టీవీ మీదపడి చిన్నారి మృతి
చిలకలగూడ : స్టాండును లాగడంతో టీవీ మీదపడి చిన్నారి మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం..న్యూమెట్టుగూడకు చెందిన వ్యాపారి ఎస్.ప్రవీణ్‌కుమార్ కుమారుడు ప్రక్రిత్ శ్రీరాం (17 నెలలు) ఈనెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. తల్లి వంట పనిలో నిమగ్నమై ఉంది. ప్రక్రిత్ శ్రీరాం ఆడుకుంటూ టీవీ స్టాండు వద్దకు వెళ్లి దాన్ని పట్టుకుని నిలబడేందుకు యత్నించాడు. దీంతో స్టాండు పైనున్న టీవీ ప్రక్రిత్పై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన కుటుంబసభ్యులు తార్నాకలోని ఇన్నోవా చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రక్రిత్ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.