breaking news
Rabi farmers
-
అకాల దెబ్బ
కరీంనగర్ అగ్రికల్చర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగండం ప్రభావంతో శనివారం కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. అకాలవర్షం రబీ రైతులకు కాస్త ఊరట కలిగించగా, మరికొంత మంది రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఏరివేత దశకు వచ్చిన పత్తి వానకు తడిసి ముద్దయింది. మంథని మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యం నీటిపాలైంది. పలుచోట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు మొక్కజొన్న కర్రలు నేలవాలాయి. సింగరేణి సంస్థ ఆర్జీ-1 డివిజన్ పరిధిలోని ఓసీపీ 1, 2లలో నీరునిలిచి బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్, గోదావరిఖనితో పాటు పలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కరీంనగర్లో ఇళ్లలోకి నీరు చేసింది. విద్యుత్ స్తంభాలు నేలకూలగా, ఇళ్ల పైకప్పులు గాలులకు కొట్టుకుపోయాయి. శుక్రవారం రాత్రి నుంచే జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి మళ్లీ వాన జోరందుకుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లావ్యాప్తంగా సగటున 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఇరవై మండలాల్లో వర్షం పడగా, అత్యధికంగా మల్యాల మండలంలో 37.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 908 మిల్లీమీటర్లకు 588 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం లోటుండగా, ఆరు మండలాల్లో సాధారణం, 49 మండలాల్లో లోటు, రెండు మండలాల్లో అత్యల్ప వర్షపాతం ఉంది. జిల్లాకు మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉండటంతో లోటు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారు. రామగుండంలో కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగ్జిబిషన్లో భారీ కటౌట్లు కూలిపోయాయి. తిరుమల్‌నగర్ తీన్రాస్తాలో ఓ ప్రైవేట్ సంస్థ కేబుళ్ల కోసం తవ్వి వదిలేయడంతో స్థానికంగా ఉన్న ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఉల్లిగడ్డల హోల్‌సేల్ దుకాణంలోకి భారీగా నీరు రావడంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని యజమాని తెలిపాడు. యెటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలో భారీ వర్షానికి ఓసీపీ 1,2,3లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ప్రాజెక్టుల్లో నీరు నిలువడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మంథని వ్యవసాయ మార్కెట్‌తో పాటు డివిజన్లోని సుమారు 15 కేంద్రాల్లో నిల్వ ఉన్న 20వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిముద్దయింది. డివిజన్లోని ఏడు మండలాల్లో సుమారు 500 ధాన్యం కుప్పలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు వేల ధాన్యం బస్తాలు తడిసినట్లు వారు తెలిపారు. మంథని మండలంలో కోత దశకు వచ్చిన వరిపంట వర్షం తాకిడికి నేలవాలగా, మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వెంకటాపూర్ కేంద్రంలో ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. కాటారం, మల్హర్, కమాన్‌పూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మల్హర్ మండలం కొండంపేట పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో శనివారం ఉదయం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. వెల్గటూర్, పెగడపల్లి, వేములవాడ, చందుర్తి, కోరుట్ల, రాయికల్, మానకొండూర్, బెజ్జంకి, శంకరపట్నం, తిమ్మాపూర్, ఇల్లంతకుంట, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. -
ధాన్యం కొనుగోలుకు 617 కేంద్రాలు
కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కరీంనగర్, న్యూస్‌లైన్ : రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు జిల్లాలో 617 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో జిల్లాలో 13.41మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశామని అన్నారు. అందులో సుమారు 5లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ సంస్థలతో కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 311 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 303 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 3 గిరిజన కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీబ్యాగ్‌లు, అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. జిల్లాలోని ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైస్‌మిల్లర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని రవాణా చేసేందుకు 262 రైస్ మిల్లులను ఎంపిక చేసి అనుసంధానం చేసినట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకుండా ధాన్యం కొనుగోలు చే సే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా సరఫరా అధికారి చంద్రప్రకాశ్, డెప్యూటీ రవాణా అధికారి మీరాప్రసాద్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.


