breaking news
rangareddy courts
-
ఆలయ మడిగల కబ్జా- నిందితులకు జైలు
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆలయానికి చెందిన మడిగలను కబ్జా చేసిన కేసులో నలుగురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. ఎల్బీ నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం పరిధిలో 102 మడిగలు(దుకాణాలు) ఉన్నాయి. వీటిలో 76, 77 మడిగలలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇరవయ్యేళ్లుగా కిరాయికి ఉంటున్నాడు. అయితే 2011లో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తన భార్య పేరుపై ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై ఆలయ చైర్మన్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన రంగారెడ్డిజిల్లా కోర్టు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కవితాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడు మల్లారెడ్డి, మరో ముగ్గురికి ఏడాది జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. -
కుక్క యజమానికి జరిమానా
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కుక్కకాటు వేసి ఓ వ్యక్తి గాయపడినందుకు ఆ కుక్క యజమానికి వెయ్యి రూపాయల జరిమానా, గాయపడ్డ బాధితుడికి రూ.800 ఆసుపత్రి ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం....అల్కాపురి యాదవనగర్కాలనీలో నివాసముండే రాజేశ్వరాచారి 2014, జనవరి 24న వాకింగ్‌కు వెళ్తుండగా అదే ప్రాంతంలో నివాసముండే మహిళ వేదాంతంశెట్టి పెంపుడు కుక్క రాజేశ్వరాచారిని కరిచి గాయపరిచింది. దీంతో బాధితుడు ఎల్బీనగర్ పోలీసులకు కుక్క యజమానిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్క యజమానురాలిని రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.