breaking news
Ramakkapeta
-
గొప్ప మనసు చాటుకున్న హీరో సంపూర్ణేశ్‌బాబు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థికస్థోమత లేక అల్లాడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి హీరో సంపూర్ణేశ్‌బాబు ఆర్థికసాయం అందించి ఔదార్యం చాటుకున్నాడు. మండలంలోని రామన్నపేటకు చెందిన సంకోజి లావణ్య- రమేశ్‌బాబుకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. నెల రోజులుగా చిన్నారి శివ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వైద్యానికి రూ.10 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. గ్రామస్తులు రూ.లక్ష విరాళం అందించగా, సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న హీరో సంపూర్ణేశ్‌బాబు శనివారం రామన్నపేటకు వచ్చి చిన్నారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. రామన్నపేట, బండపల్లి గ్రామాల సర్పంచులు దుమ్ము అంజయ్య, న్యాత విజయజార్జ్, మానేరు స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ ఉన్నారు. -
రామక్కపేట నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
నంగునూరు: దుబ్బాక మండలం రామక్కపేటలో తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల అధ్యక్షుడు దేవర నర్సింలు, ప్రధాన కార్యదర్శి మానుపాటి రాజు, కోశాధికారి శీలసాగరం రవీందర్, గౌరవ సలహాదారు దేవర మల్లయ్య ఆరోపించారు. మంగళవారం నంగునూరు మండల కేంద్రంలో ప్రదేశ్ ఎరుకల సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దసరా పండుగనాడు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దళితులకు న్యాయం చేసే విధంగా అధికారులకు, పోలీసులకు బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఆందోళన అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వీరికి ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు లింగంపల్లి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరెపల్లి కనకయ్య, నంగునూరు మండల అధ్యక్షుడు దేవుపల్లి రాజమౌళి, జిల్లా నాయకుడు దేవులపల్లి కిష్టయ్య, బీసీ సంఘం నాయకులు కొమురయ్య, వడ్డెర సంఘం అధ్యక్షుడు యాదగిరి, మాల సంఘం అధ్యక్షుడు నర్సింలు సంఘీభావం ప్రకటించారు. నిందితులను అరెస్టు చేయాలి దుబ్బాక రూరల్: రామక్కపేటలోని తల్లీ కూతళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఆశలత డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె బాధితులను పరామర్శించారు. అనంతరం ఆశాలత మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 60 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మహిళలపై అత్యాచారాలు జరగడం సిగ్గు చేటన్నారు. అత్యాచార ఘటనలో ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం శోచనీయమన్నారు. అత్యాచార ఘటనకు కారకులైన నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నేతలు నవీన, జమున, సీపీఎం డివిజన్ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్, నాయకులు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు’ రామక్కపేటలో తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రశ్నించింది. మంగళవారం దుబ్బాకలో టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పల్లె చంద్రం, జిల్లా కార్యదర్శి జంగిటి నర్సింలు మాట్లాడుతూ దళిత, ఆదివాసీల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, హత్యలు సిగ్గుచేటన్నారు. అత్యాచార నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి, మరో ముగ్గురిని కేసు నుంచి తప్పించే యత్నం జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులందరిని అరెస్టు చేయకుంటే టీపీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిందితులను తప్పించేందుకు కుట్ర దుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను తప్పించడానికి కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాచార సంఘటనలో నిందితులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ నియోజక వర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పెద్దగుండవెల్లి ఎంపీటీసీ సంజీవరెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ సాందిరి బాలకిషన్, కాంగ్రెస్ నాయకులు కటికె బాల్‌రాజు, అనంతుల శ్రీనివాస్, సెంట్రింగ్ దుర్గయ్య, చెక్కపల్లి ప ద్మయ్య, కిష్టమ్మగారి కిష్టారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి రామక్కపేటకు చెందిన తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ఎరుకల ప్రజా సంఘం, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ మాట్లాడుతూ అత్యాచార నిందితులపై నిర్భయ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఐదెకరాల వ్యవసాయ భూమి, నెలకు మూడు వేల రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బాధిత కుటుంబానికి రూ. 10 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యరద్శి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎం. శ్యామల, నాయకులు వి. నాగార్జున, శేఖర్, నర్సింగారావు, వనం కనకయ్య, యాదగిరి, నిమ్మ పోశయ్య, నిమ్మ రాజు, నిమ్మ లచ్చయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు అనుమానం పోలీసుల అదుపులో ఇద్దరు మెదక్ జిల్లా రామక్కపేటలో దారుణం దుబ్బాక: తల్లీకూతుళ్లపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిజన బాలిక (17) దసరా పండగను పురస్కరించుకుని రాత్రి తోటి మిత్రులకు జమ్మీ ఇవ్వడానికి వెళ్లింది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్ బైక్‌పై వచ్చాడు. తాను కూడా అటే వెళుతున్నానని చెప్పి ఆమెను ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమె ముక్కు వద్ద మత్తు మందు పూసిన కర్చీఫ్‌ను ఉంచడంతో ృ్పహ కోల్పోయింది. అక్కడి నుంచి సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న కొంత మందితో కలసి కరుణాకర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతక సాగారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దిలీప్.. బాలిక తల్లి(40) వద్దకు మీ కుమార్తెను చూపుతానని చెప్పి ఆమెను బైక్‌పై సదరు నీలగిరి తోట వద్దకు తీసుకెళ్లగానే అదే గ్యాంగ్ ఈమెపై కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఆమెను దిలీప్ మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా భర్త కనిపించడంతో బైక్‌పై నుంచి దూకి విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరూ నీలగిరి తోటలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కూతురుని చూసి నిశ్చేష్టులయ్యారు. బాధితులు శనివారం ఉదయం దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లీకూతుళ్లను వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సామూహిక అత్యాచారంలో మొత్తం ఎనిమిది మంది పాల్గొన్నారని, వీరి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండవచ్చని సమాచారం. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గ్రామానికి వచ్చి విచారణ చేశారు. కాగా, నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. నిందితులను కఠినంగా శిక్షించాలి: బలరాం నాయక్ మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. గతంలో వరంగల్ జిల్లాలో కాలేజీ అమ్మాయిలపై యాసిడ్దాడి చేసిన వారిని పోలీసులు కాల్చి చంపినట్లుగా శిక్ష ఉండాలని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను సీఎం, హోంమంత్రి సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తెలంగాణలోని గిరిజనులు ఆ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఈ ఘటనను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం: పొంగులేటి రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి విమర్శించారు. హోంశాఖ నిర్వహణ కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నా శాంతి, భద్రతల పరిరక్షణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ఈ వైఫల్యం కారణంగా తాజాగా మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన 108 సర్వీసు వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడిందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావడం లేదని, ఈ విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నారు.