breaking news
poor quality meals
-
ఈ భోజనం ఎవరు తింటారు బాబు !
-
అన్నంలో పురుగులు, వానపాములు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నంలో పురుగులొస్తున్నాయి.. భోజనంలో వానపాములు వస్తున్నాయి.. వాచ్‌మన్ నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చేయి చేసుకుంటున్నాడు.. ప్రిన్సిపాల్, వార్డెన్,, చివరికి కుక్ కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కారు. దాదాపు 70 మంది హాస్టల్ నుంచి బయటకొచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పురుగుల అన్నం.. నీళ్ల చారు పెడుతున్నారని, ఆ భోజనం తినలేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, వాచ్‌మన్ రామస్వామి, భోజనం వండి పెట్టే భద్రమ్మ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. భోజనంలో వానపాములు వస్తున్నాయని విలపించారు. కాస్మోటిక్ డబ్బులను సైతం ప్రిన్సిపాల్ కాజేస్తోందని చెప్పారు. వాచ్‌మన్ రామస్వామి నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తమపై చేయి చేసుకుంటున్నారని ఆరోపించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్మన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళన తెలుసుకున్న ఎస్సై శేఖర్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సంఘటనపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించారు. తక్షణమే పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ను ఆదేశించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారిని కూడా వెళ్లి అక్కడి పరిస్థితులు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. ఆందోళన చెందొద్దని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. ప్రిన్సిపాల్, వాచ్‌మన్‌పై వేటు.. అదనపు ప్రిన్సిపాల్ రామారావుకు బాధ్యతలు కాగా, ఘటనపై గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న స్పందించారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలడంతో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న రామారావుకు ప్రిన్సిపాల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రామస్వామిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. మా మీదే ఫిర్యాదు చేస్తారా.. లోనికి ఎలా వస్తారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం తొలుత విద్యార్థినులపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. ఆందోళన ముగిసిన తర్వాత విద్యార్థినులు పాఠశాలకు చేరుకోగా.. గేటుకు తాళంవేసి లోనికి అనుమతించలేదు. ఎవరికి చెప్పి బయటకు వెళ్లారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు గేటు ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాఠశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడి, విద్యార్థినులను లోనికి పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని గేటు ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న మాట్లాడి ప్రిన్సిపాల్‌తో పాటు వాచ్‌మన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో ఆందోళన విరమించారు. -
మధ్యాహ్నం.. అధ్వానం
⇒ మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం ⇒ మెత్తని అన్నం.. నీళ్లచారే దిక్కు ⇒ ఇంటి నుంచి తెచ్చుకుని తింటున్న విద్యార్థులు ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం పథకం అధ్వానంగా మారుతోంది. ఉడికీఉడకని మెత్తటి అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఒక గుడ్డు ఇవ్వడానికే పరిమితమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలోని చాలా ఏజెన్సీలు మెనూ పాటించడం లేదు. నీళ్లచారు, మెత్తటి అన్నంతో సరిపెడుతున్నారు. దీంతో సగం మంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. మరికొంత మంది నాణ్యతలేని భోజనం చేస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలో ఉపాధ్యాయులు పట్టించుకోక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 1172 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 954 ఉండగా, 44,064 మంది విద్యార్థులు చదువుతున్నారు. 112 ప్రాథమికోన్నత పాఠశాలుండగా ఇందులో 18,073 మంది, 106 ఉన్నత పాఠశాలల్లో 10,304 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 72,441 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.4.13 పైసలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.6.18పైసల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. అలాగే ఒక్కో విద్యార్థికి వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలి. ఒక్కో గుడ్డుకు రూ.4 చొప్పున నిధులు విడుదల చేస్తోంది. నాణ్యతలేని భోజనమే దిక్కు.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయిస్తోంది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ప్రతీరోజు విద్యార్థులకు అన్నం, సాంబార్, పప్పు వండిపెట్టాలి. కానీ చాలా ఏజెన్సీలు కక్కుర్తితో నీళ్లచారు వడ్డిస్తున్నారు. వారంలో మూడుసార్లు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ చాలా పాఠశాలల్లో ఇది అమలు కావడం లేదు. వారంలో ఒకరోజు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల కోడిగుడ్లకు బదులు అరటిపండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సన్నరకం బియ్యం అయినప్పటికీ అన్నం మెత్తగా కావడంతో సగం మంది విద్యార్థులు తినలేకపోతున్నారు. ఇంటినుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుని పాఠశాలల్లో భోజనం చేస్తున్నారు. కొంతమంది ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కుమ్మక్కై భోజనం చేయని విద్యార్థుల డబ్బులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లోపించిన పర్యవేక్షణ.. ఏజెన్సీల నిర్లక్ష్యం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిం ది. విద్యార్థులకు మెరుగైన ఆహారం అందడం లేదు. ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మండ ల విద్యాధికారులు కనీసం పాఠశాలలను నెలకోసారి తనిఖీ చేయాలి. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. చాలామంది ఎంఈవోలు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. వీరితో పాటు ఉప విద్యాధికారులు తనిఖీ చేయాల్సి ఉండగా, వారు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వారం భోజనం సోమవారం ఉడికించిన కోడిగుడ్లు, అన్నం, సాంబార్ మంగళవారం కూరగాయలతో భోజనం బుధవారం అన్నం, పప్పు, కూరగాయలతో భోజనం, ఉడికించిన కోడిగుడ్లు గురువారం సాంబార్ పప్పు భోజనం శుక్రవారం కూరగాయలతో భోజనం, ఉడికించిన కోడిగుడ్లు శనివారం పప్పు, ఆకుకూరలతో భోజనం పకడ్బందీగా అమలు చేస్తాం మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. మెనూ ప్రకారం పాఠశాలల్లో భోజనం పెట్టాలి. వారానికి మూడు ఉడికించిన కోడిగుడ్లు విద్యార్థులకు ఇవ్వాలి. ప్రధానోపాధ్యాయులు ప్రతీరోజు మధ్యాç ßæ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. కుకింగ్ కాస్ట్ కూడా పెరిగింది. నిర్వాహకులు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించా లి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. – కె.లింగయ్య, డీఈవో, ఆదిలాబాద్ గర్భిణులకు రక్త పరీక్షలు తప్పనిసరి ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): గర్భిణులు రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంత్‌రావు అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా బుధవారం మండల కేంద్రంలోని సబ్సెంటర్లో ఆయన గర్భిణులకు చేస్తున్న రక్త పరీక్షలు, బీపీ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 39 సబ్‌సెంటర్ల పరధిలోని గర్భిణులకు కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట ఏఎంవో వెంకటేశ్వర్లు తదితరులున్నారు.