breaking news
Poor pregnant women
-
పేద గర్భిణులకు చేయూత
ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం: సీఎం కేసీఆర్ ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా చర్యలు తీసుకోండి ♦ అందుకు ప్రోత్సాహకాలు అందించండి ♦ బిడ్డకు అవసరమయ్యే వస్తువులను కిట్ రూపంలో ఇవ్వండి ♦ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు బాగున్నాయనే నమ్మకం ప్రజలకు కలిగించాలి ♦ శిశు మరణాలను సున్నా స్థాయికి తీసుకురావాలి ♦ పేదలకు వైద్యం అందించే వైద్యుల జీతాలను సవరిస్తాం ♦ వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: పేద గర్భిణులకు తగినంత ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపు పెంచడంతోపాటు వాటిని ఎప్ప టికప్పుడు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో తీసుకోవా ల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కమిషనర్ వాకాటి కరుణ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రసూతి సమయంలో పేద గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రూపాయల బిల్లులు చెల్లించడం కష్టమన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో పేద గర్భిణులు కచ్చితంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి ప్రసూతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి ఏర్పాట్లు బాగున్నాయనే నమ్మకం పేదలకు కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల నుంచీ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. అమ్మ ఒడి పేరుతో గర్భిణులను ఆస్పత్రికి తీసుకురావడం... తీసుకుపోవడం చేస్తున్నారన్నారు. ఇంకా అనేక చర్యలు చేపట్టాలన్నారు. పేదలు.. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు చెందినవారు ఇంకా ఇళ్లల్లోనే ప్రసవమవుతున్నారని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వందకు వందశాతం ఆస్పత్రుల్లోనే ప్రసూతి అయ్యేలా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సాంస్కృతిక సారథి ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో మీడియా కూడా సహకరించాలని కోరారు. ప్రోత్సాహకాలు ఇవ్వండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయ్యే వారికి ప్రోత్సాహకాలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గర్భిణీగా ఉన్నప్పుడు వారు కూలీ, వ్యవసాయం ఇతరత్రా పనులు చేసుకోలేరన్నారు. ఆ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని, అయితే ఇది పేద కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతుందని, అందుకే వారికి సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా ఒక పూట పౌష్టికాహారం అందిస్తున్నా.. వారికి మరింత సాయం అవసరం అన్నారు. ప్రసవం అయ్యాక తల్లీబిడ్డల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రసూతి సమయంలో శిశువుల మరణాలను జీరో స్థాయికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బిడ్డకు మూడో నెల వచ్చే వరకు కావాల్సిన వస్తువులను ప్రభుత్వమే ఒక కిట్ రూపంలో బహుమానంగా అందించాలన్నారు. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి 2017–18 బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామన్నారు. ఈ విషయంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదన్నారు. సర్కారీ వైద్య సేవలు మెరుగయ్యాయి గతేడాది బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు తెస్తూ భారీగా నిధులు కేటాయించామని సీఎం వివరించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో... మందుల పంపిణీలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు. ఈసారి బడ్జెట్లో.. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ వైద్యుల జీతాలు కూడా సవరించాలనే యోచన ఉందన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఢిల్లీలో మొహల్లా క్లినిక్ పేరుతో బస్తీల్లో వైద్య సేవలు విస్తరించారన్నారు. హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఇతర కార్పొరేషన్లలో కూడా ఇలాంటి ప్రయత్నం చేయాలన్నారు. దీనిపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో పేదలకు అందుతున్న వైద్య సేవల విధానాన్ని అధ్యయనం చేస్తున్న అధికారుల బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లొచ్చిందని.. ఢిల్లీతోపాటు మరిన్ని రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేసి రావాలని సీఎం సూచించారు. -
ఆ పేద తల్లిబిడ్డలను రక్షించేదెలా..?
