breaking news
property management
-
లండన్‌లోనూ కొనేస్తున్నారు...
లండన్: హాట్ ప్రాపర్టీ మార్కెట్‌గా పేరొందిన లండన్‌లో స్థిరాస్తుల కొనుగోళ్లలో భారతీయులు ముందున్నారు. లండన్ ప్రాపర్టీ లావాదేవీల్లో భారతీయులు టాప్ 2గా నిలిచి స్థిరాస్తులు సొంతం చేసుకోవడంపై తమ క్రేజ్‌ను చాటుకున్నారు.బ్రెగ్జిట్ పరిణామాలు, ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల ప్రభావం ఇవేమీ ఆస్తుల కొనుగోలులో మనవాళ్ల ఆసక్తిని దెబ్బతీయడం లేదు. 2016 ఆగస్ట్ నుంచి జులై 2017 మధ్య ప్రైమ్ సెంట్రల్ లండన్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో 22 శాతం భారతీయులవేనని ప్రాపర్టీ కన్సల్టెన్సీ క్లట్టన్స్ అథ్యయనం వెల్లడించింది. రియల్ లావాదేవీల్లో ప్రతి ఐదింట ఒకటి భారతీయులదేనని, 18 బిలియన్ పౌండ్ల వ్యాపారంలో 4 బిలియన్ పౌండ్ల లావాదేవీలు భారతీయులవని సంస్థ పార్టనర్, రీసెర్చి హెడ్ పైసల్ దుర్రాని చెప్పారు. ఐదేళ్ల కిందట సెంట్రల్ లండన్‌లో భారతీయుల ప్రాపర్టీ పెట్టుబడులు 5 శాతం నుంచి 2017లో 22 శాతానికి పెరిగాయని రియల్ ఎస్టేట్ సేవలు అందించే కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్స్ పేర్కొంది. గతంలో యూఎస్ డాలర్లలో లండన్‌లో ఆస్తులు కొనుగోలుచేసిన వారు ప్రస్తుత మారకపు విలువ ఆధారంగా భారీగా లాభపడుతన్నారని, ఆస్తుల కొనుగోళ్లకు ఫారెన్ ఎక్స్ఛేంజ్ వ్యత్యాసాలు కూడా భారతీయులకు కలిసివస్తున్నాయని క్లట్టన్స్ సంస్థ అంచనా వేసింది. -
ఆస్తి మీది.. బాధ్యత మాది!
♦ ఓనర్లకు వరంగా మారిన ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ♦ అద్దే కాదు.. ఆస్తి నిర్వహణ, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు వంటివెన్నో.. ‘‘అమెరికాలో నివాసముండే ప్రవాస భారతీయుడు అఖిలేష్ ఇటీవలే హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ కొన్నాడు. ఖాళీగా ఉండే బదులు అద్దెకిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. కానీ, ఎవరికివ్వాలి? నెలా నెలా అద్దె తీసుకోవటం, ప్రాపర్టీ టాక్స్ చెల్లింపుల వంటివెలా చేయాలి? అద్దెకు తీసుకున్న వారు ప్రాపర్టీని సరిగ్గా నిర్వహణ చేస్తారా? వంటి సవాలక్ష సందేహాలున్నాయతనికి!’’ ‘‘ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉండే జస్విత్ది మరో కథ. భాగ్యనగరంలో తన పేరుమీదున్న విల్లాను ఎవరికైనా అద్దెకిద్దామనుకున్నాడు. కానీ, నగరంలో జరిగే ప్రాపర్టీ మోసాలు చూసి వెనుకడుగేస్తున్నాడతను. ఇంటి ఓనర్ లేనిది చూసి రాత్రికి రాత్రే నకిలీ పేపర్లు సృష్టించి ఇతరులకమ్మేస్తాడేమోనని!’ .. ఇలాంటి సమస్యలు వీరివే కాదు ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరివీనూ. మరెలా? స్థానికంగా ఉన్న ప్రాపర్టీ అద్దెకిచ్చో.. లీజుకిచ్చో డబ్బులు సంపాదించుకోవటమెలా? అదే సమయంలో ప్రాపర్టీని కంటికిరెప్పలా కాపాడుకోడమూ కావాలి కూడా. దీనికి పరిష్కారమే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)!! - సాక్షి, హైదరాబాద్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) సేవల ద్వారా కలిగే ప్రయోజం అంతా ఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి సంస్థ ప్రతినిధులే చూసుకుంటారు. నెల వచ్చేసరికి ఠంఛనుగా అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్‌ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారునికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొం దించే బాధ్యత కూడా పీఎంఎస్లదే. అద్దెదారులు పాటించాల్సిన నియమ నిబంధల్ని మీ తరపున ఖారారు చేస్తారు. మరమ్మత్తులు కూడా: క్రమం తప్పకుండా విద్యుత్, ఆస్తి పన్ను చెల్లింపులు పీఎంఎస్లో సేవలో ప్రధానం. మీది ఫ్లాట్ అయితే అపార్టుమెంట్ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు. ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు. పండగలు, అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు. మీ తరుపున ప్రతినిధి: మీకు అద్దెదారునికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత కూడా వీరిదే. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేదీ వీరే. మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ప్రతిసేవకు ఎంతోకొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు.