breaking news
puskara nagar
-
దుకాణం బంద్!
పుష్కరనగర్‌లో షాపుల మూత ఆశించినస్థాయిలో యాత్రికలు రానందునే.. నెహ్రూనగర్: కృష్ణా పుష్కరాలకు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌ను ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను అధికారులు ఏర్పాటు చేశారు. యాత్రికులకు అవసరమైన జనరల్ స్టోర్స్, పూజా సామాగ్రి, హ్యండ్లూమ్స్, మందుల షాపు, ప్రూట్ స్టాల్స్ వంటి వాటిని డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 37 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడకు యాత్రికులు భారీ స్థాయిలో వస్తారని ఆశించిన వ్యాపారులు స్టాల్స్ లో లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికులు కావాల్సినవన్ని సిద్ధం చేశారు. కాని పుష్కర్‌నగర్‌కు యాత్రికులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వ్యాపారులు డీలా పడ్డారు. పుష్కరాలు ప్రారంభమైన రోజు నుంచి అనుకున్న బేరం సాగక వ్యాపారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 6వ రోజు నాటికే స్టాల్స్‌ను ఖాళీ చేసి వెళ్లి పోవాలని నిర్ణయానికి వచ్చారు. 8వ రోజు నాటికి సగానికిపైగా వ్యాపారులు స్టాల్స్‌ను సర్దుకొని వెళ్లిపోయారు. ఇంకా కొంత మందిని అధికారులు ఈ నాలుగు రోజులు ఉండండి అంటున్నా వారు వెళ్లిపోతూనే ఉన్నారు. అదే విధంగా పుష్కర్‌నగర్ లో విధులు నిర్వహిస్తున్న, పారిశుద్ధ్య విభాగం, ఇతర విభాగాల నుంచి సిబ్బందిని అవసరం మేరకు ఉంచి మిగిలిన వారిని పుష్కర విధుల నుంచి అధికారులు వెనక్కి పిలిచారు. రూ.25 వేలు నష్టం.. కృష్ణా పుష్కరాలకు యాత్రికులు గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌కు పెద్ద సంఖ్యలో వస్తారని, వ్యాపారం బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఐస్ క్రీమ్, లస్సీ, మజ్జిగæ స్టాల్‌ను రూ.45వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాం. కానీ మొదటి రోజు నుంచి వ్యాపారం సాగక నష్టపోయాం. దాదాపు రూ.25 వేల నష్టం వచ్చింది. – సి.హెచ్ దీలిప్ వ్యాపారి -
ఆర్భాటం ఫుల్.. వసతులు నిల్
ఇదీ పుష్కరనగర్‌లో పరిస్థితి భక్తులకు, సిబ్బందికి సాంబారు అన్నమే.. గుంటూరు (నెహ్రూనగర్): కృష్ణా పుష్కరాల యాత్రికుల కోసం గుంటూరు శివారులోని గోరంట్లలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్కర్‌నగర్‌లో హంగులు ఆర్భాటంగా ఉన్నా సేవల్లో మాత్రం తుస్సుమనిపించారు. వివిధ జిల్లాల నుంచి అమరావతికి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌ను అంగరంగ తీర్చిదిద్దారు. వివిధ రకాల స్టాల్స్‌ను అందులో ఏర్పాటు చేశారు. మందుల షాపు, పండ్లు, పూజా సామగ్రి, కిరాణా స్టోర్స్ తదితరాలు ఉన్నాయి. యాత్రికులకు ఆరోగ్య పరంగా ఏమైనా సమస్యలు వస్తే వెంటనే చికిత్స చేసే నిమిత్తం వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు వినోదం నిమిత్తం విశ్రాంతి తీసుకునే రెండు షెడ్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లతో భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు. అధికారుల అంచనా ప్రకారం దాదాపు 10 వేల మంది యాత్రికులు పుష్కర్ నగర్‌కు వస్తారనుకున్నారు. మొదటి రోజైన శుక్రవారం అందులో 10 శాతం మంది కూడా రాలేదు. యాత్రికులకు వినోదం కోసం డీవైఈవో రమేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులతో కూచిపూడి, బుర్రకథ, అమ్మవారి వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్వచ్ఛంద సేవలు.. పుష్కర్‌నగర్‌లో యాత్రికులకు సేవలందించేందుకు చలమయ్య డీగ్రీ కళాశాల నుంచి 50 మంది, విజ్ఞాన్ డీగ్రీ కాళాశాల నుంచి 35 మంది విద్యార్థులు వచ్చారు. యాత్రికులకు భోజనాల వడ్డింపు, బస్సుల రూటు వివరాలు తదితరాలు తెలియజేయడంలో విద్యార్థులు సహకారం అందించారు. సాంబారు అన్నం తినలేక.. నగరపాలక సంస్థ, ఇస్కాన్ సంస్థ అనుబంధంగా పుష్కర యాత్రికులకు పుష్కరనగర్‌లో ఉచిత భోజన వసతి కల్పించారు. అయితే భోజనాల్లో అన్నం, సాంబారు, స్వీట్ పెట్టి చేతులు దూలుపుకున్నారు. సిబ్బంది సాంబారు అన్నం తినలేక అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రంగా ఉన్న దృష్ట్యా కనీసం పెరుగు, మజ్జిగ ఉన్నా బాగుండేదని పేర్కొన్నారు. యాత్రికులు చేసేది లేక సాంబరు అన్నంతోనే సరిపెట్టుకున్నారు. భోజనాల వద్ద మంచినీటి సరఫరా కూడా సరిగా లేదు. భక్తులు అన్నం ప్లేటును బెంచ్‌పై వదిలి వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత వైఫై హుళక్కే.. పుష్కర్‌నగర్‌లో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా వైఫై అని అధికారులు ప్రకటించినప్పటికీ, ఇక్కడ వైఫై అందుబాటులో లేదు. ఎక్కడో సిగ్నల్ టవర్ ఉండటంతో పుష్కర్‌నగర్ దాకా సిగ్నల్ రాని పరిస్థితి. కేవలం స్టాల్స్ వరకు మాత్రమే వైఫై సిగ్నల్ అందుతున్నప్పటికీ దానికి కూడా అధికారులు పాస్వర్డ్ పెట్టారు. రెండో రోజు నుంచి యాత్రికులు పెరిగేఅవకాశం ఉండటంతో ఉండే ఫోన్ సిగ్నల్స్ కూడా అందవేమో అని కొందరు అనుకుంటున్నారు. అధికారులు సిగ్నల్స్ ఫ్రీక్వేన్సీ పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.