breaking news
Pre-matric scholarships
-
ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు 9లోపు దరఖాస్తులు
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం నవంబర్ 9వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆదేశించారు. విద్యార్థుల వివరాలను www.epass.cgg.gov.in వెబ్సైట్లో లాగినై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నింపాలన్నారు. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించి తమ దరఖాస్తులను ఆన్లైన్లో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, ధ్రువీకరణ పత్రాలను జతపరిచి దరఖాస్తులను మండల విద్యాధికారి కార్యాలయాల్లో అందజేయాలన్నారు. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 10వ తేదీ నాటికి సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని విజయభాస్కర్ కోరారు. ఇవీ.. జాగ్రత్తలు - ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి అన్ని మండల విద్యావనరుల కేంద్రాల్లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు ఇవ్వాలని ఎంఈవోలను డీఈవో ఆదేశించారు - విద్యార్థులు ముందుగా తమ పేరు లేదా తల్లిదండ్రులు లేదా ఉమ్మడిగా బ్యాంకు ఖాతా తెరిచే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి - విద్యార్థులు సంబంధిత మండలంలో మీ సేవా ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, రూ.2 లక్షలకు లోబడి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందే విధంగా హెడ్మాష్టర్లు చర్యలు తీసుకోవాలి - ఈ వివరాలతో పాటు పాఠశాల వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నింపి దరఖాస్తు ప్రింట్ కాపీ, బ్యాంకు కాపీ మొదటి పేజీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, విద్యార్థి ఫొటో జతచేసి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందజేయాలి - ఈ పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత వాటిని ధ్రువీకరిస్తూ ప్రధానోపాధ్యాయులు సంబంధిత హాస్టల్ వార్డెన్‌కు అందజేయాలి - ప్రధానోపాధ్యాయులు సదరు విద్యార్థి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే మరే ఇతర స్కాలర్షిప్ పొందడం లేదని ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి - అర్హత కలిగిన ఏ విద్యార్థీ ఉపకార వేతనం పొందలేకపోతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. - అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయలు తమ పాఠశాలల్లో చదివే షెడ్యూల్డ్ కూలాల విద్యార్థులతో ఉపకార వేతన దరఖాస్తులను ఆన్లైన్ చేయించే బాధ్యతను తీసుకోవాలని డీఈవో విజయభాస్కర్ ఆదేశించారు. -
ఉపకార‘వెతలు’
సాక్షి, సంగారెడ్డి: డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం అసలు లక్ష్యం చేరుకోవడం లేదు. ఇక ‘ఉపకార’ం కోసం కూడా విద్యార్థులకు వెతలు తప్పడం లేదు. ఈ రెండు పథకాల కింద నిధులు మంజూరైనా పంపిణీ చేయడంలో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. చిన్నచిన్న పొరపాట్లను సాకుగా చూపి విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారు. దీంతో ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలనే నమ్ముకుని ఉన్నత చదువులు చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు. గత విద్యా సంవత్సరం జిల్లాలో 7,592 మంది మైనారిటీ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో విద్యా సంవత్సరం ముగిసినా విద్యార్థులు ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కు నోచుకోలేకపోయారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలను ప్రభుత్వం మూడు విడతల్లో రూ.8.80 కోట్లను ఈ విద్యా సంవత్సరంలో విడుదల చేసింది. దీంతో 6,575 మంది విద్యార్థులకు ఉపకారవేతనా లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందుకున్నారు. కళాశాలలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల 1,017 మంది విద్యార్థులు నిధులు పొందలేకపోయారు. దీంతో విడుదలైన నిధుల్లో ఇంకా రూ.20 లక్షలకు పైగా నిధులు మైనారిటీ కార్పొరేషన్ ఖాతాలో మూలుగుతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రింట్ కాపీ(హార్డ్ కాపీ)లు కళాశాలల నుంచి కార్పొరేషన్ కార్యాలయానికి చేరకపోవడంతో వీరిలో 5,75 మం ది విద్యార్థులు ఈ పథకాన్ని పొందలేకపోయా రు. విద్యార్థుల బ్యాంక్ ఖాతాల సంఖ్య, వారి పేర్లు సరిపోక పోవడంతో మరో 375 మంది విద్యార్థులు ప్రయోజనానికి దూరమయ్యారు. ఆన్లైన్లో దరఖాస్తులు తెరుచుకోకపోవడంతో మరో 100 మంది విద్యార్థులు సైతం స్కాలర్షిప్పులు, బోధన ఫీజులు పొందలేకపోయారు. ఇక గతంలో మంజూరు చేసిన స్కా లర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సంబంధిత విద్యార్థులకు అందినట్లు ధ్రువీకరిస్తూ కళాశాలల యాజమాన్యాలు కార్పొరేషన్‌కు అక్విటెన్స్ సర్టిఫికేట్లు సమర్పించకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థుల దరఖాస్తులను పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రీ మెట్రిక్కు గ్రహణం గత విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తు చేసుకున్న మైనారిటీ విద్యార్థులకు పభుత్వం ఇంకా నిధులను విడుదల చేయలేదు. జిల్లాలో 12,319 మంది విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నా, బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఇంత వరకు ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్‌షిప్పు అందలేదు. అదే విధంగా 6,562 మంది ప్రీమెట్రిక్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్పులు అందాల్సి ఉండగా.. అందులో 4,802 మందికే అవి దక్కాయి. ఇప్పటికే తీవ్ర ఆలస్యం జరిగిపోయిన నేపథ్యంలో తక్షణమే నిధులు విడుదల చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.