లండన్: ఇంటివద్ద పురుడు పోసే విధానానికి స్వస్తి పలికి ఆస్పత్రుల్లో సురక్షితమైన పరిస్థితుల మధ్య డెలివరీకి అవకాశాలు కల్పించిన భారత్.. డెలివరీ సమయంలో మాతా, శిశుమరణాలు మాత్రం అరికట్టలేకపోతుందని ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు ఆ సర్వే తెలిపింది. స్వీడన్ లోని ఉమియా యూనివర్సిటికీ చెందిన అధ్యయన కారులు భారత్ లో చోటుచేసుకుంటున్న మాతా శిశు మరణాలకు సంబంధించి శోధించి వాటి వివరాలు తెలియజేశారు. జనని సరుక్ష యోజన(జేఎస్ వై) కార్యక్రమం ద్వారా ప్రసవాలు సురక్షిత పరిస్థితుల మధ్య జరిగే సౌకర్యాలు కల్పించినప్పటికీ.. బిడ్డకు జన్మనిచ్చే తల్లి, ఆ బిడ్డ అనారోగ్య పరిస్థితుల కారణంగా అనూహ్య మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ అంశాన్ని భారత్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ అధ్యయనం వెల్లడించింది. పేద గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు వారికి నేరుగా నగదు బదిలీవంటివి చేసి, పౌష్టికాహారం వారే తీసుకునే సౌకర్యాలు కూడా అధ్యయనకారులు సూచించారు. ఈ అధ్యయనం కోసం భారత్ లోని తొమ్మిది పేద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకొని అక్కడ చోటుచేసుకుంటున్న మాతాశిశుమరణాలు, అందుకుగల కారణాలు శోధించి వాటిని వెల్లడించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే పేద రాష్ట్రాల్లో ప్రతి లక్షమందిలో 135మంది అదనంగా చనిపోతున్నారని కూడా అధ్యయనకారులు వెల్లడించారు. -
గర్భిణులకు అన్యాయం జరిగితే ఊరుకోం
- సీఎం స్పందించకుంటే మా ప్రతాపం చూపుతాం - జూనియర్ డాక్టర్లకు మద్దతు తెలిసిన సీపీఐ జాతీయ నేత నారాయణ తిరుపతి అర్బన్: నిరుపేద గర్భిణులకు అన్యాయం జరిగితే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.నారాయణ హెచ్చరించారు. 300 పడకల గర్భిణీల భవనాలను మెటర్నిటీకే కేటాయించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు బుధవారం 15వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్ల ఆధ్యర్యంలో జూ.డాల సంఘం నేతలు, ఇతర నాయకులు రుయా ఎదుట నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు సీపీఐ నారాయణ సంఘీభావం తెలిపారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ఎస్వీ మెడికల్ కాలేజీకి దశాబ్దాలుగా గుర్తింపు ఉందన్నారు. అలాంటి కాలేజీ పరిధిలోని ఆస్పత్రులను నిర్వీర్యం చేయాలని చూస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉంటాయి? ఇక్కడికి వచ్చేవారి పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశాలపై హైదరాబాద్‌లోని ఒక్క అధికారికైనా అవగాహన ఉందా..! అని ప్రశ్నించారు. ఈ ఆస్పత్రుల ప ట్ల ఏమాత్రం అవగాహన లేనివారే ఇలా ఇష్టమొచ్చిన ట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆందోళన గురించి సీఎంగా చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయకుంటే పోరాటాల పార్టీ ప్రతాపం ఏం టో చూపుతామన్నారు. తాము కూడా మరింత మొండివైఖరితో ముందుకెళ్లి 300 పడకల భవనాలను ఆక్రమించుకుని మెటర్నిటీ వైద్యులకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. ఆస్పత్రి భవనాల విషయంలో స్వి మ్స్ అధికారులు కూడా నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని హితవు పలికారు. చివరగా నారాయణ 300 పడకల కొత్త భవనాలను, మెటర్నిటీ హాస్పిటల్‌లోని వార్డులను సందర్శించారు. జూ.డాల నాయకులు నారాయణకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకయ్య, నగర కార్యదర్శి పెంచలయ్య, కార్యవర్గ సభ్యులు మురళి, రాధాకృష్ణ, ఎన్డీ రవి, వెంకటేష్, నరేష్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యదర్శి శోభ, రత్నమ్మ, పల్లవి, మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.