breaking news
the press
-
రేపటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ: ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా ఆదివారం అన్ని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఈ సెషన్ ఉద్దేశం వారికి వివరించి, అభిప్రాయాలు తెలుసుకోనుంది. అయిదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ది అడ్వొకేట్స్(సవరణ)బిల్లు–2023, ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023, ది పోస్టాఫీస్ బిల్లు–2023లను ఈ సెషన్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఈసారి చర్చకు పెట్టనుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు కోటా కల్పించే బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రత్యేక సెషన్ సమయంలోనే పార్లమెంట్‌ను నూతన భవనంలోకి మార్చనుందని భావిస్తున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ మే 28వ తేదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోకి మారాక వివిధ విభాగాల సిబ్బందికి కొత్త యూనిఫాం అందజేసేందుకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ యూనిఫాంపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ముద్రించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ అంశంపైనా ప్రత్యేక సెషన్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ సారథ్యంలో దేశ రాజధానిలో ఇటీవల విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్రం అంశాన్ని పాలకపక్షం చర్చకు తీసుకు వస్తుందని భావిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. నూతన భవనంపై నేడు పతాకావిష్కరణ పార్లమెంట్ నూతన భవనంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి కొత్త భవనంలోనే ప్రారంభం కానున్న దృష్ట్యా జగదీప్ ధన్‌ఖడ్ గజద్వారంపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయింపు
బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ జిల్లాలో వివిధ పత్రికలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(టీడబ్ల్యూజేఎఫ్) పేర్కొంది. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్, వీబీఎన్ పద్మరాజులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డిని కలిసింది. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయింపుపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల డీఈవో సోమిరెడ్డికి హెచ్‌యూజే తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాలు చేస్తున్న విజ్ఞప్తిని డీఈవో అంగీకరించి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ముందుగా పిల్లల ఫొటోలతో ఉన్న దరఖాస్తులను పూర్తిచేసి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయానందరావు, నవీన్, భీష్మాచారి, ఆశాలత, యశోద, నాగమణి తదితరులు ఉన్నారు. త్వరలో కార్డుల పంపిణీ పంజగుట్ట: హైదరాబాద్ జిల్లా పరిధిలోని పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యను అందించడానికి విద్యా శాఖ అధికారులు అంగీకరించడం అభినందనీయమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి పాలకూర రాజు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు టీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో ఫ్రీ ఎడ్యుకేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 15న నగరంలోని తెలంగాణ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. అర్హులైన తెలంగాణ జర్నలిస్టులు తమ పిల్లల ఫొటోలతో పాటు జర్నలిస్టుల ఫొటోలు, గుర్తింపు కార్డులను తీసుకొని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.