breaking news
President Nasser
-
నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు
తమిళసినిమా: నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు వస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్వన్నన్, శరవణన్ తదితరులు సోమవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ టీకే.రాజేందర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. వారాహి అనే న డిగర్ సంఘం సభ్యుడు గత 27వ తేదీన సంఘ నిర్వాహకులు అవినీతికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన 50 మంది సహాయ నటీనటులతో కలిసి సంఘం ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలాన్నే సృష్టించింది. అయితే వారాహి ఆరోపణలకు స్పంధించిన సంఘం కార్యద ర్శి విశాల్, కోశాధికారి కార్తీ ఉద్దేశపూర్వకంగానే వారాహి సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం సంఘం అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్వన్నన్, శరవణన్ తదితరులు నగర పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం విలేకులతో నాజర్ మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన విషయాలను ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా వివరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారాహి అనే వ్యక్తి దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే సంఘంపై ఎలాంటి మరక పడకుండా చేయడానికి ప్రాణాలైనా ఒడ్డుతామన్నారు. తాము ప్రస్తుతం సంఘం సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందుకు సభ్యులతో పాటు, ఇతరులను కలుపుకుని పోతున్నామని తెలిపారు. సంఘ భవన నిర్మాణాన్ని 6 వేల చదరపు అడుగులలో కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అందుకు ఇంకా అనుమతి పొందాల్సి ఉందని అన్నారు. 27వ తారీకున సంఘం ఆవరణలో ఆందోళనకు దిగిన వారు సంఘం ఉద్యోగి ఫోన్ లాక్కుని విసిరేశారనీ తెలిపారు. హత్యా బెదిరింపులు చేశారనీ అన్నారు. బెదిరింపులకు పాల్పడిన చెంగయ్య, రాజు, ఉషా, కోవైలక్ష్మి, అఖిల, రాణి, దేవి తదితరులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. సంఘ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నట్లు నాజర్ తెలిపారు. వారాహి కూడా పోలీస్ కార్యాలయంలో నడిగర్ సంఘం సభ్యులకు వ్యతిరేకంగా ఫిర్యాదు లేఖను అందించారన్నది గమనార్హం. -
‘ఐఫా’కు దక్షిణాది సినీ పరిశ్రమ
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఫార్చున్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రధాన స్పాన్సర్‌గా ఐఫా దక్షిణాది సినీ ఉత్సవాలను డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ ప్రధాన నిర్వాహక సంస్థ విజ్‌క్రాఫ్ట్ డెరైక్టర్ విరాఫ్ సర్కార్ మాట్లాడుతూ భారతీయ సినిమాఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఐఫా 16 ఏళ్ల క్రితం ప్రారంభమైందని తెలిపారు. దక్షిణభారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ హిందీ సినీ పరిశ్రమతో ప్రారంభమైన ఐఫా దక్షిణాదికి విస్తరించడం సంతోషదాయకమని చెప్పారు. కేవలం వినోదం కోసం గాక సామాజిక బాధ్యతతో ఈ వేడుకలను నిర్వహించడం గర్వకారణమన్నారు. ఏడాదికి వెయ్యి సినిమాలు నిర్మితమవుతున్న దక్షిణాదికి ఐఫా చేరుకోవడం సముచితమైన నిర్ణయమని భారత ఫిలిం ఫెడరేషన్ ఉపాధ్యక్షులు రవి కొట్టార్కర అన్నారు. ఐఫా వేడుకలతో దక్షిణాది ప్రతిభ ప్రపంచానికి తెలియాలని ప్రముఖ దర్శకులు పీ వాసు అన్నారు. అదాని గ్రూపు సీవోవో అన్షుమాలిక్ మాట్లాడుతూ ఐఫా పుట్టినపుడే ఆదాని పుట్టిందని, అదే స్థాయిలో ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. ఐఫా వేడుకల్లో అదాని భాగస్వామ్యం కావడం ఆనందకరమన్నారు. నిర్వాహకురాలు గీత మాట్లాడుతూ దక్షిణాది పరిశ్రమలోని టాలెంట్‌ను ప్రపంచానికి చాటేలా ఐఫా వేడుకలు సాగుతాయని, ఎంట్రీల ద్వారా విజేతల ఎంపిక జరుపుతామని తెలిపారు. విజేతల ఎంపిక పారదర్శకంగా సాగాలని నిర్మాత కే ప్రసాద్ సూచించారు. మీడియా పార్టనర్‌గా తామున్నందుకు గర్వపడుతున్నామని సన్‌నెట్‌వర్క్ ప్రతినిధి అనూజ అయ్యర్ అన్నారు. నటుడు మాధవన్, నటీమణులు హన్సిక, సిమ్రాన్, నమిత, రోహిణి, పూజాకుమార్ ఐఫాకు అభినందనలు తెలిపారు.