breaking news
The Rapist Movie
-
అపర్ణ సినీ ప్రపూర్ణ
తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్ జిసెక్’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. కుమార్తె కొంకణసేన్ శర్మతో అపర్ణాసేన్ అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది. బిఏ(ఇంగ్లిష్) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్ ఫోటోగ్రాఫర్ బ్రేయిన్ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్సూన్ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్రే నిర్మించిన తీన్ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్’, ‘ఆకాశ్ కుసుమ్’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది. రేకు వారసురాలిగా.. అపర్ణ తండ్రి సత్యజిత్ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్’ అనే ఇంగ్లిష్ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ లుకింగ్ ఉమెన్.. బెస్ట్ లుకింగ్ ఇండియన్ ఉమెన్ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బాగా పాపులర్ అయిన మహిళా మ్యాగజీన్ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ద రేపిస్ట్.. ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇండియన్ మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు
జాతీయ అవార్డు గ్రహీత అపర్ణసేన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది రేపిస్ట్’ 26వ బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న ‘ఏ విండో ఆఫ్ ఏషియన్ సినిమా’ విభాగంలో ప్రదర్శించగా.. ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారానికి ఎంపికైంది. పలు విదేశీ చిత్రాలతో పోటీ పడిన ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. కొంకొణాసేన్ శర్మ, అర్జున్ రాంపాల్, తన్మయ్ దనానియా ముఖ్య పాత్రలు పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఈ ముగ్గురి జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో కొంకణా అత్యాచారానికి గురైన మహిళ పాత్రను పోషిస్తుంది. అర్జున్ రాంపాల్ ఆమె భర్త పాత్రలో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ది క్వెస్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ ఇంతకుముందు సైతం విమర్శకుల ప్రశంసలు పొందిన ‘స్కామ్ 1992’ వెబ్సిరీస్ని నిర్మించింది. చదవండి: బూసన్ ఫీల్మ్ ఫెస్టివల్‌కి అపర్ణసేన్ ‘ది రేపిస్ట్’ -
బూసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అపర్ణసేన్ ‘ది రేపిస్ట్’
నటనతోపాటు దర్శకత్వంలో ప్రతిభతో జాతీయ అవార్డులు పొందిన బెంగాలి నటి అపర్ణ సేన్. నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఈస్ట్ అవార్డులు పొందింది. అంతేకాదు పలుమార్లు ఉత్తమ ఫిల్మ్ మేకర్‌గా నిలిచింది. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ది రేపిస్ట్'. ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ బూసన్ ఇంటర్నేషనల్ ఫీల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్)లో ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ.. ‘మనుషులు రేపిస్టులుగా మారేందుకు దోహదపడే విషయాలను తెలుసుకోవడం, వారు మారేందుకు మార్గాలను అన్వేషిచడం నన్ను ఈ కథను ఎంచుకునేలా చేశాయి. అవే ఈ సినిమాలోని మూడు ముఖ్యపాత్రల్లో కనిపిస్తాయి’ అని తెలిపారు. ‘మనకు రెండు రకాలు ఇండియాలు ఉన్నాయి. పాత నమ్మకాలతో కూడిన మురికి వాడల్లో నివసించే ప్రజలతో ఒకటి, చదువుకుని ప్రగతిశీల విలువలతో ఉన్న ప్రజలతో మరొకటి నిండి ఉన్నాయి. రెండు రకాల భారతదేశాన్ని మా సినిమాలో చూపించాం’అని చెప్పారు. 'ది రేపిస్ట్' నేపథ్యం ఇదే.. అర్జున్ రాంపాల్, కొంకణ్ సేన్ శర్మ నటించిన 'ది రేపిస్ట్' మూడు ముఖ్యపాత్రల ప్రయాణం. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఆ మూడు పాత్రల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. నేరాల వెనుక జరిగే పరిణామాలు నేరస్తులనే కాకుండా, నేరం నుంచి బయటపడిన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. ఈ చిత్రాని నిర్మించిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో సమీర్ నాయర్ మాట్లాడుతూ.. మా మొదటి ఫీచర్ ఫిల్మ్‌కి అపర్ణ సేన్ లాంటి ప్రతిభవంతురాలితో కలిసి ఇలాంటి పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అది బీఐఎఫ్‌ఎఫ్ కోసం కిమ్ జిసెయోక్ అవార్డు నామినేట్ అవ్వడంతో ఆ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ప్రపంచ ప్రేక్షకుల మదిని దోచుకుంటుందని ఆశిస్తున్నామ"ని తెలిపాడు. అపర్ణ సేన్ 1974 నుంచి 1983 వరకు ఉత్తమ నటిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోడంతో పాటు దర్శకత్వం, స్క్రీన్ రైటర్ వంటి వివిధ శాఖల్లో తన ప్రతిభను చాటుకుని జాతీయ అవార్డులను పొందింది. దీంతో చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1987లో పద్మశ్రీతో సత్కరించింది. కాగా ఆసియాలోనే అతి పెద్దదైన బీఐఎఫ్‌ఎఫ్ 26వ ఎడిషన్ అక్టోబర్ 6 నుంచి 15 వరకు జరగనుంది.