penmetsa vishnu kumar raju
-
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజుకు షోకాజ్ నోటీస్?
సాక్షి విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో విష్ణుకుమార్ రాజు సంబంధం లేని వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. పార్టీవర్గాల కథనం ప్రకారం.. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. వ్యాఖ్యలపై ఆదివారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే సస్పెన్షన్‌కు గురికావలసి వస్తుందని హెచ్చరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై అసత్య ఆరోపణలు, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి పిలవకపోయినా పిలిచినట్లు ప్రస్తావిస్తూ అబద్ధపు మాటలు ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. -
ఒకటి రెండుసార్లు నేను కూడా కొన్నాను
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చ జరిగింది. అలాగే జాతీయ రహదారులపై బార్లు వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. వాహనాలు నడిపే డ్రైవర్లు కొందరు మద్యానికి బానిసలై వుండడంతో రాత్రిపూట హైవేలపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బార్లు ఆకర్షించేలా ఉండటం వల్ల ....తాను కూడా ఒకటి, రెండుసార్లు మద్యం కొన్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, బార్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుల అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని.. పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఎ.సురేష్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు, పి.విష్ణుకుమార్‌రాజు, రామారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఇదే విషయంపై వివరణ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని.. భవిష్యత్‌లో మరింత దృష్టి పెడతామని ప్రభుత్వం సమాధానమిచ్చింది.