breaking news
public openion
-
చీరలెలా ఉన్నాయ్..
భీమ్‌గల్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకం అభాసుపాలు కాకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఏడాది ఈ చీరల పంపిణీ వివాదాస్పదమైంది. నాణ్యత కొరవడిన చీరలను పంపిణీ చేసారని, చౌకబారు చీరలతో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల చీరలను తగుల బెట్టడం, ప్రతిపక్షాలు వీటిపై విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఏడు ఎటువంటి ఆరోపణలు రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు అవకాశమివ్వకూడదని జాగ్రత్తగా పథక నిర్వహణ చేపట్టనుంది. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తం గా అన్ని మండలాలలో బతుకమ్మ చీరలను ఐదు రోజుల పాటు ప్రదర్శనకు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని మండలాలలో చీరలపై మహిళల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రతి మండలంలో ఐదు చోట్ల వీటిని ఉంచి తద్వారా వాటిపై మహిళల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకుగాను ప్రతి చోట ఒక రిజిస్టర్‌ను ఏర్పాటు చేసారు. చీరలను పరిశీలించిన వారు అభిప్రాయాలను, పేరు, ఫోన్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి చీరల ప్రదర్శన నిర్వహించి అభిప్రాయచాలు కోరతున్నారు. ఇందు కోసం ఈ నెల 5 నుంచి 10 వరకు గడువు నిర్ణయించింది. 10వ తేదీ అనంతరం మండలాలవారీగా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై రాండమ్‌గా ఫీడ్‌బ్యాక్‌ను పైఅధికారులకు పంపిస్తారు. దీని ఆధారంగా చీరల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఇవి కేవలం మహిళల అభిప్రాయం కోసం తీసుకువచ్చిన శాంపిల్ చీరలు మాత్రమే. ఇంకా బతుకమ్మ చీరలు రాలేదు. గత సంవత్సరం జిల్లాకు 5 లక్షల 13 వేల 739 చీరలు వచ్చాయి. అందులో 46 వేల చీరలు మిగలగా వాటిని తిరిగి పంపించాం. ఈ సంవత్సరం మరో రెండు శాతం పెరిగి ఉండచ్చు. – శ్రీనివాస్ డీపీఎం, ఐకేపీ కానుకలకు వెల కట్టవద్దు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా ఈ చీరలను అందిస్తోంది. ఇది ఆడపడుచుకు పుట్టింటి వారు ఇచ్చే కానుకగా భావించాలి. దీనికి వెల కట్టడం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుంది. ప్రతి పక్షాలు ప్రతీది రాజకీయం చేసి ప్రజల్లో దిగజారిపోయాయి. ఈ బతుకమ్మ కానుకలు ఎంపీ కవితమ్మ కలల ప్రాజెక్టు. సగటు మహిళల ఆలోచనలకు ఆమె ప్రతిరూపం. – వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, బాల్కొండ -
సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేయండి
- ప్రజాభిప్రాయ సేకరణలో నేతలు, ప్రజా సంఘాలు, వినియోగదారులు – ఆమోదయోగ్యకరమైన నిర్ణయం ఉంటుంది - ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ జి.భవానీ ప్రసాద్ కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ చార్జీలు పెంచితే అన్ని వర్గాల ప్రజలపై దాని ప్రభావం ఉంటుందని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు, వినియోగదారులు స్పష్టం చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచేందుకు దక్షిణ మధ్య విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర నివేదికలపై గురువారం స్థానిక విద్యుత్ భవన్లో ఏపీ ఈఆర్సీ బృందం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడేళ్లగా జిల్లాలో కరువు తాండవం చేస్తోందని, అలాంటప్పుడు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయడం అన్యాయమన్నారు. కరువు జిల్లా కావడంతో విద్యుత్‌ను ప్రత్యేక రాయితీతో సరఫరా చేయాలని కోరారు. వినియోగదారుల అభ్యంతరాలు విన్న డిస్కం సీఎండీ హెచ్‌వై దొర చార్జీల పెంచేందుకు గల కారణాలను వివరించారు. సమస్యలను పరిష్కరిస్తామని, సేవలను మెరుగుపరుస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఈఆర్సీ సభ్యులు పి.రామమోహన్, డాక్టర్ పి. రఘు, కమిషన్ సెక్రటరీ ఎ. శ్రీనివాస్, డిస్కం డైరెక్టర్లు సయ్యద్ బిలాల్ బాషా, పి.పుల్లారెడ్డి, కర్నూలు జోన్ సీఈ పీరయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల ఎస్ఈలు పాల్గొన్నారు. బాబుకు విదేశీ కంపెనీలే అక్కర: సత్యం గౌడు, ఏపీ గ్రానైట్స్, చిన్న తరహా పరిశ్రమల అసోసియేషన్ చైర్మన్ రాజధానిలో ఏ పని చేపట్టాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విదేశీ కంపెనీలే గుర్తుకొస్తున్నాయి. మన పరిశ్రమల బాగోలు పట్టడం లేదు. నష్టాల కారణంగా సగానికి పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. ఈ పరిస్థితుల్లో చార్జీలు పెంచితే ఉన్నవి కూడా మూసేసుకోవాల్సి వస్తుంది. రాయితీపై విద్యుత్ ఇవ్వాలి: ఇ.పుల్లారెడ్డి, సీసీఎం మాజీ కార్పొరేటర్ వెనకబడిన సీమలోని జిల్లా అయిన కర్నూలుకు రాయితీతో విద్యుత్‌ను సరఫరా చేయాలి. ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.2వేల కోట్లు, బడాబాబుల బకాయిలు రూ.వెయ్యి కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని వసూలు చేస్తే సంస్థ నష్టాలు తగ్గుతాయి. కనెక్షన్ కోసం నాలుగేళ్లు నిరీక్షించిన రైతులు చివరకు మరణించినా కనెక్షన్ ఇవ్వలేదు. మామూళ్లతో వేధిస్తున్నారు: వి.భరత్ కుమార్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు విద్యుత్ కనెక్షన్లతోపాటు వివిధ రకాల పనుల కోసం వచ్చే రైతులను అధికారులు, సిబ్బంది మామూళ్ల కోసం వేధిస్తున్నారు. నెలల పాటు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కరెంటు సౌకర్యం అందక రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారు. ఇక ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనెక్షన్లు తొలగిస్తున్నారు. అందరిపై భారం పడుతుంది: ఎంఏ హఫీజ్ ఖాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త విద్యుత్ చార్జీల ప్రభావం అందరిపై పడుతుంది. వర్షాలు లేక రైతులకు పంట చేతికి రావడం లేదు. అలాంటప్పుడు చార్జీలు పెంచితే బిల్లులు ఎలా చెల్లిస్తారు. వీరి చేతిలో డబ్బులేని పక్షంలో పట్టణాలకు వచ్చి లావాదేవీలు కొనసాగించలేదు. వ్యాపారాలు లేక వ్యాపారులు బిల్లులు చెల్లించలేరు. ఒక వేళ చెల్లించాల్సి వస్తే రైతులకు అమ్మే వస్తువుల ధర పెంచాల్సి వస్తుంది. చిన్న పరిశ్రమలు మూత పడతాయి: ఆర్.రఘురామన్, బలహార్ కెమికల్స్ చైర్మన్ చిన్న పరిశ్రమలు అసలే నష్టాల్లో నడుస్తున్నాయి. ఇప్పటికే అనేక పరిశ్రలు వ్యాపారాలు లేక, వివిధ నష్టాల కారణంగా మూత పడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ యూనిట్ ధర రూ.8వరకు పడుతోంది. మరింత చార్జీలు పెంచితే ఎలా. ప్రస్తుతం పరిశ్రమలు నడుపుకోకపోయినా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.