breaking news
Perera
-
నిరాశపరిచిన పెరీరా, జయవర్థనే
అహ్మదాబాద్: భారత్ తో గురువారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పెరీరా పరుగులేమీ చేయకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దిల్షాన్, సంగక్కర్ 55 పరుగుల వరకు రెండో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 35 పరుగులు చేసిన దిల్షాన్ ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. 64 పరుగుల వద్ద సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్థనే(4) మూడో వికెట్ గా అవుటయ్యాడు. 21 ఓవర్లలో 98/3 స్కోరుతో లంక ఆట కొనసాగిస్తోంది. -
అతని వెనుక ఆ ముగ్గురు..
ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందిన చాలా మంది ప్రముఖుల ప్రస్థానాన్ని గమనిస్తే నిజంగానే ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రపంచ టెన్నిస్ రంగంలో సంచలన ఆటతీరుతో గ్రాండ్‌స్లామ్ పంటపండించుకుంటున్న స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ జీవితంలోనూ ఈ కోణం కనిపిస్తుంది. అయితే అతడి విజయాల వెనుక ఉన్నది ఒక్క మహిళ కాదు.. ఏకంగా ముగ్గురు. తల్లి, చెల్లి, ప్రియురాలి సహకారంతో నాదల్ ఏకంగా ప్రపంచ టెన్నిస్‌నే ఏలగలుగుతున్నాడు. ‘నా చిన్న వయసులోనే లెక్కలేనంత డబ్బు.. పేరు ప్రఖ్యాతులు వచ్చి పడ్డాయి. దీనివల్ల నా ఆట గతి తప్పకుండా, లక్ష్యం వైపు పయనించే వాతావరణాన్ని సృష్టించింది నా కుటుంబమే. ఒక రకంగా వారు లేకుండా ఈ సంపద, విజయాలు నాకు దక్కడం అసంభవం’ - ఫ్యామిలీపై నాదల్ మనోగతం. అనా మరియా పెరీరా (తల్లి) మైదానంలో చిచ్చరపిడుగులా చెలరేగుతూ బలమైన సర్వ్‌లు సంధించే నాదల్ నిజానికి చాలా భయస్తుడు. చూడ్డానికి యోధుడిలా ఉంటూ మెరుపుల్లాంటి షాట్లతో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేస్తాడు. కానీ తనకు నిజంగానే పిడుగులన్నా.. మెరుపులన్నా భయం. అంతెందుకు చీకటంటేనే జడుసుకుంటాడు. పడుకున్నా లైట్ వెలగాల్సిందే.. లేకపోతే టీవీ ఆన్‌లోనే ఉండాలి. మొత్తానికి అతనో సూపర్ సెన్సిటివ్. ఇలాంటి లక్షణాలున్న ఈ స్పెయిన్ హీరోని అతడి తల్లి అనా మరియా పెరీరా కంటికి రెప్పలా కాపాడుకుంది. విజయాల వైపు దృష్టి మరల్చేలా చేసింది. తనలో ధైర్యాన్ని పెంచి మంచి క్రీడాకారుడిగా తయారుచేసింది. మరిబెల్ (చెల్లి) నాదల్కు తన చెల్లి మరిబెల్ అంటే ప్రాణం. తనకు కూడా అంతే. సహజంగా అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే గిల్లికజ్జాలు.. ఒకరిపై మరొకరి చాడీలు వీరి మధ్య కనిపించవు. నాదల్ తనకు బాధ, సంతోషం ఏది కలిగినా చిన్నప్పటి నుంచీ చెల్లితోనే తొలుత పంచుకునేవాడు. తనకన్నా చిన్నదైనా చాలా పరిణతితో కూడిన సలహాలు ఇచ్చేదని నాదల్ చెబుతుంటాడు. తాము టీనేజ్‌లో ఉండగా అతడి స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు తననూ తీసుకెళ్లేవాడని.. ఇది ఇతరులకు వింతగా అనిపించినా తమ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధానికి గుర్తుగా నిలుస్తుందని తెలిపింది. మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో (ప్రియురాలు) నాదల్ గురించి బాగా తెలిసిన మనిషి మరియా. స్వతహాగా ఆమె లైమ్‌లైట్‌లో ఉండాలని భావించదు. నాదల్ స్వభావం కూడా అంతేనని, సెలబ్రిటీ ప్రపంచంలో ఇమడలేనని అనుకుంటాడని మరియా చెప్పింది. ఇద్దరూ జంటగా కూడా బయట ఎక్కువగా కనిపించరు. వెనకాలే ఉంటూ నాదల్‌ను మున్ముందుకు పంపాలనే తాపత్రయం మరియాది. ఊహించని పరాజయం ఎదురైనప్పుడు. అతి పెద్ద విజయం సాధించినప్పుడు నాదల్ భావోద్వేగాలను నియంత్రించి తనని మళ్లీ మామూలు మనిషిని చేసే వ్యక్తి మరియా. -
మరో నలుగురు!
