూనిట్ నడుస్తున్నాయి’’ అంటూ తమ సక్సెస్ స్టోరీని సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వివరించారాయన. 150 దేశాలకు ఎగుమతి...: డ్యూక్స్ ఉత్పత్తులన్నీ మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లోనూ లభిస్తున్నాయి. అంతేకాకుండా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, అంగోలా, కాంగో వంటి సుమారు 150 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏటా యూఎస్‌లో రూ.50 కోట్లు, అంగోలాలో రూ.40 కోట్ల వ్యాపారం నమోదవుతూ ఉండగా... మన రాష్ట్రంలో రూ.10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.400 కోట్లు. 50 మంది కార్మికులతో ప్రారంభమైన రవి ఫుడ్స్ సంస్థలో ప్రస్తుతం 3 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి.. డ్యూక్స్ ఉత్పత్తుల ముడిసరుకుల్లో కొన్నింటిని స్థానికంగానే కొనుగోలు చేస్తారు. మరికొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మైదా పిండి, నూనె, ప్లాస్టిక్, ప్యాకింగ్ పేపర్ల వంటివి హైదరాబాద్ నుంచే కొనుగోలు చేస్తుండగా... కర్ణాటక నుంచి చక్కెర, మలేిసియా నుంచి కొబ్బరి పొడి, నెదర్లాండ్ నుంచి సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటున్నట్లు రాజేంద్రన్ చెప్పారు. ఒక్క రోజులో 700 టన్నుల బిస్కెట్లు, 50 టన్నుల చాక్లెట్లు, మిఠాయిలు ఉత్పత్తి చేస్తామని, తయారు చేసేటప్పుడే కాక ప్యాకింగ్ పూర్తయ్యాక కూడా ల్యాబ్‌లో క్షుణ్నంగా పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలియజేశారు. త్వరలో బ్రాండ్ అంబాసిడర్.. ఇప్పటి వరకు డ్యూక్స్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరూ లేరు. చాలా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేసుకుంటుండటంతో తాము కూడా తీసుకోబోతున్నామని, ప్రముఖ హీరో ప్రిన్స్ మహేశ్‌బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని రాజేంద్రన్ తెలియజేశారు. ‘‘డ్యూక్స్ అంటే ప్రిన్స్ అని అర్థం. అందుకే మహేశ్ వైపు మొగ్గుచూపుతున్నాం. ఒకవేళ కుదరకపోతే యువ క్రికెటర్ శిఖర్‌ధావన్‌ను తీసుకుంటాం. ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేస్తున్నాం. త్వరలోనే డ్యూక్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ను చూస్తారు’’ అన్నారాయన. రెండేళ్లలో పాస్తా, నూడుల్స్.. ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా పాస్తా, నూడుల్స్ ఇష్టపడుతుండటంతో పాస్తా, నూడుల్స్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించాలని రవి ఫుడ్స్ ప్రయత్నిస్తోంది. మిషనరీ కొనుగోలు, ఎక్కడ ఉత్పత్తి చేయాలి వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, రెండేళ్లలో డ్యూక్స్ పాస్తా, నూడుల్స్ రుచి చూడొచ్చునని కంపెనీ చెబుతోంది. అంతేకాక తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. మిషనరీ కొనుగోలు, పెట్టుబడులు, స్థల సేకరణ వంటి కీలకాంశాలపై బోర్డ్ సమావేశాల్లో చర్చిస్తున్నారు.