రసాయన నిషేధానికి నోబెల్
ఓపీసీడబ్ల్యూ సంస్థను వరించిన శాంతి పురస్కారం
పాక్ బాలిక మలాలాను వెనక్కి నెట్టి అవార్డు దక్కించుకున్న ఓపీసీడబ్ల్యూ
సిరియాలో రసాయన దాడి తర్వాత వెలుగులోకి వచ్చిన సంస్థ
16 ఏళ్లలో 57 వేల టన్నుల ఆయుధాలను నిర్వీర్యం చేసిన ఘనత
ఓస్లో: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఈసారి రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (ఓపీసీడబ్ల్యూ)ని వరించింది. సిరియాలో ఇటీవల రసాయన దాడుల అనంతరం వెలుగులోకి వచ్చిన ఈ సంస్థ.. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1997లో ఏర్పాటైంది. మానవ జాతికి ప్రమాదకరంగా మారిన రసాయన ఆయుధాల నిర్మూలనే లక్ష్యంగా ఓపీసీడబ్ల్యూ పనిచేస్తోంది. పాక్లో ఉగ్రవాదుల తూటాలను ఎదిరించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన అక్షర సాహసి యూసుఫ్జాయ్ మలాలా లేదా కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ ముక్వెజ్కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వస్తుందని అంతా ఊహించారు.
అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ నోబెల్ కమిటీ చైర్మన్ థార్బ్జోర్న్ జాగ్లాండ్ శుక్రవారం ఓపీసీడబ్ల్యూ పేరును ప్రకటించారు. వ్యక్తులు కాకుండా ఓ సంస్థ నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకోవడం ఇది వరుసగా రెండోసారి. కిందటిసారి ఈ బహుమతిని యురోపియన్ యూనియన్ గెల్చుకుంది. ది హేగ్ కేంద్రంగా ‘ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్(ఓపీసీడబ్ల్యూ)’ సంస్థ పనిచేస్తోంది. 1993, జనవరి 13న ప్రపంచదేశాల మధ్య కుదిరిన ‘రసాయన ఆయుధాల నిర్మూల ఒప్పందం’ అమలుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం సిరియాలో రసాయన ఆయుధ కర్మాగారాల నిర్మూలన పనులను పర్యవేక్షిస్తోంది. గత 16 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా 57 వేల టన్నుల రసాయన ఆయుధాలను ఈ సంస్థ నిర్వీర్యం చేసింది. నోబెల్ శాంతి అవార్డు రావడంపై ఓపీసీడబ్ల్యూ హర్షం వ్యక్తం చేసింది. రసాయన ఆయుధాల నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ముందుకు రావాలని సంస్థ అధినేత ఆమెట్ ఉజుమ్చు ఆకాంక్షించారు.
బాన్ కీ మూన్ అభినందనలు..
నోబెల్ శాంతి అవార్డు గెల్చుకున్న ఓపీసీడబ్ల్యూను ఐక్యరాజ్యసమితి అధినేత బాన్ కీ మూన్ అభినందించారు. రసాయన ఆయుధాలతో జరుగుతున్న అమానవీయ దాడులను నిలువరించేందుకు, ఆయుధాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ కదలాలని పిలుపునిచ్చారు. ఓపీసీడబ్ల్యూకు నోబెల్ బహుమతి ఇవ్వడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ఆహ్వానించింది. ఈ అవార్డుతో అంతర్జాతీయ సమాజం రసాయన ఆయుధాలకు వ్యతిరేకమన్న సందేశం పంపినట్లయిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సలీల్ శెట్టీ అన్నారు.