ముంబై: ఐపీఎల్-6 ఫిక్సింగ్ ఉదంతంలో మరో నలుగురు క్రికెటర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు హనుమ విహారి, ఆశిష్ రెడ్డి, కరణ్ శర్మ, తిసారా పెరీరా కలిసి రూ. 6 కోట్లు తీసుకున్నారని ఓ బుకీ ముంబై పోలీసులకు చెప్పాడు. గత శనివారం ఫైల్ చేసిన చార్జిషీట్లో ముంబై పోలీసులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ఏప్రిల్ 17న పుణే, సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ నలుగురు ఆటగాళ్లు తమకు సహకరించారని బుకీ చంద్రేశ్ పటేల్ విచారణలో పోలీసులకు చెప్పాడు. ‘సన్‌రైజర్స్ మ్యాచ్‌ను ఫిక్స్ చేయడానికి రూ. 5 కోట్లు ఆటగాళ్లకు ఇవ్వాలని, ఒక కోటి తమకు కమిషన్ అని యూసుఫ్ అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించాడు. ఏప్రిల్ 16న పుణేలోని ఒక హోటల్లో ఈ నలుగురు ఆటగాళ్లను మాకు పరిచయం చేశాడు. సన్‌రైజర్స్ స్కోరు తొలి 10 ఓవర్లలో 60, మొత్తం 20 ఓవర్లలో 140 పరుగులు దాటకూడదని మాట్లాడుకున్నాం. అలాగే మ్యాచ్ ఓడిపోవాలని కూడా అడిగాం’ అని పటేల్ చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచింది. మ్యాచ్ మీద రూ.9 కోట్లు పందెం కాసిన చంద్రేశ్ ఆ మొత్తం ఓడిపోయాడు. స్కోర్ల మీద రూ.3.5 కోట్లు పందెం కాసి గెలిచాడు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా వెలువడే ఓ ఆంగ్ల పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఆటగాడి సోదరుడు సూత్రధారి? చార్జిషీట్లో ముంబై పోలీసులు హైదరాబాద్ ఆటగాడు ఆశిష్ రెడ్డి సోదరుడు ప్రీతమ్ రెడ్డి పేరును ప్రస్తావించారు. ‘బుకీలు ప్రీతమ్తోనే డీల్ కుదుర్చుకున్నారు. రూ. 6 కోట్లు ఇస్తామని ఫిక్సింగ్ చేయాలని బుకీలు అతడిని కోరారు. దీనికి అతను అంగీకరించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వికెట్ పడితే డీల్ ఓకే అయినట్లని ప్రీతమ్ బుకీలతో చెప్పాడు. (ఆ మ్యాచ్‌లో డి కాక్ రెండో ఓవర్లో అవుటయ్యాడు) దీంతో బుకీలు పందేలు కాశారు’ అని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. విచారణకు ఎందుకు పిలవలేదు? పోలీసులు చార్జిషీట్లో ఈ నలుగురు క్రికెటర్ల పేర్లను ప్రస్తావించారు. బుకీ చంద్రేశ్ జూన్ 17న ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నలుగురు క్రికెటర్లను పోలీసులు విచారణకు ఎందుకు పిలవలేదనేది పెద్ద ప్రశ్న. అంటే బుకీ చెప్పిన విషయాన్ని పోలీసులు నమ్మలేదా? లేక తగిన సాక్ష్యాలు లభించలేదా? అనేది తేలాల్సి ఉంది. ఏమైనా విహారి, ఆశిష్ రెడ్డి లాంటి వర్ధమాన క్రికెటర్ల భవిష్యత్‌కు ఇది పెద్ద దెబ్బ. ప్రస్తుతం జట్టుతోనే... ఆరోపణలు వచ్చిన నలుగురు క్రికెటర్లు ప్రస్తుతం చాంపియన్స్ లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. వీరంతా జట్టుతో పాటే మొహాలీలో ఉన్నారు. ఒకవేళ వీళ్ల మీద అనుమానం ఉంటే కనీసం బీసీసీఐకి గానీ, జట్టుకు గానీ పోలీసులు చెప్పాల్సింది. కానీ ఇప్పటివరకూ జట్టుకు అలాంటి సమాచారం ఏమీ లేదు. మేం నమ్మడం లేదు: లంక బోర్డు తమ ఆటగాడు తిసారా పెరీరా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన కథనాలను శ్రీలంక బోర్డు ఖండించింది. పెరీరా మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని పేర్కొంది. ‘ఈ విషయం గురించి భారత్‌లోని అధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. మా క్రికెటర్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతను అలాంటి పనులకు పాల్పడడు’ అని లంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ‘మా అబ్బాయి మీద నమ్మకం ఉంది’ ఫిక్సింగ్ కథనాన్ని విహారి తల్లి విజయలక్ష్మి ఖండించారు. ఇవన్నీ ఆధారం లేని కథనాలని పేర్కొన్నారు. ‘మా అబ్బాయి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుర్రాడు ఇలా ఎందుకు చేస్తాడు? ఇవన్నీ నిరాధార కథనాలు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రస్తుతం ఇంతకంటే మాట్లాడటానికేం లేదు’ అని ఆమె ‘సాక్షి’తో చెప్పారు.